ఒకవైపు కాంగ్రెస్ తో చర్చలు-మరోవైపు 16 మంది అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్
I.N.D.I.A కూటమిలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీట్ల పంపకాల విషయంలో జాప్యం జరుగుతుండటంతో...కూటమిలోని పార్టీలు అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి.
Lok Sabha Elections: 'ఇండియా' కూటమి (I.N.D.I.A)లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీట్ల పంపకాల విషయంలో జాప్యం జరుగుతుండటంతో...కూటమిలోని పార్టీలు అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. కాంగ్రెస్ (Congress)తో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతోన్న వేళ 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ప్రకటించారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ కోసం 11 సీట్లు పక్కనపెడతామని ప్రకటించిన మరుసటి రోజే...ఈ ఎస్పీ అభ్యర్థులను ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఎస్పీ జాబితాలో 11 మంది ఓబీసీలు ఉండగా, ఒక ముస్లిం, ఒక దళిత్, ఒక ఠాకూర్, టాండన్ వర్గం నుంచి ఒకరు, ఖత్రి వర్గానికి చెందిన అభ్యర్ధి ఒకరికి చోటు దక్కింది. 11 మంది ఓబీసీల్లో నలుగురు కుర్మిలు, యాదవులు ముగ్గురు, ఇద్దరు సఖ్యా, నిషాద్ వర్గం నుంచి ఒకరు,, పాల్ వర్గానికి చెందిన ఓ అభ్యర్ధి ఒకరు ఉన్నారు.
డింపుల్ యాదవ్‌కు మెయిన్‌పురి పార్లమెంట్ స్థానం
అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్‌కు మెయిన్‌పురి స్థానాన్ని ఖరారు చేసింది. ఉన్నావ్ పార్లమెంట్ స్థానం నుంచి అను టాండన్, బదాయు నుంచి ధర్మేంద్ర యాదవ్, సంభాల్ నుంచి షఫీకర్ రెహమాన్ బార్క్, లక్నో నుంచి రవిదాస్ మెహ్రోత్రా పోటీ చేయనున్నారు. ఫిరోజాబాద్ లోక్ సభ స్థానం నుంచి అక్షయ్ యాదవ్, ఈటా నుంచి దేవేశ్ సఖ్య, ఖేరీ నుంచి ఉత్కర్ష్ వర్మ, దౌర్హరా నుంచి ఆనంద్ బదౌరియా బరిలోకి దిగనున్నారు. ఫరూఖాబాద్ నుంచి కిషోర్ సఖ్య, అక్బర్‌పూర్ నుంచి రాజారాం పాల్, బందా నుంచి శివశంకర్ సింగ్ పటేల్ లోక్ సభకు పోటీ చేయనున్నారు. ఫైజాబాద్ నుంచి అవదేశ్ ప్రసాద్, అంబేడ్కర్ నగర్ నుంచి లాల్‌జీ వర్మ, బస్తీ నుంచి రామ్‌ప్రసాద్ చౌదరి, గోరఖ్‌పూర్ నుంచి శ్రీమతి కాజల్ నిషాద్ లకు సీట్లు కేటాయించారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్...కాషాయపార్టీతో జట్టు కట్టడంతో ఇండియా కూటమిలో చీలిక ఏర్పడింది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ వచ్చే ఎన్నికల్లో 42 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. ఇండియా కూటమితో సీట్ల పంపకాల చర్చలు విఫలమవుతున్న వేళ...సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.