(Source: ECI/ABP News/ABP Majha)
India's Famous Artists: తమ కుంచెతో స్వతంత్య్ర పోరాట స్పూర్తిని పంచిన చిత్రకారులెందరో
India's Famous Artists: రవివర్మ నుంచి జైనుల్ అబెదీన్ వరకూ ఎంతో మంది తమ పెయింటింగ్స్‌తో స్వతంత్య్ర ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పారు.
India's Famous Artists:
ఎన్నో చిత్రాలు..మరెన్నో భావోద్వేగాలు..
కలం, కుంచె. చూడటానికి ఇవి సాధారణంగానే కనిపిస్తాయి. కానీ..అణగదొక్కినప్పుడు, అవమానాలు ఎదుర్కొన్నప్పుడు, పోరాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఇవే ఆయుధాలవుతాయి. స్వాతంత్య్రోద్యమంలో ఇదే జరిగింది. ప్రత్యక్ష యుద్ధ రంగంలోకి దూకి నినదించి పోరాడిన వాళ్లతో పాటు తమ కళను ఆయుధంగా మార్చుకుని పోరాడిన వాళ్లూ ఉన్నారు. వీరిలో రచయితలు, కవులతో పాటు ఆర్టిస్ట్‌లు కూడా ఉన్నారు. "మనమంతా ఒక్కటే" అనే భావనను పెంపొందించటంతో పాటు, ఉద్యమ స్ఫూర్తినీ నింపారు. రచయితలు తమ కలానికి పదును పెట్టి ప్రజల్లో చైతన్యం కలిగిస్తే, ఆర్టిస్ట్‌లు తమ కుంచెకు దేశభక్తిని అద్దారు. అప్పటి స్థితిగతులను కళ్లకు కడుతూ గీసిన చిత్రాలెన్నో ఉన్నాయి. ఎన్ని దశాబ్దాలు గడిచిపోయినా...ఆ పెయింటింగ్స్‌ను చూడగానే తెలియని భావోద్వేగం కలుగుతుంది. ఛత్రపతి శివాజీ, మహాత్మా గాంధీ, భరత మాత..ఇలా ఎన్నో చిత్రాలు నిత్య చైతన్యానికి ప్రతీకలుగా మారాయి. అలాంటి చిత్రాలు గీసిన ఆ ఆర్టిస్ట్‌లు ఎవరు..? స్వతంత్య్ర పోరాటంలో వారి పాత్ర ఏంటి..?
1. రాజా రవి వర్మ:
స్వతంత్య్ర పోరాటంలో తమ కళ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ఆర్టిస్ట్‌లలో రాజా రవి వర్మదే అగ్రస్థానం. 1857 నుంచే ఉద్యమం మొదలైనా, అది ఉద్ధృతం అవటానికి చాన్నాళ్లు పట్టింది. ప్రజల్ని సంఘటితం చేసే నాయకులు వచ్చాక కానీ, అది తారస్థాయికి చేరుకోలేదు. ఈ క్రమంలోనే రాజా రవి వర్మ...ప్రజల్లో ఉద్యమ వేడిని పుట్టించేందుకు 1890లో ఓ బొమ్మ గీశారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గుర్రంపై స్వారీ చేస్తూ ఉన్నట్టుగా ఓ పెయింటింగ్ వేశారు. పౌరుషానికి, పోరాట పటిమకు, రాజసానికి ప్రతీకగా నిలిచే శివాజీ చిత్రాన్ని గీసి, ప్రజలంతా ఇదే పౌరుషంతో పోరాడాలని పిలుపునిచ్చారు రాజా రవివర్మ. ఈ విధంగా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
2. అబనీంద్రనాథ్ ఠాగూర్:
జాతీయ వాదాన్ని బలపరచటం ద్వారానే స్వతంత్య్ర ఉద్యమం ఉద్ధృతమవుతుందని అప్పటి ఉద్యమ నాయకులు భావించారు. అందుకే...ఆ అంశంపైనే అందరూ దృష్టి సారించి అందరినీ ఒక్కటి చేశారు. ఇలా జాతీయ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవటంలో చిత్రకారులు కూడా ముఖ్య పాత్రే పోషించారు. వారిలో అబనీంద్రనాథ్ ఠాగూర్ ఒకరు. అప్పటి వరకూ భరతమాత అని నినదించటం తప్ప ఓ రూపం అంటూ ఎవరూ ఊహించుకోలేదు. కానీ..అబనీంద్రనాథ్ ఠాగూర్ "భరతమాత" పేరుతో ఓ బొమ్మను గీసి అందరినీ ఆశ్చర్యపరచటమే కాకుండా, ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పారు. కాషాయ దుస్తులు ధరించిన ఓ మహిళ. ఆమెకు నాలుగు చేతులు. ఓ చేతిలో ఓ పుస్తకం, మరో చేతిలో వరి. మరో రెండు చేతుల్లో ఓ తెల్లని వస్త్రం, రుద్రాక్షమాల. పూర్తిగా సాధ్వి వస్త్రధారణలో ఉన్న మహిళనే "భరతమాత" అని చిత్రీకరించారు అబనీంద్రనాథ్ ఠాగూర్. అప్పటి ఉద్యమంలో ఈ పెయింటింగ్ ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. బెంగాల్‌లో నిరసనకారులంతా ఈ పోస్టర్లనే ప్రదర్శిస్తూ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నినదించారు.
