పెరిలూన్, సాఫ్ట్ ల్యాండింగ్, ఆర్బిట్ సర్య్కులరైజేషన్ - చంద్రయాన్-3 లో ఉపయోగించే ఈ పదాల అర్థమేంటంటే?
Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ గురించి చెప్పేటప్పుడు వాడే కొన్ని పరిభాష పదాల అర్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Chandrayaan-3: అంతరిక్షరంగంలో చరిత్ర లిఖించేందుకు ఇస్రో సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా విక్రమ్ ల్యాండర్ జాబిలిపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. అలా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించనుంది భారత్. చంద్రయాన్-3 కి సంబంధించిన వార్తలు వినేటప్పుడు, చదివేటప్పుడు.. ల్యాండర్, రోవర్, సాఫ్ట్ ల్యాండింగ్, ల్యాండర్ మాడ్యుల్, ప్రొపల్షన్ మాడ్యూల్, ఎర్త్-బౌండ్ మాన్యూవర్ అంటూ ఏవేవో పదాలు వినిపిస్తున్నాయి. ఆయా పదాల అర్థాలు ఏమిటో తెలుసుకుంటే తప్పా.. చంద్రయాన్-3 మిషన్ ప్రయాణం, దశలు, ప్రక్రియలు, చేసే విన్యాసాలు ఏమిటో సరిగ్గా అర్థం కావు. చంద్రయాన్-3 మిషన్ లో ఉపయోగిస్తున్న కొన్ని పరిభాష పదాల అర్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ల్యాండర్
ల్యాండర్ అనేది ఒక స్పేస్ క్రాఫ్ట్. ఉపగ్రహంపై ల్యాండ్ కావడానికి రూపొందించబడిన అంతరిక్ష నౌక. ల్యాండర్ కదలకుండా ఉంటుంది. ఒక నిర్దిష్ట స్థానంలో స్థిరంగా ఉంటుంది. ఆ ప్రదేశం నుంచి అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తుంది. చంద్రయాన్-3 మిషన్ లో ల్యాండర్ పేరు విక్రమ్.
రోవర్
రోవర్ అనేది ఓ స్పేస్ క్రాఫ్ట్. చంద్రుని ఉపరితలాన్ని అన్వేషించడానికి రూపొందించబడిన అంతరిక్ష నౌక. రోవర్ స్థిరంగా ఉండదు. కదులుతూ ఉంటుంది. చంద్రుని ఉపరితలపై కదులుతూ శాంపిల్స్ సేకరించి ప్రయోగాలు చేస్తుంది. ఆ ప్రయోగ ఫలితాలను ల్యాండర్ కు పంపిస్తుంది. చంద్రయాన్-3 లో రోవర్ పేరు ప్రజ్ఞాన్.
ల్యాండర్ మాడ్యుల్
చంద్రయాన్-3 లో రోవర్ ల్యాండర్ లోపల అమర్చబడి ఉంటుంది. దీనంతటిని కలిపి ల్యాండర్ మాడ్యుల్ అంటారు. ల్యాండర్ మాడ్యుల్ అంటే ల్యాండర్ పూర్తి కాన్ఫిగరేషన్. రోవర్ తో కలిపి ఉన్న ల్యాండర్ ను ల్యాండర్ మాడ్యుల్ అంటారు.
ప్రొపల్షన్ మాడ్యుల్
చంద్రయాన్-3 మిషన్ లో ప్రొపల్షన్ మాడ్యుల్.. ల్యాండర్ మాడ్యుల్ ను 100 కిలోమీటర్ల చంద్ర కక్ష్యకు తీసుకెళ్లడానికి రూపొందించబడింది. ఈ కక్ష్యకు చేరువకు రాగాననే ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ల్యాండర్ మాడ్యుల్ వేరు అవుతుంది. ల్యాండర్ మాడ్యుల్ చంద్రుని ఉపరితలం వైపు తన ప్రయాణాన్ని సాగిస్తుంది. ల్యాండర్ మాడ్యుల్ విడిపోగానే ప్రొపల్షన్ మాడ్యుల్ పని అయిపోదు. అది కక్ష్యలోనే తిరుగుతూ ల్యాండర్ మాడ్యుల్ తో కమ్యూనికేషన్ రిలే ఉపగ్రహంగా పని చేస్తుంది.
ట్రాన్స్-లూనార్ ఆర్బిట్
ట్రాన్స్ లూనార్ ఆర్బిట్ అనేది ఎలిప్టికల్ ఆర్బిట్. ఇది భూ కక్ష్యను దాటి చంద్ర కక్ష్యలోకి ప్రవేశించడానికి చేసే ప్రయాణం.
రెట్రో బర్నింగ్
స్పేస్ క్రాఫ్ట్ ఎటువైపు వెళ్లాలో దానికి వ్యతిరేక దిశలో రెట్రో బర్న్ అవుతుంది. దీని వల్ల స్పేస్ క్రాఫ్ట్ ముందుకు వెళ్తుంది.
పెరిల్యూన్
చంద్ర కక్ష్యలో స్పేస్ క్రాఫ్ట్ చంద్రునికి అత్యంత సమీపంగా ఉండే కేంద్ర బిందువును పెరిల్యూన్ అంటారు. ఈ బిందువు వద్దే స్పేస్ క్రాఫ్ట్ చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది.
ఆర్బిట్ సర్క్యులరైజేషన్
ఆర్బిట్ సర్య్కులరైజేషన్ అంటే గుండ్రని కక్ష్య అని అర్థం. సాధారణంగా కక్ష్య గుండ్రంగా ఉండదు. కానీ చంద్రయాన్-3 ఆగస్టు 14వ తేదీన కక్ష్య సర్క్యులరైజేషన్ దశలోకి ప్రవేశించింది.
The Journey of Chandrayaan 3 : ఇస్రో చంద్రయాన్ 3 జర్నీ ఇక్కడ వీక్షించండి