Chandrayaan-3: చంద్రునికి 4 వేల కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్-3, కీలకల విషయాలు చెప్పిన ఇస్రో
Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రస్తుతం చంద్రునికి 4 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది.
Chandrayaan-3: చంద్రయాన్-3 క్రమంగా జాబిలికి దగ్గరవుతోంది. ఒక్కో దశను పూర్తి చేసుకుంటూ తన లక్ష్యం దిశగా సాగుతోంది. దీర్ఘవృత్తాకర చంద్ర కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించిన ఒక రోజు తర్వాత.. ఆదివారం సాయంత్రం వేళ మరో విన్యాసాన్ని చేపట్టింది ఇస్రో. అపోల్యూన్ వద్ద 18,074 కిలోమీటర్ల నుంచి 4,313 కిలోమీటర్ల కక్ష్యలోకి మారింది. చంద్రయాన్-3 విజయవంతంగా ప్రణాళికాబద్ధంగా కక్ష్యను తగ్గించుకున్నట్లు ఇస్రో వెల్లడించింది. రెట్రో-ఫైరింగ్ తో చంద్రుని ఉపరితలానికి మరింత దగ్గరగా తీసుకెళ్లినట్లు పేర్కొంది. ప్రస్తుతం చంద్రయాన్-3 170కి.మీ X 4313 కి.మీ కక్ష్యలో తిరుగుతోంది. ఆగస్టు 9వ తేదీన చంద్రయాన్-3 కక్ష్యను మరింత తగ్గించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 1 - 2 గంటల మధ్య ఈ కక్ష్య మార్పు జరగనుంది.
జులై 14వ తేదీన చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టగా.. ఇప్పటి వరకు 8 దశలను దాటుకుంది. జులై 15, 25 తేదీల మధ్య 5 భూకక్ష్యలను మార్చుకుంది. ఆగస్టు 1వ తేదీన ట్రాన్ లూనార్ ఇంజెక్షన్ విన్యాసాన్ని చేపట్టింది. దాదాపు 3.6 లక్షల కిలోమీటర్ల ఎత్తులో చంద్రుని వైపు కదిలింది. శనివారం చంద్రుని కక్ష్య(లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్)లోకి ప్రవేశించింది. ఆదివారం సాయంత్రం వేళ చంద్రునికి మరింత దగ్గరగా వెళ్లేందుకు మరో కక్ష్యను మార్చుకుంది. సాఫ్ట్ ల్యాండింగ్ కావడనికి చంద్రయాన్-3 మరో మూడు చంద్రుని కక్ష్యలను మార్చాల్సి ఉంటుంది. ల్యాండింగ్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయే ముందు, చంద్రయాన్-3 చంద్రుని చుట్టూ ఉన్న ప్రస్తుతం దీర్ఘవృత్తాకార కక్ష్య నుంచి 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి రావాల్సి ఉంటుంది. ల్యాండర్ విడిపోయిన తర్వాత, విక్రమ్ (ల్యాండర్), ప్రజ్ఞాన్ (రోవర్)ను చంద్రుని వైపు తీసుకెళ్తుంది. చంద్రుని చుట్టూ 100 కి.మీ X 30 కి.మీ కక్ష్యలోకి మారుతుంది. ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5.47 గంటలకు చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండ్ జరగనుంది.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 5, 2023
“MOX, ISTRAC, this is Chandrayaan-3. I am feeling lunar gravity 🌖”
🙂
Chandrayaan-3 has been successfully inserted into the lunar orbit.
A retro-burning at the Perilune was commanded from the Mission Operations Complex (MOX), ISTRAC, Bengaluru.
The next… pic.twitter.com/6T5acwiEGb
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 6, 2023
The spacecraft successfully underwent a planned orbit reduction maneuver. The retrofiring of engines brought it closer to the Moon's surface, now to 170 km x 4313 km.
The next operation to further reduce the orbit is scheduled for August 9, 2023, between… pic.twitter.com/e17kql5p4c
ఈ మిషన్ అంతరిక్ష పరిశోధనలో భారతదేశానికి కీలకం కాబోతుందని, భవిష్యత్తులో గ్రహాంతర కార్యకలాపాలకు మార్గం సుగమం చేస్తుంది. ఈ మిషన్ చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండింగ్ చేసి చంద్రునిపై రోవర్‌ను దించడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రయాన్ 2లో ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై సరిగ్గా ల్యాండ్ కాలేదు. ఈసారి దీన్ని అధిగమించి చంద్రుడి ఉపరితలంపై అది కూడా ఎవరూ ప్రయోగాలకు సాహసించని దక్షిణ ధ్రువంలో విక్రమ్ ను సేఫ్ గా ల్యాండ్ చేసేలా ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3ని ప్రయోగించారు.