
CM KCR Jharkhand Tour: అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం, అండగా ఉంటానని సీఎం కేసీఆర్ హామీ
CM KCR Jharkhand Tour: జార్ఖండ్ లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ గల్వాన్ అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. అంతకు సీఎం హేమంత్ సోరెన్ తో భేటీ అయ్యారు.

CM KCR Jharkhand Tour: గల్వాన్(Galwan) అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM Kcr) ఆర్థిక సాయం అందించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్(Hemant Soren)తో కలిసి అమర జవాన్ల కుటుంబాలను కేసీఆర్ పరామర్శించారు. గల్వాన్‌లోయలో మరణించిన వీర జవాను కుందన్‌కుమార్ ఓఝా సతీమణి నమ్రత కుమారి, మరో వీరుడు గణేశ్ హన్సదా మాతృమూర్తి కప్రా హన్సదాలకు రూ.పది లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన వారిని సీఎం కేసీఆర్ ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud), ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత ఉన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం గాల్వన్ వ్యాలీలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఝార్ఖండ్ సీఎం శ్రీ @HemantSorenJMM తో కలిసి ఆర్థిక సాయం అందజేసిన సీఎం శ్రీ కేసీఆర్. అమర సైనికుడు కుందన్ కుమార్ ఓజా భార్య నమ్రత కుమారికి, మరో వీర సైనికుడు గణేష్ కుటుంబ సభ్యులకు చెరో రూ.10 లక్షల చెక్ లను అందించారు. pic.twitter.com/HPSJhImyug
— Telangana CMO (@TelanganaCMO) March 4, 2022
అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం
జమ్ము కశ్మీర్ గల్వాన్ లోయలో చైనా(China) సైనికులు చొరబాటును అడ్డుకున్న క్రమంలో ఘర్షణ జరిగింది. రెండేండ్ల క్రితం జరిగిన ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ కుమార్‌తో పాటు 19 మంది భారత సైనికులు మరణించారు. ఈ దాడిలో అమరులైన సైనికుల కుటుంబాలకు తెలంగాణ(Telangana) సీఎం కేసీఆర్ రూ.10 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు ఒక భారతీయుడిగా అండగా ఉంటానని ఆయన ప్రకటించారు. 19 మంది సైనికుల్లో ఇద్దరు జార్ఖండ్‌కు చెందినవారు ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులకు ఇవాళ రాంచీలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా చెక్కులను అందజేశారు.
సీఎం హేమంత్ సోరెన్ తో కేసీఆర్ భేటీ
అంతకు ముందు జార్ఖండ్(Jharkhand) సీఎం హేమంత్ సోరెన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం దేశ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులతో పాటు భవిష్యత్ రాజకీయాలపై ముఖ్యమంత్రులు చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశానికి ముందు సీఎం కేసీఆర్ రాంచీలోని గిరిజన ఉద్యమకారుడు బిర్సా ముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బిర్సా ముండా గిరిజన జాతికి, దేశానికి అందించిన సేవలను సీఎం కేసీఆర్ కొనియాడారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

