వరదల్లో కొట్టుకుపోయిన చుంగుతాంగ్ డ్యామ్, నాసిరకం నిర్మాణమే కొంపముంచిందన్న సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్
తీస్తా నది పరీవాహక ప్రాంతంలో ఆకస్మిక వరదలతో సిక్కిం విలవిలలాడుతోంది. వరదలతో ఇప్పటికే 18 ప్రాణాలు కోల్పోయారు. 98 మంది గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది.
తీస్తా నది పరీవాహక ప్రాంతంలో ఆకస్మిక వరదలతో సిక్కిం విలవిలలాడుతోంది. వరదలతో ఇప్పటికే 18 ప్రాణాలు కోల్పోయారు. 98 మంది గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. వీరిలో 22 మంది భారత సైనికులు కూడా ఉన్నారు. తీస్తా నది ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున వీరి ఆచూకీ కోసం దిగువ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. నాసిరకం నిర్మాణం కారణంగా చుంగుతాంగ్ డ్యామ్ కొట్టుకుపోయిందని ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ తెలిపారు. సిక్కిం వరదలపై ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం వరద నష్టాలను జాతీయ విపత్తులుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
వరదలకు తోడు కుంభవృష్టి వానలు కురవడంతో లోనాక్ సరస్సులో నీటిమట్టం భారీగా పెరిగిపోయిందన్నారు. వరద మొత్తం చుంగుతాంగ్ డ్యామ్ వైపు మళ్లడంతో, డ్యామ్ తెగి దిగువ ప్రాంతాలపైకి పోటెత్తిందన్నారు. వరదల్లో ఎన్‌హెచ్-10 జాతీయ రహదారి పలు ప్రాంతాల్లో దారుణంగా దెబ్బతింది. మొత్తం 4 జిల్లాల్లో వరదల ప్రభావం ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం 26 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. వరద నష్టాలు ఎక్కువగా ఉన్న సింగ్తమ్ ప్రాంతాన్ని సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 22 వేల మందికి పైగా ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది.
14 వంతెనలు, 277 ఇళ్లు ధ్వంసం
చుంగ్‌తాంగ్ డ్యాము తెగి, భారీగా చేరిన నీరు విద్యుదుత్పత్తి పరికరాలను ధ్వంసం చేసింది. మొత్తం 14 వంతెనలు, 277 ఇళ్లు ధ్వంసమయ్యాయి. రాష్ట్రానికి జీవరేఖ లాంటి ఎన్‌హెచ్-10కు పలుచోట్ల భారీనష్టం వాటిల్లింది. సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు మూడువేల మంది పర్యాటకులు చిక్కుకుపోగా.. ఇందులో విదేశీయులు కూడా ఉన్నారు. లోనాక్ సరస్సులో నీటిమట్టం అమాంతం పెరిగి తీస్తానది పరీవాహక ప్రాంతంలోకి ఉద్ధృతంగా ప్రవహించింది. సరస్సులోకి అపరిమితంగా నీరు చేరినపుడు, భూకంపాల వంటివి వచ్చినపుడు ఇలా జరిగే అవకాశముంది. 733 హిమానీనదాలతో కూడిన సిక్కిం రాష్ట్రానికి, ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నట్టేనని, 2001లోనే సిక్కిం మానవాభివృద్ధి నివేదిక హెచ్చరించింది. 2021లో అంతర్జాతీయ పరిశోధకుల బృందం జరిపిన ఓ అధ్యయనం సైతం దక్షిణ లోనాక్ సరస్సుతో సిక్కింకు ముప్పుందని అప్రమత్తం చేసింది.
పూర్తి నీరు చేరి ఉంటే విలయమే
చుంగుతాంగ్ డ్యామ్‌కు గండి పడిన సమయంలో లోనాక్ సరస్సు నుంచి పూర్తి నీరు డ్యామ్‌లోకి చేరలేదు. ఈ సరస్సులో ఇంకా నీరు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. అవి కూడా డ్యామ్‌లోకి చేరితే పెనువిపత్తు చోటు చేసుకునేదని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు సైజు గత 30 ఏళ్లలో మూడు రెట్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 1990లో ఇది 0.42 చదరపు కిలోమీటర్లు ఉంటే, 2019 నాటికి 1.35 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. 6.5 కోట్ల క్యూబిక్ అడుగుల నీరు నిల్వ ఉంది. సిక్కింలో ఇలాంటి సరస్సులు మొత్తం 14 ఉన్నాయి.