రామాలయం ప్రారంభోత్సవానికి అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ రావొద్దన్న అయోధ్య ట్రస్ట్
అయోధ్య రామమందిరం ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి ఆలయ ప్రారంభోత్సవానికి దూరంగా ఉంటున్నారు.
Ram Temple Opening Event : అయోధ్య రామమందిరం ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ (Lk Advani), మురళీ మనోహర్ జోషి (Murali Manohar Joshi ) ఆలయ ప్రారంభోత్సవానికి దూరంగా ఉంటున్నారు. రామమందిరం ట్రస్టు ( Ram Mandir Trust ) వినతితో వారిద్దరూ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ఆడ్వాణీ వయసు 96 సంవత్సరాలు కాగా, మురళీ మనోహర్ జీషి 89 ఏళ్లు. ఇద్దరూ పెద్ద వయస్కులే. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారిద్దరిని రామాలయ ప్రారంభ కార్యక్రమానికి హాజరుకావద్దని విజ్ఞప్తి చేసింది రామమందిరం ట్రస్టు. తమ వినతిని ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి అంగీకరించినట్లు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. మరోవైపు 90 ఏళ్ల మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ (Hd Devegowda )ను ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ
జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తారని ఆలయ ట్రస్టు భావిస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో వేర్వేరుచోట్ల 10 పడకల ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో 12 వేల నుంచి 15 వేల మంది అయోధ్యలో బస చేసేందుకు వీలుగా ఆలయ ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. సాధువులు సహా తాము ఆహ్వానించిన ప్రముఖులందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. వేర్వేరు బృందాలకు ఈ బాధ్యతలు అప్పగించాం అని వివరించారు. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. జనవరి 20- 24 మధ్య జరిగే విగ్రహ ప్రాణప్రతిష్ఠ, ప్రారంభోత్సవ వేడుకలకు ప్రధాని మోడీ కూడా హాజరవుతారు.
70 ఎకరాల విస్తీర్ణంలో మరో 7 ఆలయాలు
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్‌లో మరో 7 ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గోనాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ వస్తున్నారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు.
సినీరంగం ప్రముఖులు, వ్యాపారవేత్తలకు ఆహ్వానాలు
జాబితాలో సినీరంగం నుంచి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ తో పాటు ఇతర ప్రముఖులు ఉన్నారు. అలాగే పారిశ్రామిక రంగం నుంచి రతన్ టాటా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి ప్రముఖులు, భారత్ క్రికెట్ రూపురేఖలు మార్చిన దిగ్గజ క్రికెటర్లలో సచిన్, విరాట్ కోహ్లి లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు చివరి దశలో ఉంది. మరోవైపు ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్‌రోడ్డు మార్గం నుంచి కూడా ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు. 60 శాతం మేరకు ఫ్లోర్‌లో మార్బుల్‌ను అమర్చారు.
గుడి నిర్మాణానికి, భక్తులకు సౌకర్యాల కల్పనకు ఇప్పటి వరకు రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేసింది ఆలయట్రస్టు.తమ వద్ద ఇంకా రూ.3 వేల కోట్ల మిగులు నిధులు ఉన్నాయిని ట్రస్టు సభ్యులు వెల్లడించారు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున గర్భగుడిలోని విగ్రహాలపై సూర్యకిరణాలు నిరంతరాయంగా ప్రసరించేలా ఆలయం శిఖరంపై ఓ ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణలో బెంగళూరులో ఈ నిర్మాణాన్ని రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూర్కీ, పుణెలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా అందిస్తోంది.