Free Ration : పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం, ఉచిత రేషన్ మరో ఆరు నెలలు పొడిగింపు
Free Ration : కరోనా కారణంగా పేదలకు అందిస్తున్న ఉచిత రేషన్ ను కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. సెప్టెంబర్ 30 వరకు ప్రజా పంపిణీ ద్వారా ఉచిత ఆహార ధాన్యాలు అందించనున్నారు.
Free Ration : పేదలకు మరో ఆరు నెలలపాటు ఉచిత రేషన్(Free Ration) అందించాలని కేంద్ర ప్రభుత్వం(Central Govt) నిర్ణయించింది. 80 వేల కోట్ల వ్యయంతో పేదలకు 5 కిలోల ఆహారధాన్యాలను(Food Grains) సెప్టెంబర్ 30 వరకు రేషన్ షాపుల ద్వారా అందించాలని మోదీ ప్రభుత్వం శనివారం నిర్ణయించింది. కొత్తగా ఎన్నికైన ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు పొడిగించిన కొద్ది గంటల తర్వాత, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (PMGKAY) లేదా ఉచిత ఆహారధాన్యాల పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించడం ద్వారా కేంద్రం సుమారు రూ. 80,000 కోట్ల అదనపు ఆహార సబ్సిడీని(Food Subsidy) అందిస్తుంది. ఇది 2022-23 బడ్జె్ట్ లో ఆహార సబ్సిడీ అంచనాల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఉచిత ఆహార ధాన్యాల పథకాన్ని పొడిగింపు తర్వాత ఆహార సబ్సిడీపై మొత్తం వ్యయం రూ. 2.86 ట్రిలియన్లు అవుతుంది. PMGKAY కింద కేంద్రం జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA)లబ్ధిదారులకు సాధారణ నెలవారీ కోటాలో అదనంగా 5 కిలోల బియ్యం లేదా గోధుమలను ఉచితంగా ఇస్తుంది. ప్రతి పేద కుటుంబానికి సాధారణ రేషన్ కంటే దాదాపు రెట్టింపు రేషన్ లభిస్తుందని కేంద్రం అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఏప్రిల్ 2020 నుంచి ఉచిత రేషన్
కరోనా కారణం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన తర్వాత ఉచిత రేషన్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 2020లో ప్రారంభించింది కేంద్రం. ఏప్రిల్ 2021లో చిన్న విరామం మినహా నాన్‌స్టాప్‌గా ఈ కార్యక్రమాన్ని కొనసాగించింది. ఏప్రిల్ 1, 2022 నుంచి మరో ఆరు నెలలకు కేంద్రం PMGKAY కోసం దాదాపు 24.4 మిలియన్ టన్నుల గోధుమలు, బియ్యాన్ని సాధారణ కేటాయింపు కన్నా ఎక్కువగా కేటాయించాల్సి ఉంటుంది. మార్చి 1, 2022 నాటికి కేంద్రం ఆహార ధాన్యాల నిల్వలు దాదాపు 97.08 మిలియన్ టన్నులుగా అంచనా. ఇందులో మిల్లర్‌ల వద్ద 44.11 మిలియన్ టన్నుల మిల్లింగ్ చేయని ధాన్యం ఉంది. ఇది కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైతుల నుంచి 44.4 మిలియన్ టన్నుల గోధుమలను కొనుగోలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
సంవత్సరానికి 60.3 మిలియన్ టన్నులు
ఎగుమతులు పెరిగిన కారణంగా బహిరంగ మార్కెట్‌లలో గోధుమలు క్వింటాల్‌కు ఎంఎస్‌పి రూ. 2,015 కన్నా దాదాపు రూ. 200-రూ. 300 ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం (FY23)లో గోధుమ సేకరణ లక్ష్యం నిర్దేశించబడిన 44.4 మిలియన్ టన్నుల కంటే తక్కువగా 35 మిలియన్ టన్నులకు పడిపోతే, ప్రభుత్వం స్టాక్‌లను ఎలా నిర్వహిస్తుందో చూడాలి. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం సాధారణ ప్రజాపంపిణీ వ్యవస్థను అమలు చేయడానికి సంవత్సరానికి సుమారు 60.3 మిలియన్ టన్నులు అందించాల్సి ఉంటుంది. 2020 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు PMGKAY కింద దాదాపు రూ. 3.4 ట్రిలియన్‌లను ఖర్చు చేసినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 2020 నుంచి దాదాపు 100.3 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉచిత పంపిణీ కోసం కేటాయించింది.