Covaxin: కోవాగ్జిన్ తీసుకున్న వారిలోనూ ఆరోగ్య సమస్యలు - బనారస్ హిందూ వర్శిటీ అధ్యయనంలో వెల్లడి
Banaras Hindu University: కోవాగ్జిన్ తీసుకున్న ఏడాది తర్వాత 30 శాతం మందిలో ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు బనారస్ హిందూ యూనివర్శిటీ తాజా అధ్యయనం వెల్లడించింది. దీంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
Banaras Hindu Versity Sensational Study On Covaxin: బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్ (Covishield) వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు కలుగుతాయని ఇటీవల దుమారం రేగిన వేళ.. కోవాగ్జిన్ కు (Covaxin) సంబంధించి ఓ తాజా అధ్యయనం సైతం ఆందోళన కలిగిస్తోంది. భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాగ్జిన్ తీసుకున్న వారిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ టీకా తీసుకున్న వారిలో మూడో వంతు మంది వ్యక్తులు తొలి ఏడాదిలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడినట్లు బనారస్ హిందూ యూనివర్శిటీ (Banaras Hindu University) తన అధ్యయనంలో తేల్చింది. వర్శిటీ పరిశోధక బృందం ఏడాది పాటు పరిశీలించగా.. దాదాపు మూడింట ఒక వంతు మంది ప్రతికూల ప్రభావాలు చెప్పినట్లు తన స్టడీలో వెల్లడించింది. స్ప్రింగర్ నేచర్ అనే జర్నల్ లో బీహెచ్ యూ నివేదికను ప్రచురించారు.
శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు..
ఈ అధ్యయనంలో 635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలు మొత్తం 926 మంది పాల్గొన్నారు. వీరిలో 304 (47.9 శాతం) మంది టీనేజర్లు, 124 మంది (42.6 శాతం) పెద్దలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. 10.5 శాతం మందిలో చర్మ సమస్యలు, 10.2 శాతం మందిలో సాధారణ రుగ్మతలు, 4.7 శాతం మందిలో నరాల సంబంధిత సమస్యలు, 2.7 శాతం మందిలో కంటి సమస్యలు, 4.6 శాతం మంది మహిళల్లో రుతుక్రమ సమస్యలు వచ్చినట్లు అధ్యయనంలో వెల్లడైంది. కోవాగ్జిన్ తీసుకున్న వారిలో 30 శాతం మంది ఏడాది తర్వాత ఆరోగ్య సమస్యలతో సతమతం అయినట్లు బీహెచ్ యూ తన స్టడీలో పేర్కొంది. కాగా, 2022, జనవరి నుంచి 2023, ఆగస్ట్ వరకూ ఈ స్టడీ చేపట్టారు. కాగా, కోవిషీల్డ్ తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఇటీవల వెల్లడైన నేపథ్యంలో.. ఇప్పుడు కోవాగ్జిన్ విషయంలోనూ తాజా అధ్యయనంతో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు.