Tamil Nadu Politics: ఇవాళ కాకపోతే రేపైనా విజయ్‌కు గవర్నర్ చాన్సివ్వాల్సిందే - రాజ్యాంగ రూల్స్ ఇవే!
Tamil Nadu Governor: విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా గవర్నర్ కాలయాపన చేయడం వివాదాస్పదం అవుతోంది. ఇవాళ కాకపోతే రేపైనా ఆయనకు చాన్సివ్వాల్సిందేనని రాజ్యాంగనిపుణులు అంటున్నారు.

Will Tamil Nadu Governor recommend President rule: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు దళపతి విజయ్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశమవుతున్నాయి. 108 స్థానాలతో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కాలయాపన చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముందే మ్యాజిక్ ఫిగర్ చూపాలి అని గవర్నర్ పట్టుబట్టడం రాజ్యాంగ విరుద్ధమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ఆర్టికల్ 164(1) ఏం చెబుతోంది?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పుడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఎక్కువగా ఉన్న నాయకుడిని లేదా అతిపెద్ద పార్టీ నాయకుడిని ఆహ్వానించే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉంటుంది. తమిళనాట 108 సీట్లతో విజయ్ అందరి కంటే ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ వంటి పార్టీల మద్దతుతో ఆయన మెజార్టీకి అత్యంత చేరువలో 113 సీట్లతో ఉన్నారు. అయినప్పటికీ, గవర్నర్ కొత్త నిబంధనలు తెరపైకి తెస్తూ ఆహ్వానించకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వాజ్‌పేయి నాటి సంప్రదాయం ఏమైంది?
1996లో కేంద్రంలో ఏర్పడిన పరిస్థితిని న్యాయ నిపుణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అప్పట్లో లోక్‌సభలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లేనప్పటికీ, అప్పటి రాష్ట్రపతి అతిపెద్ద పార్టీ నాయకుడిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ని ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. సభలో మెజారిటీ నిరూపించుకోవడానికి ఆయనకు తగిన సమయం ఇచ్చారు. ఇదే సంప్రదాయాన్ని అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు పాటించారు. కానీ తమిళనాడులో మాత్రం గవర్నర్ ముందే సంతకాలు కావాలి అని భీష్మించుకుని కూర్చోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదేనన్న విమర్శలు వస్తున్నాయి.
రాజ్ భవన్ గదుల్లో కాదు.. అసెంబ్లీలో తేలాలి!
సుప్రీంకోర్టు గతంలో అనేక కీలక తీర్పుల్లో ముఖ్యంగా ఎస్.ఆర్. బొమ్మై కేసు ఒక సూత్రాన్ని స్పష్టం చేసింది. ఏ ప్రభుత్వానికైనా మెజారిటీ ఉందో లేదో తేల్చాల్సింది రాజ్‌భవన్ గదుల్లో కాదు, కేవలం అసెంబ్లీ వేదికగా ఫ్లోర్ టెస్ట్ ద్వారా మాత్రమే. అయితే గవర్నర్ మాత్రం విజయ్ వద్ద 118 మంది మద్దతు లేఖలు లేవనిఅంటున్నారు. ముందుగా అతిపెద్ద పార్టీని ఆహ్వానించి, అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాలని గడువు ఇవ్వాలి. ఆ గడువులోగా నిరూపించుకోలేకపోతేనే ప్రత్యామ్నాయం చూడాలని అంటున్నారు.
కోర్టుకెళ్లే యోచనలో టీవీకే
విజయ్‌కు అవకాశం ఇవ్వకుండా గవర్నర్ చేస్తున్న కాలయాపన వల్ల రాష్ట్రంలో ఎమ్మెల్యేల బేరసారాలకు దారి తీసే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ ఏ పార్టీని పిలవకుండా గవర్నర్ ఇలాగే మొండికేస్తే, చివరకు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఇది ప్రజా తీర్పును ఘోరంగా అవమానించడమే అవుతుందని అంటున్నారు. గవర్నర్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే, టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడులో పార్టీలకు అతీతంగా నేతలందరూ విజయ్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక నాయకుడిని, కేవలం సాంకేతిక కారణాలు చూపుతూ అధికారం నుంచి దూరం చేయడం రాజ్యాంగ సంక్షోభానికి దారి తీయవచ్చని అంటున్నారు.
ట్రెండింగ్ వార్తలు





















