Coffee Beans Shortage: కాఫీ గింజల కొరత, అంతర్జాతీయంగా పెరుగుతున్న కాఫీ ధరలు
Coffee Beans Shortage: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కాఫీ గింజల కొరత కారణంగా కాఫీ ధరలు పెరుగుతున్నాయి.
Coffee Beans Shortage: మొన్నటి వరకు టమాటా ధరలు చుక్కలు చూపించాయి. కిలో టమాటా ఒకానొక సందర్భంలో రూ. 260 గా నమోదైంది. సామాన్యులకు అందనంత ఎత్తులో టమాటా ధరలు ఆకాశంలో విహరించాయి. సామాన్యులు టమాటా కొనడం కాదు.. వాటి వైపు చూడటమే మానేశారు. అంతగా టమాటా ధరలు పెరిగిపోయాయి. ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో చాలా మంది టమాటా వాడటం తగ్గించేశారు. ఇంట్లో కూడా టమాటా లేకుండానే అన్ని రకాల వంటకాలు చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. టమాటా ధరల పెరుగుదల వల్ల వంటకాలపై, ప్రజలపై పెద్దగా పడలేదు.
అయితే, భారతీయుల్లో చాలా మందికి ఉదయమే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం లేస్తూనే కాలకృత్యాలు తీర్చుకుని కాఫీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొంతమందికి అయితే కాఫీ వ్యసనంలా ఉంటుంది. కాఫీ చాలా మంది నిత్య అవసరం. అంటే అది లేకుండా రోజు మొదలుకాదు, కాఫీ లేకుండా రోజు సాగదు. టమాటా ధర పెరిగితే అవి లేకుండానే వంటకాలు వండుకున్నాం. కానీ కాఫీ లేకుండా ఉండలేని పరిస్థితి. అలాంటి గింజల కొరత ప్రపంచవ్యాప్తంగా వేధిస్తోంది.
కాఫీ గింజల కొరత కారణంగా కాఫీ ధర పెరుగుతోందని, రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాఫీ ధరల పెరుగుదల ఏదో ఒక్క దేశానికి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ ధరల ప్రభావాన్ని ఎదుర్కోనున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే టమాటాల మాదిరిగా కాఫీ ధరలు కూడా ఆకాశంలో విహరించనున్నాయని అంటున్నారు.
బ్రెజిల్, వియత్నాంలో కాఫీ గింజల కొరత.. భారత్ లో అకాల వర్షాల కారణంగా కాఫీ పంట తీవ్రంగా దెబ్బతినడం వల్ల కాఫీ గింజల దిగుబడి పడిపోయింది. కాఫీ గింజలకు ఎప్పుడూ డిమాండ్ అధికంగానే ఉంటుంది. ఆమేరకు సప్లై కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు సప్లై తగ్గిపోవడంతో ధరల పెరుగుదల ఉంటుందని అంటున్నారు. సాధారణంగా కిలోకు రూ. 580 గా కాఫీ గింజలు.. ప్రస్తుతం రూ. 650 వరకు పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కిలో కాఫీ గింజలపై ప్రస్తుతం కనీసం రూ.50 పెరిగింది. రోబస్టా గింజల ధర 50 శాతం వరకు పెరగ్గా.. అరబికా గింజల ధర 15 శాతానికి పైగా పెరిగింది.
Also Read: Indias Population: రాబోయే 10 ఏళ్లలో భారత్ జనాభా పరిస్థితి ఎలా ఉండనుంది? ప్రభుత్వాలు ఏం చేయనున్నాయి?
సాధారణంగా ప్రతి ఏడాది జనవరిలో కాఫీ గింజల ధరలు పెరుగుతాయని.. కానీ ఈ ఏడాది కాఫీ గింజల దిగుబడి 20 శాతానికి పైగా పడిపోయి జులై, ఆగస్టులో భారీగా ధరలు పెరుగుతున్నాయని ట్రేడర్లు అంటున్నారు. గతేడాది 200 గ్రాముల జార్ ధర రూ.280 ఉండగా, ఇప్పుడు రూ. 360కి పెరిగింది. రానున్న రోజుల్లో మరో 10 శాతం పెరుగుతుందని కాంటినెంటల్ బ్రాండ్ తో కాఫీని విక్రయిస్తున్న CCL ప్రొడక్ట్ సంస్థ చెబుతోంది.
భారత్ లో 70 శాతం కాఫీని కర్ణాటక ఉత్పత్తి చేస్తుంది. కేరళ, తమిళనాడు కూడా కాఫీని పండిస్తాయి. కర్ణాటక రాష్ట్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కాఫీ దిగుబడి గణనీయంగా తగ్గింది. చిక్కమగళూరు ప్రాంతాన్ని వాతావరణ మార్పు ప్రభావిత చేసింది. అకాల వర్షాల కారణంగా పంట దెబ్బతింది.