3. నందలాల్ బోస్:
ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఇండియన్ ఆర్ట్‌గా ప్రఖ్యాతి గాంచిన నందలాల్ బోస్ కూడా..తన కుంచెతో దేశభక్తిని రగిలించారు. 1930లో మహాత్మా గాంధీజీ బొమ్మను గీశారు. కొల్లాయి కట్టుకుని, ఓ కర్ర పట్టుకుని నడుస్తున్న గాంధీజీ బొమ్మకు "బాపూజీ" అని పేరు పెట్టారు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సందర్భంలో నందలాల్ బోస్ ఈ బొమ్మ గీశారు. ఇది విడుదలైన కొద్ది రోజులకే, అహింసాయుత పోరాటానికి ప్రతీకగా నిలిచింది. దేశ రాజధాని దిల్లీలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో నందలాల్ గీసిన ఎన్నో చిత్రాలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. దాదాపు 7 వేల పెయింటింగ్స్‌ను అక్కడ ప్రదర్శనకు ఉంచారు.
4. జైనుల్ అబెదీన్:
1943లో బెంగాల్ తీవ్ర దుర్భిక్షంతో సతమతమైంది. ఆ కరవు కష్టాలనూ కళాత్మకంగా చెప్పారు జైనుల్ అబెదీన్. ఆ సంక్షోభం నాటి స్థితి గతులను కళ్లకు కట్టేలా ఓ బొమ్మను గీశారు. ఎముకల గూడులా ఓ వ్యక్తి రోడ్డు పక్కన దారుణమైన స్థితిలో ఉన్న దృశ్యాన్నితన కుంచెతో ఎంతో బాధాకరంగా చిత్రీకరించారు. సాధారణ ప్యాకింగ్ పేపర్‌పై ఈ అసాధారణ పెయింటింగ్ వేశారు జైనుల్. ఆంగ్లేయుల పాలనలో రెక్కలుముక్కలు చేసుకుని పని చేసిన ప్రజల కష్టాలకు అద్దం పట్టింది ఈ పెయింటింగ్.
5. అమృత షేర్ గిల్:
1935లో భారత దేశ దుస్థితికి అసలు సిసలు రూపమిచ్చింది..."మదర్ ఇండియా" పెయింటింగ్. అమృత షేర్ గిల్ గీసిన ఈ చిత్రం ఆమెకు ఎంతో పేరు తీసుకురావటమే కాకుండా, ఎంతో మందిని ఆలోచింపజేసింది. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు అద్దం పడుతూ ఓ మహిళ తన కొడుకుని, కూతుర్ని అక్కున చేర్చుకుని ఉన్నట్టుగా ఉన్న ఈ పెయింటింగ్‌కి "మదర్ ఇండియా" అని పేరు పెట్టారు అమృత.
Also Read: Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే
Also Read: Independence Day 2022 : మనకు తెలియని మన స్వాతంత్య్ర యోధులు - ఎంత మంది తెలుగు వీరులో తెలుసా ?