Bharat Nyaya Jodo Yatra: ముగిసిన భారత్ జోడో న్యాయ యాత్ర- కాంగ్రెస్ పుంజుకున్నట్టేనా?
కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ముగిసింది. వచ్చేపార్లమెంటు ఎన్నికల్లో ఈ యాత్ర ఏమేరకు ప్రభావం చూపిస్తుందనేది ప్రధానచర్చగా మారింది.
Bharat Nyaya Jodo Yatra: కాంగ్రెస్(Congress) పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన `భారత్ జోడో న్యాయ యాత్ర`(Bharth Jodo Nyay Yatra) ఆదివారం ముగిసింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి ఈ ఏడాది జనవరి(January-2024) 14న ప్రారంభమైన ఈ యాత్ర 6,700 కిలోమీటర్ల మేర సాగింది. ఆదివారం మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శివాజీ పార్క్ వద్ద రాహుల్ గాంధీ ముగింపు పలికారు. వాస్తవానికి గత ఏడాది 2023లోనే తొలి దశ యాత్రను చేపట్టిన రాహుల్ గాంధీ.. భారత్ జోడో పేరుతో యాత్రను ప్రారంభించారు. అప్పట్లో ఏపీ, తెలంగాణల మీదుగా కూడా ఈ యాత్ర సాగింది. అయితే.. రెండో దశలో మాత్రం ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగారు.
ఇదీ లక్ష్యం..
కేంద్రంలోని నరేంద్ర మోడీ(PM Narendra Modi) సర్కారుపై యుద్ధం ప్రకటించిన రాహుల్ గాంధీ.. ప్రధాని తన మనసులోని భావాలనే ప్రజలకు పంచుతున్నారని, ప్రజల మాటలను వినిపించుకోవడం లేదని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో అణగారిన వర్గాల వారి మాట వింటానని ఆయన రోడ్డెక్కారు. ఈ క్రమంలోనే మణిపూర్‌లో ఆయన రెండో దశ యాత్ర ప్రారంభమైంది. ఘర్షణలతో అట్టుడికిపోతున్న కల్లోల మణిపూర్ రాష్ట్రానికి శాంతి, సామరస్యం తిరిగి తీసుకొస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మణిపూర్‌లోని థౌబాల్ నుంచి ‘భారత్ జోడో న్యాయ యాత్ర’కు జనవరి 14న ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత ఖోంగ్‌జామ్ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. మోడీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దృష్టిలో మణిపూర్(Manipur) రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం కాకపోవచ్చని ఆక్షేపించారు. ‘‘మీ బాధను వారి బాధగా భావించడం లేదు. కానీ మీ దుఃఖాన్ని, మీకు తగిలిన గాయాలు, మీరెదుర్కొంటున్న విచారాన్ని మేం అర్థం చేసుకున్నాం’’ అని చెప్పారు.
బాధితులు ఆప్యాయతను కోరుకుంటున్నారని రాహుల్ అన్నారు. అంతేకాదు.. దేశంలో అన్యాయ కాలం కొనసాగుతున్నందు వల్లే న్యాయ యాత్ర చేపట్టాల్సి వచ్చిందని రాహుల్ పేర్కొన్నారు. ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్యాయాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలను ఏకం చేయాలన్నదే ఈ యాత్ర ఉద్దేశమని వివరించారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, సామరస్యంతో కూడిన ‘న్యూ విజన్ ఆఫ్ ఇండియా’ను సాధించడం ధ్యేయమని స్పష్టం చేశారు.
యాత్ర సాగుతున్నప్పుడే..
రాహుల్ చేపట్టిన యాత్ర సాగుతున్నప్పుడే ఇండియా కూటమి బీటలు వారింది. రాహుల్ గాంధీ న్యాయ యాత్ర మిత్రపక్షాల మద్దతు కోసం చాలా కాలంగా వేచి చూసింది. రాహుల్ పశ్చిమ బెంగాల్ చేరుకున్నప్పుడు సీఎం మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. యాత్రకు దూరంగా ఉన్నారు. అంతేకాదు.. యాత్రకు తొలుత అనుమతులు కూడా ఇవ్వలేదు. ఇక, యాత్ర బెంగాల్ నుంచి బిహార్‌కు చేరుకోగానే నితీష్ కుమార్ ఇండియా కూటమి మారి మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాహుల్ బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లినప్పుడు, అఖిలేష్ యాదవ్ రాహుల్ యాత్రలో పాల్గొంటారనే గ్యారెంటీ లేదు. పార్లమెంటు సీట్ల పంపకం పూర్తయిన తర్వాతే తాను భారత్ జోడో న్యాయ యాత్రలో చేరతానని అఖిలేష్ యాదవ్ స్వయంగా ప్రకటించారు. ఇలా.. అనేక తర్జన భర్జనలతో మిత్ర పక్షాల అసంతృప్తి స్వరాలతోనే యాత్ర ముందుకు సాగింది.
ముగిసిన యాత్ర
తాజాగా ఆదివారం భారత జోడో న్యాయ యాత్ర ముంబైలో ముగిసింది. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే తదితరులు చివరి రోజు యాత్రలో పాల్గొన్నారు. కాగా... జనవరి 14న మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ప్రారంభమైన ఈ యాత్ర `న్యాయం కోసం పోరాటం` నినాదంతో సాగింది. మొత్తంగా ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ నియోజవర్గాల మీదుగా కొనసాగింది. 110 జిల్లాల మీదుగా సాగిన ఈ యాత్రకు కొన్ని చోట్ల విశేష స్పందన రాగా.. మరికొన్ని చోట్ల పెద్దగా రియాక్షన్ రాలేదు. ఇక, అసోంలో బీజేపీ ప్రభుత్వం రాహుల్‌పై కేసులు నమోదు చేయడం, సీఎం హిమంత బిశ్వశర్మ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం ఎంత?
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర పార్లమెంటు ఎన్నికలపై ఏమేరకు ప్రభావం చూపిస్తుందనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. ఎందుకంటే యాత్ర సాగుతున్న సమయంలోనే కీలక నేతలు పార్టీకి దూరమయ్యారు. మహారాష్ట్రలోనే సీనియర్లు పార్టీని వీడారు. మరోవైపు మోడీ ప్రభావాన్ని సరైన విధంగా ఎదుర్కొనే పటిమ కూడా కనబరచలేక పోవడం గమనార్హం. దీంతో యాత్ర తాలూకు ప్రభావం పార్లమెంటు ఎన్నికలపై పెద్దగా ప్రభావం చూపించడం కష్టమేనని అంటున్నారు పరిశీలకులు.