Delhi Flood: మరోసారి ఉప్పొంగుతున్న యమునా నది - ప్రమాద స్థాయిని మించి ప్రవాహం
Heavy Floods to Yamuna: దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేసిన యమునా నది మరోసారి ఉప్పొంగుతోంది. ప్రస్తుతం 204.50 మీటర్ల ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది.
Heavy Floods to Yamuna: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది మరోసారి పొంగిపొర్లుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు 204.50 మీటర్ల ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. కేంద్ర జల సంఘం వెబ్ సైట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద సోమవారం సాయంత్రం 3 గంటలకు 203.48 మీటర్ల మేర నీటి ప్రవాహం నమోదు అయింది. అయితే మంగళవారం రాత్రి నీటి మట్టం 205.33 మీటర్లకు చేరుకుంది. హరియాణాలోని యమునా నగర్ హత్నీకుండ్ బ్యారేజీ నుంచి 30 వేల 153 క్యూసెక్కుల మేర నీరు దిగువకు విడుదల అవుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో మరోసారి వరదలు వచ్చే అవకాశం ఉందని అధాకురులు చెబుతున్నారు. అయితే జులైలో వచ్చిన వరదలతో పోలిస్తే ప్రస్తుతం తక్కువగా ఉండొచ్చని కూడా వివరిస్తున్నారు.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హత్నికుండ్ బ్యారేజీ నుంచి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జులైలో 45 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన యమునా నది
ఢిల్లీలో జులైలో కురిసిన భారీ వర్షాలకు యమునా నది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగింది. భారీ నష్టం వాటిల్లే ప్రమాదముందని గ్రహించిన ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు తీసుకుంది. ఉన్నత స్థాయిలో కీలక భేటీ జరిపి.. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై జోక్యం చేసుకుని సాయం అందించాలని కేజ్రీవాల్ సర్కార్ విజ్ఞప్తి చేసింది. జులై 12వ తేదీన యమునా నది నీటి మట్టం 207.55 మీటర్లకు పెరగంది. 45 ఏళ్ల తరవాత ఈ స్థాయిలో నీటి మట్టం పెరగడం ఇదే తొలిసారి. 1978లో కురిసిన వర్షాలకు యమునా నది నీటి మట్టం 204.79 మీటర్లకు చేరుకుంది. ఇప్పుడా రికార్డు బద్దలైపోయింది. అప్రమత్తమైన అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. యమునా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వరద నీరు పోటెత్తి ఇళ్లలోకి రాకుండా కొన్ని చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జులై పరిస్థితులను చూసిన ఢిల్లీ ప్రజలు 45 ఏళ్ల క్రితం ముంచెత్తిన వరదల్ని గుర్తు చేసుకున్నారు.
1978లో ఏం జరిగింది..?
45 ఏళ్ల క్రితం ఢిల్లీలో యమునా నది పోటెత్తింది. వరదల ధాటిని తట్టుకోలేక యమునా నదిలోకి 7 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఒక్కసారిగా నీటి మట్టం 204 మీటర్లకు పెరిగింది. ఆ తరవాత బీభత్సం సృష్టించింది. 2013లోనూ యమునా నది ఇదే విధంగా ఉప్పొంగింది. అయితే...అప్పటికే వరద నీటిని కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక నిర్మాణాలు చేపట్టడం వల్ల చాలా వరకూ ప్రభావాన్ని తగ్గించగలిగారు. కొన్నేళ్లుగా ఈ వరదల ధాటి పెరుగుతూ వస్తోంది. లక్షలాది మందిపై ప్రభావం పడుతోంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. దాదాపు 43 చదరపు కిలోమీటర్ల మేర పంట పొలాలు నాశనమయ్యాయి. ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద 1978లో 207 మార్క్ దాటింది యమునా నది. ఆ తరవాత 2010లో 207.11, 2013లో 207.32 మీటర్లకు చేరుకుంది. ఈ సారి రికార్డు స్థాయిలో 207.55 మీటర్లకు పెరిగింది. అటు నోయిడా కూడా వరదల ధాటికి అల్లాడిపోతోంది. ఇప్పటికే సహాయక శిబిరాలు ఏర్పాటయ్యాయి. చాలా చోట్ల తాగునీటికి ఇబ్బందిగా ఉంది. గ్రామాలకు వెళ్లేందుకు దారులులేకుండా పోయాయి. కొన్ని చోట్ల సరుకులు నిండుకుంటున్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇక కలరా లాంటి వ్యాధులూ సోకే ప్రమాదముంది.