(Source: ECI/ABP News/ABP Majha)
Bomb Threat Call: ముంబయి నగర పోలీసులను పరుగులు పెట్టించిన ఇద్దరు తాగుబోతులు...
ముంబయి నగర పోలీసులను ఇద్దరు తాగుబోతులు పరుగులు పెట్టించారు. మద్యం మత్తులో అర్థరాత్రి రెచ్చిపోయిన వాళ్లు చేసిన పని చాలా మందిని కలవరపాటుకు గురి చేసింది.
ముంబయిలోని మూడు రైల్వేస్టేషన్లు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తున్నట్టు బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ రిసీవ్ చేసుకున్న పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు.
కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకుంటూనే ముందు జాగ్రత్తగా బెదిరింపు వచ్చిన అమితాబ్ బచ్చన్ బంగ్లా, మూడు రైల్వేస్టేషన్ల వద్ద భారీగా బలగాలను మోహరించారు. అణువణువూ గాలించారు. ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ, పేలుడు పదార్థాలు గానీ కనిపించలేదు.
నిన్న రాత్రి ముంబయి పోలీసులకు ఈ బెదిరింపు కాల్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి చత్రపతి శివాశి మహరాజ్ టెర్మినస్(CSMT), బైకుల్లా, దాదార్ రైల్వేస్టేషన్లు, జుహులోని నటుడు అమితాబ్ బచ్చన్ బంగ్లాలో బాంబులు అమర్చినట్టు చెప్పాడు.
ఈ కాల్ రిసీవ్ చేసుకున్న పోలీసులు రైల్వేపోలీసులను అప్రమత్తం చేశారు. అంతా కలిసి బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, జాగిలాలతో ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పిన్ టు పిన్ వెతికినా ఎక్కడా అనుమానంగా ఎలాంటి వస్తువులుగానీ, వ్యక్తులు గానీ కనిపించలేదు.
ప్రస్తుతానికి అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువులు దొరక్కపోయినా... ఈ నాలుగు ప్రాంతాల్లో మాత్రం పోలీసు బందోబస్తు భారీగా కొనసాగుతోంది. కాల్ ఎవరు చేశారు... ఎందుకు చేశారనే అంశంలో దర్యాప్తు మాత్రం కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఫోన్ కాల్ వచ్చిన ఏరియాల్లో నిఘా పెట్టి ఇద్దర్ని అరెస్టు చేశారు. ఈ ఫోన్ కాల్యాణ్ ఏరియా నుంచి వచ్చినట్టు తెలుసుకొని విచారణ ముమ్మరం చేసిన పోలీసులు బిత్తర పోయారు.
నిందితులను పట్టుకొని విచారిస్తే అసలు సంగతి చెప్పారు. అర్థరాత్రి మందు తాగి ఆ మైకంలో ఇలాంటి కాల్స్ చేసినట్టు ఆ ఇద్దరు నిందితులు అంగీకరించారు. మద్యం మత్తులో పొరపాటున పోలీసులకు కాల్ చేశామని అంతకు మించి తమకు ఏమీ తెలియదని వాళ్లు వేడుకున్నారు.
మద్యం మత్తులో ఇలా చేయడం.... పోలీసులను పరుగులు పెట్టించినందుకు వాళ్లను అరెస్టు చేశారు. ఫోన్ కాల్ వచ్చినప్పటి నుంచి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇది ఆకతాయిల కాల్ అని అనుమానం ఉన్నప్పటికీ ఛాన్స్ తీసుకోకూడదన్న ఆలోచనతో అనుమానాస్పద ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచారు.
అసలే ఆగస్టు 15 వేడుకలు ఇంకో వారం రోజుల్లో ఉన్నాయి. ఈ టైంలో ఇలాంటి బెదిరింపులు నిజంగానే భయాందోళనకు గురి చేస్తాయి. ముంబయి పోలీసుల్లో కూడా అలాంటి భయమే ఏర్పడింది. అందుకే క్షణాల్లో ముంబయిన నిఘా నీడలోకి తీసుకొచ్చారు.
ALSO READ: రాహుల్ గాంధీ ట్వీట్ డిలీట్