Budget 2023: కాసేపట్లో అఖిల పక్షం భేటీ- సమావేశాలకు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసే అవకాశం!
Budget 2023: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అఖిల పక్షం సమావేశం నిర్వహించింది.
Budget 2023: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. బడ్జెట్ సమావేశాల దృష్ట్యా సజావుగా సభలు సాగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా విపక్షాలను కేంద్రం కోరుకున్నట్లు తెలుస్తోంది. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలో కేంద్ర్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టబోయే చివరి బడ్జెట్ సమావేశం ఇదే కానుంది. అందుకే విపక్షాలకు విజ్ఞప్తి చేయనుంది కేంద్రం. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఇప్పటికే ఆహ్వానం అందినట్లు సమాచారం.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, వి మురళీధరన్ సైతం హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా.. మంగళ వారం పార్లమెంట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో మొదలుకానున్నాయి. ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశ పెడతారు. ఇక బుధవారం పార్లమెంటులో బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు.
మరోవైపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు పార్లమెంట్ లో ఏ మాట్లాడాలో అనే దానిపై ఆదివారం సమావేశం నిర్వహించింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దురదృష్టకర విధానాలతో దేశంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాలని సీఎం కేసీఆర్... పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్ జరిగినన్ని రోజులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రజా సమస్యలపై గళం వినిపిస్తూ కేంద్రం చేస్తున్న తప్పులను దేశం దృష్టికి తీసుకురావాలని సీఎం అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామిక పంథాలో వీలైన అన్ని మార్గాలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ దిశగా బీఆర్ఎస్ పార్టీతో కలిసివచ్చే పార్టీలను కలుపుకుని కేంద్రాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఆదివారం ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశం అనేక అంశాలను చర్చించారు. కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరిత, ప్రమాదకర విధానాల వల్ల దేశ భవిష్యత్తుకు తీరని నష్టం వాటిల్లుతుందని సమావేశంలో ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ సమగ్రతకు, అభివృద్ధికి ఆటంకాలుగా మారాయని ఆరోపించారు. దేశ ప్రజలు తమ కష్టార్జితంతో కూడబెట్టుకుంటున్న సంపదనంతా అప్పనంగా తమ కార్పొరేట్ స్నేహితులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. తమకు అనుకూల కార్పొరేట్ శక్తుల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రేమ కురిపిస్తూ లక్షలాది కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తుందన్నారు. ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అదానీ వంటి బడా వ్యాపారవేత్తలకు వాటాలను అప్పనంగా కట్టబెట్టిందని ఆరోపించారు. వారి కంపెనీల డొల్లతనం బయటపడితే షేర్ల విలువ హఠాత్తుగా పడిపోయిందని, లక్షల కోట్ల రూపాయలు ఒక్క రోజులోనే నష్టపోతున్న వాస్తవాన్ని దేశం గమనిస్తుందని కేసీఆర్ అన్నారు.