Kashmir Delimitation : జమ్మూకశ్మీర్,లద్దాఖ్‌లలో పెరిగిన అసెంబ్లీ సీట్లు - కొత్తగా వారికి కూడా ఓటింగ్ హక్కులు ?
జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన పూర్తయింది. కేంద్రం ఆమోదించాల్సి ఉంది. అయితే ఈ పునర్విభజన ప్రక్రియపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణ దిశగా కేంద్రం కీలకమైన అడుగులు వేస్తోంది. రెండు రాష్ట్రాలుగా విభజించిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టింది. డీలిమిటేషన్ కమిషన్‌ను నియమించారు. ఈ కమిషన్ తన నివేదికను సమర్పించింది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ రంజనా దేశారు నేతృత్వంలోని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, జమ్ము కాశ్మీర్ ఎన్నికల కమిషనర్ కెకె శర్మలతో కూడిన జమ్మూకాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ఆర్డర్‌ను ఖరారు చేశారు. నియోజకవర్గాల సంఖ్య, విస్తీర్ణం వంటి వివరాలతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్డర్ కాపీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తేదీ నుంచి డీలిమిటేషన్ అమలులోకి వస్తుంది.
లద్దాఖ్‌లో ఎక్కువ - మణిపూర్‌లో తక్కువ ! లింగనిష్పత్తి రిపోర్ట్‌లో కీలక అంశాలు
జమ్ముకాశ్మీర్‌లోని అసెంబ్లీ స్థానాల సంఖ్యను 83 నుంచి 90కి పెంచాలని, అందులో 43 జమ్మూ ప్రాంతానికి, 47 కాశ్మీర్ ప్రాంతానికి కేటాయిస్తూ ప్రతిపాదించింది. జమ్ములో 6 స్థానాలు, కాశ్మీర్‌లో ఒక స్థానం కమిషన్ అదనంగా ప్రతిపాదించింది. చరిత్రలోనే తొలిసారి షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ)కు తొమ్మిది సీట్లు కేటాయించింది. వీటిలో 6 జమ్ము ప్రాంతంలోనూ, 3 కాశ్మీర్ లోయలో ఉన్నాయని కమిషన్ పేర్కొంది. జమ్ము కాశ్మీర్‌లో ఐదు లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. డీలిమిటేషన్ కమిషన్ జమ్ము కాశ్మీర్ ప్రాంతాన్ని ఒకే కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించింది. దీంతో, లోయలోని అనంతనాగ్ ప్రాంతాన్ని, జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ, పూంచ్‌లను కలిపి పార్లమెంటరీ నియోజకవర్గం ఒకటి రూపొందించింది.
పోలీస్ ఆన్ డ్యూటీ- కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన లేడీ సింగం!
ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి సమాన సంఖ్యలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయని కమిషన్ తెలిపింది. కొన్ని నియోజకవర్గాల పేర్లను కూడా మార్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగిందని తెలిపింది. డీలిమిటేషన్ చట్టం - 2002లోని సెక్షన్ 9(1)(ఎ), సెక్షన్ 60(2)(బి)లోని నిబంధనలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాల పునర్విభజన చేసినట్లు కమిషన్ తెలిపింది.
అయితే ఈ నివేదికను అక్కడి రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి శాశ్వత నివాసితులకే పరిమితమైన ఓటింగ్ హక్కులు రాష్ట్రేతరులకూ కల్పించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
డీలిమిటేషన్ ప్రక్రియను అంగీకరించబోమని పలు పార్టీలు తెలిపాయి. ప్రజల ఇష్టాఇష్టాలు రాజకీయ పార్టీల అభిప్రాయాలతో సంబంధం లేకుండా బిజెపి ఆదేశాలతో ఈ డీలిమిటేషన్ జరిగిందని అంటున్నారు. అయితే అందరి అభ్యంతరాలను పరిష్కరిస్తామని కేంద్రం చెబుతోంది.