Marriage News: చనిపోయిన యువతిని పెళ్లాడిన యువకుడు! దిగ్భ్రాంతి కలిగించే ఘటన
Assam News: కలకాలం కలిసుంటానని మాట ఇచ్చిన ప్రేమికురాలు మధ్యలోనే చనిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు. ఓ వైపు గుండెలు పగిలేలా ఏడుస్తూనే.. చనిపోయిన ఆమె మృతదేహానికే తాళి కట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
Assam News: ప్రేమ కథలు అంటే ఇష్ట పడని వాళ్లుండరు. ముందుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడడం, ఒప్పుకుంటే ఇద్దరూ కలిసి ప్రేమ గీతాలు పాడుకోవడం, కొందరు పెద్దలను ఒప్పించి, మరికొందరు పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. అయితే మరికొన్ని ప్రేమ కథలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాయి. అలాంటి ప్రేమ కథలు విన్నా, చూసినా మనసును తాకుతాయి. ముఖ్యంగా చివర్లో ప్రేమికులు విడిపోవడమో, అందులో ఒకరో లేదా ఇద్దరూ చనిపోవడమో జరిగితే మనం జీర్ణించుకోలేకం. అలాంటి ఓ ఘటన అస్సాంలో జరిగింది. ఇందులో ప్రియురాలు చనిపోగా.. ప్రియుడు ఆమె మృతదేహానికే తాళి కట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
అసోంలోని మెరిగావ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల బిటుపన్ తములి.. కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల బోరా కొన్నేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆమెతో మాట్లాడనిదో అతడికి రోజు గడిచేది కాదు. అలాగే ఆమె కూడా అతడిని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేది. అయితే హాయిగా సాగిపోతున్న వీరి ప్రేమ కథలోకి అనారోగ్యం ఎంటరై వీరి కథన విషాధాంతం చేసింది. ఇటీవలే ప్రాథనా బోరా అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రోజు మృతి చెందింది. అయితే విషయం తెలుసుుకున్న ఆమె ప్రేమికుడు బిటుపన్ గుండెలవిసేలా రోదించాడు. జీవితాంతం కలిసి నడవాలనుకున్న ప్రేయసి విగత జీవిగా మారడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు.
అయితే ఆమెకు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన విషయం గుర్తుకు వచ్చి.. మృతదేహానికే తాళి కట్టాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా అంత్యక్రియలకు ముందు ఆ యువతికి తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. అంతే కాకుండా జీవితాంతం ఒంటరిగానే ఉంటానని, మరే అమ్మాయిని పెళ్లి చేసుకోనని అమ్మాయి మృతదేహం ముందు శపథం చేశాడు. అయితే ప్రేమిస్తున్నామంటూ వెంట పడడం, ఒప్పుకోకపోతే చంపేయడం, దాడి చేయడం వంటివి చేస్తున్న ఈ కాలంలో.. ఇలాంటి ప్రేమికులు కూడా ఉండడం నిజంగా హర్షించదగ్గ విషయమే.
లవర్ పెళ్లికి వెళ్లి తాళి లాగేసుకున్న యువకుడు..
ప్రేయసి పెళ్లికి వెళ్లిన ప్రియుడు...పూజారి నుంచి మంగళసూత్రం లాగేసుకున్నాడు. బలవంతంగా తన ప్రేయసికి తాళి కట్టేందుకు ప్రయత్నించాడు. తమిళనాడులోని తొందియర్‌పేట్‌లో నేతాజీ నగర్‌లో జరిగిందీ ఘటన. తన లవర్ పెళ్లి జరుగుతోందని తెలిసి ఫంక్షన్ హాల్‌కు వెళ్లిన యువకుడు ఆమెకు బలవంతంగా తాళి కట్టాలని చూశాడు. ఇంతలో వధువు కుటుంబ సభ్యులు వచ్చి వెనక్కి లాగేశారు. శుక్రవారం ఈ పెళ్లి జరగాల్సి ఉండగా...ఆ యువకుడు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వివాహం జరుగుతుండగా...పూజారి మంగళసూత్రాన్ని వరుడికి అందించబోయారు. హఠాత్తుగా ఓ యువకుడు వచ్చి ఆ తాళిని లాగేసుకున్నాడు. ఏం జరుగుతోందో అర్థం కాక అందరూ షాక్‌లో ఉండగానే...అమ్మాయి మెడలో కట్టాలని చూశాడు. పెళ్లికూతురు తరపున వాళ్లు ఒక్కసారిగా వచ్చి ఆ యువకుడిపై పడ్డారు. వెనక్కి లాగేశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే...ఆ యువకుడికి ఆ వధువే మెసేజ్ పంపిందట. "వచ్చి నన్ను తీసుకెళ్లు" అని మెసేజ్ చేశాకే...ఆ యువకుడు అక్కడికి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో వివాహం ఆగిపోయింది. వరుడు, వధువు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండు కుటుంబాలు చర్చించుకుంటున్నాయట.