Doda Terror Attack: ఉగ్రవాదుల స్కెచ్‌ల విడుదల, వారి గురించి చెబితే రూ.20 లక్షల రివార్డు మీవే!
Jammu And Kashmir: దోడా జిల్లాలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల స్కెచ్‌లను జమ్మూ కశ్మీర్ పోలీసులు బుధవారం విడుదల చేశారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున నలుగురికి రూ. 20 లక్షల రివార్డును ప్రకటించారు.
Terror Attack In Doda: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మూడు రోజుల వ్యవధిలో ఉగ్రవాదులు మూడుసార్లు దాడులు చేశారు. దోడా జిల్లాలోని భదర్వా- పఠాన్‌కోట్ రహదారి సమీపంలోని ఒక చెక్‌పోస్టుపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఉగ్రదాడి జరిగింది. ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా ఉగ్రవాదులను ఎదుర్కొన్నారు. కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఆరుగురు భద్రతా సిబ్బంది, ఒక పోలీసు అధికారి, ఒక పౌరుడు గాయపడ్డారు.
ఒక్కొక్కరికి రూ.5 లక్షలు
దోడా జిల్లాలో రెండు చోట్ల దాడులకు పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల స్కెచ్‌లను జమ్మూ కశ్మీర్ పోలీసులు బుధవారం విడుదల చేశారు. భదేర్వా, థాత్రి, గండోహ్ ఎగువ ప్రాంతాల్లో వీరు ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఒక్కో ఉగ్రవాదికి రూ.5 లక్షల చొప్పున నలుగురికి కలిసి రూ. 20 లక్షల రివార్డును ప్రకటించారు. స్కెచ్‌లతో సరిపోలిన ఉగ్రవాదుల ఉనికి, కదలికల గుర్తిస్తే సమాచారం అందించాలని ప్రజలకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
J&K | Doda police release sketches of four terrorists who are roaming in the upper reaches of Bhaderwah, Thathri, and Gandoh and are involved in terror-related activities.
— ANI (@ANI) June 12, 2024
J&K police announce a cash reward of Rs. 5 lakhs for providing the information of each terrorist. pic.twitter.com/shR2WvIZVQ
రెండు చోట్ల ఉగ్రదాడులు
దోడా ఎగువ ప్రాంతంలోని చెక్‌పోస్టుపై ఉగ్రవాదుల దాడులు జరిగాయి. బుధవారం తెల్లవారుజామున 1.45 గంటలకు మొదటి దాడి జరిగింది. భదర్వా-పఠాన్‌కోట్ రహదారిలోని దోడాస్ చత్తర్‌గాలా ప్రాంతంలోని నలుగురు రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల జాయింట్ చెక్‌పోస్ట్‌పై నలుగురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు సైనికులు, ఒక ప్రత్యేక అధికారి గాయపడ్డారు. చత్తర్‌గాలాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట టాప్ ప్రాంతంలో రెండో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ ఫరీద్ అహ్మద్ గాయపడ్డాడు. ఈ రెండు దాడులను భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి.
ఉదయం వరకు కాల్పుల మోత
అలాగే కథువాకు దాదాపు 220కి.మీ దూరంలో మంగళవారం అర్థరాత్రి కాల్పులు జరిగాయి. బుధవారం ఉదయం వరకు తుపాకుల మోత మోగుతూనే ఉంది. ఈ కాల్పుల్లో ఒక సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ మరణించారు, ఆరుగురు భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు గాయపడ్డారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
విదేశీ ఉగ్రవాదం పెరిగింది
జమ్మూ కశ్మీర్‌లో విదేశీ ఉగ్రవాదం పెరిగిందని పోలీసు డైరెక్టర్ జనరల్ ఆర్ఆర్ స్వైన్ అన్నారు. 70 నుంచి 80 మంది ఉగ్రవాదులు ఆయుధాలు, మందుగుండు సామగ్రితో దాడులకు వచ్చారని తెలిపారు. ఉగ్రవాదుల్లో చేరే స్థానికుల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. జమ్మూ ప్రాంతంలో శాంతి భద్రతలకు భంగం కలిగించడానికి శత్రుదేశం కుట్రలు పన్నుతోందని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. శత్రువులను ఎదర్కొనేందుకు తామెప్పుడూ సిద్ధంగానే ఉంటామని ఆయన చెప్పారు.