Parliament Sessions 2024: నేటి నుంచి 18వ లోక్‌సభ సమావేశాలు- 26న స్పీకర్ ఎన్నిక
Lok Sabha:2024 ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీఏ హయాంలో నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 2రోజుల పాటు సభ్యుల ప్రమాణం తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది.
Parliament Sessions : 18వ లోక్‌సభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. జులై 3 వరకు పది రోజులపాటు సాగే లోక్‌సభ సమావేశాల్లో ముందు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. తర్వాత రోజు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికైన భర్తృహరి కొత్త సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. ఆయనతో కాసేపట్లో రాష్ట్రపతి ప్రమాణం చేయించనున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ప్రారంభమవుతుంది. అనంతరం మంత్రులు ప్రమాణం చేస్తారు. ఇది కూడా సీనియార్టీ ఆధారంగా ఉంటుంది. వీళ్ల తర్వాత మిగతా సభ్యులంతా ప్రమాణం చేస్తారు.
ఇవాళ ఏపీ సభ్యులు- రేపు తెలంగాణ సభ్యులు
544 మంది సభ్యులు ఉన్న లోక్‌సభలో మొదటి రోజు సగం మంది సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. రెండో రోజు మిగతా సభ్యులు ప్రమాణఁ చేస్తారు. రెండు రోజుల పాటు ఈ ప్రమాణ స్వీకారం ప్రక్రియ సాగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ఎంపీలు మొదటి రోజు ప్రమాణం చేయనున్నారు. రెండో రోజు అంటే మంగళవారం తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేయనున్నారు.
స్పీకర్‌గా ఓం బిర్లా!
ఈసారి లోక్‌సభ స్పీకర్ ఎవరు అనే చర్చ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి వివరాలను బీజేపీ అధినాయకత్వం ఇవ్వలేదు. ఈ పదవిని మిత్ర పక్షాలకు ఇచ్చే ఆలోచన వారిలో లేనట్టు కనిపిస్తోంది. మరోసారి ఓంబిర్లాకు ఇవ్వబోతున్నారని మాత్రం సమాచారం అందుతోంది. ఇలా జరిగితే బలరాం జాఖడ్ తర్వాత అలాంటి ఘనత సాధించిన రెండో వ్యక్తిగా బిర్లా చరిత్ర సృష్టిస్తారు.
డిప్యూటీపై విపక్షం పట్టు
మరోవైపు ఈ స్పీకర్ పదవి విషయంలో మాత్రం ఇండీ కూటమి గట్టిగానే ఉంటోంది. అధికార ప్రతిపక్షాలను సమానంగా చూసే వ్యక్తి మాత్రమే ఆ స్థానంలో కూర్చోవాలని పట్టుబడుతోంది. కీనంస డిప్యూటీ స్పీకర్ పదవినైనా విపక్షానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. లేకుంటే డిప్యూటీ స్పీకర్ విషయంలో ఎవర్ని పెట్టినా కచ్చితంగా తాము పోటీలో ఉంటామని స్పష్టం చేస్తోంది. దీంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఆసక్తిగా మారింది.
జులై 22 నుంచి బడ్జెట్ సమావేశాలు
సమావేశాలు ప్రారంభమైన మొదటి రెండు రోజులు సభ్యుల ప్రమాణ స్వీకారంతోనే సరిపోతుంది. మూడో రోజు అంటే 26న స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తి అవుతుంది. అనంతరం 27 ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడతారు. తర్వాత రెండు సభల్లో దీనిపై చర్చ జరగనుంది. జులై3తో సమావేశాలు వాయిదా పడతాయి. మళ్లీ జులై ఆఖరిలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.
వచ్చే ఎన్నికలు చాలా స్పెషల్
544 మంది సభ్యులున్న లోక్‌సభ వచ్చే ఎన్నికల నాటికి స్వరూపం మారిపోనుంది. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా సభ్యుల సంఖ్య మరింత పెరగనుంది. దీనికి తోడు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఆమల్లోకి రానుంది. 2029 నాటికి ఎన్నికల తర్వాత కొలువుదీరే సభ చాలా ప్రత్యేకతను సంతరించుకోనుంది.