Viral News : టీవీ పెట్టిన చిచ్చు, రీఛార్జ్ చేయించలేదని విడాకులు కోరిన భార్య!
Viral News : భర్త వేధింపులు తట్టుకోలేక విడాకులు అడిగిన ఘటనలు చూసుంటారు కానీ ఛత్తీస్ గఢ్ లో విచిత్రమైన సంఘటన జరిగింది. భర్త టీవీకి రీఛార్జ్ చేయించలేదని భార్య విడాకులు కావాలని కోరింది.
Viral News : భర్త తాగొచ్చి కొడుతున్నాడనో, అనుమానంతో వేధిస్తున్నాడని భార్యలు విడాకులు అడిగిన సందర్భాలు చూశాం. అలాగే సినిమాకు తీసుకెళ్లలేదనో, ఇతర కారణాలతో అలిగే భార్యలు చూసుంటారు. టీవీలు, మహిళలకు విడదీయరాని బంధం ఉందని కొందరు అంటుంటారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే టీవీల్లో వచ్చే సీరియల్స్ మహిళల ఓరింటెడ్ గా తీయడానికి వాటికి ఆ వర్గంలో ఉన్న ఆదరణే అని చెప్పాలి. అలాంటిది టీవీ ఇంట్లో ఒక్క క్షణం లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించండి. టీవీ రిమోట్ కోసం చిన్న సైజు యుద్ధాలే జరిగిన సందర్భాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. చిన్న రిమోట్ కోసం అంతగా పట్టుబట్టే మహిళలు ఇక టీవీ రీఛార్జ్ ముగిసిందంటే పెద్ద యుద్ధమే చేస్తారు. ఎందుకంటే కొందరికి ఇళ్లే ప్రపంచం. అందులో టీవీ వారికి కాలక్షేపం. అలాంటి టీవీకి రీఛార్జ్ చేయలేదని తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. డీటీహెచ్ రీఛార్జ్ చేయించలేదని భర్త నుంచి విడాకులు కోరింది ఓ మహిళ.
విచిత్ర ఘటన
ఛత్తీస్ గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. డీటీహెచ్ రీఛార్జ్ అయిపోవడంతో ఓ మహిళ భర్తను రీఛార్జ్ చేయించమని కోరింది. అయితే తన వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని చెప్పాడు భర్త. అదే అతడు చేసిన పొరపాటు. డీటీహెచ్ రీఛార్జ్ చేయించలేదని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. వెళ్లే ముందు టీవీ లేకపోతే పెళ్లం కూడా ఉండదని చెప్పి వెళ్లిపోయింది. పనికెళ్లి వచ్చి సాయంత్రం రీఛార్జ్ చేయిస్తానని చెప్పినా ఆమె వినిపించుకోలేదు. అయితే అలిగి పుట్టింటికి వెళ్లిన మహిళ భర్తకు షాక్ ఇచ్చింది. తనకు విడాకులు కావాలని కబురుపంపింది. చివరకు ఈ వ్యవహారం పోలీసుల వద్దకు చేరింది. విషయం తెలుసుకుని ముందు పోలీసులు సైతం షాక్ తిన్నారు. ఆ తర్వాత భార్తభర్తలను పిలిపించి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. కాపురంలో ఇలాంటి ఘటనలు సహజమని చెప్పి వారికి సర్దిచెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు భార్యాభర్తలు మళ్లీ ఒక్కటయ్యారు.
విడాకులపర్వం
ఇటీవల చిన్న చిన్న కారణాలతో విడాకుల వరకూ వెళ్తున్నారు. క్షణికావేశంలో పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన వాళ్లే కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. సినీతారల నుంచి రాజకీయ నేతల వరకూ విడాకుల పాట పడుతున్నారు. ఎవరి కోణంలో వాళ్లే కరెక్టు అనుకుంటూ వాదించుకునే ప్రస్తుత సమాజంలో కోర్టులు మాత్రం ఏంచేస్తాయని అంటున్నారు విశ్లేషకులు. అయితే భారతీయ సమాజంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, కానీ ఆధునిక పోకడలు ఆ బంధాన్ని పలుచన చేస్తున్నాయని అంటున్నారు.