Nandyal District News: రాంగ్ కాల్‌తో పరిచయం, ఆపై సహజీవనం - నలుగురు పిల్లలు, చివరకు ఊహించని ట్విస్ట్
Nandyal District News: రాంగ్ కాల్ ద్వారా ఏర్పడిన పరిచయంతో దేశంలోకి అక్రమంగా చొరబడి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నలుగురు పిల్లల తండ్రయ్యాక వారితో పాటు సొంత దేశానికి పారిపోతుండగా పోలీసులకు చిక్కాడు.
Nandyal District News: ఫోన్‌కు వచ్చిన ఓ రాంగ్ కాల్ ద్వారా ఏర్పడిన పరిచయంతో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకునేందుకని చెప్పి అక్రమంగా దేశంలోకి చొరబడ్డాడు. ఆపై దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఆమెతో సహజీవనం చేశాడు. ఆపై పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరికీ నలుగురు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత వారితోపాటు దేశం దాటి పారిపోయే క్రమంలో పోలీసులకు పట్టుబడి ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు. నేడు అతడు జైల్లో ఉండగా.. పిల్లల పోషణ భారం మోయలేక ఆ మహిళ దీనంగా ఆర్జిస్తోంది.
అసలేం జరిగిందంటే..?
నంద్యాల జిల్లా గడివేములకు చెందిన షేక్ దౌలత్ బీకి పెళ్లయిన రెండేళ్ల తర్వాత భర్త చనిపోయాడు. అప్పటికే వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భర్త మరణించాక దౌలత్ బీ తల్లిదండ్రుల వద్దకు చేరింది. అక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే 2010లో ఆమె ఫోన్ కు ఓ కాల్ వచ్చింది. అలా పాకిస్థాన్ పౌరుడైన గుల్జార్ ఖాన్ తో పరిచయం ఏర్పడింది. అక్కడి పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన గుల్జార్ సౌదీ అరేబియాలో పెయింటర్ గా పని చేసేవాడు. ఇద్దరూ తరచూ ఫోన్ లో మాట్లాడుకునే వారు. దౌలత్ బీని కలిసేందుకని గుల్జార్ ఖాన్ సౌదీ నుంచి ముంబయి మీదుగా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించాడు. నేరుగా గడివేములకు వచ్చి 2011 జనవరి 25వ తేదీన దౌలత్ బీని నిఖా చేుకున్నాడు. వారికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం కలిగారు. తొమ్మిదేళ్ల పాటు వీరిద్దరి సంసారం సాఫీగానే సాగింది.
భార్యాపిల్లలతో కలిసి పారిపోతుండగా.. పట్టుబడి
గుల్జార్ ఖాన్ గడివేములలో ఆధార్ కార్డు కూడా పొందాడు. దాని ఆధారంగా తనతో పాటు భార్య, ఐదుగురు పిల్లలను సౌదీ అరేబియాకు తీసుకెళ్లేందుకు వీసాలు తీసుకున్నాడు. అక్కడి నుంచి పాకిస్థాన్ వెళ్లాలన్నది వారి ప్రణాళిక. 2019లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాగా తనిఖీ సిబ్బంది పరిశీలనలో గుల్జార్ ఖాన్ అక్రమంగా భారత్ లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. దీంతో చేసేదేం లేక పిల్లలతో సహా దౌలత్ బీ ఎయిర్ పోర్టు నుంచి ఆమె స్వస్థలానికి చేరుకుంది. ఆనాటి నుంచి భర్త తోడు లేక.. పిల్లల పోషణ భారమై కష్టంగా బతుకీడుస్తోంది.
గతేడాది మళ్లీ హైదరాబాద్ జైలుకు తరలింపు
తన ఐదుగురు సంతానంతోపాటు బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న సోదరి పోషణ భారం ఆమె పైనే పడింది ఇళ్లల్లో పనులు చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది. పెద్ద కుమారుడు మహమ్మద్ ఇలియాస్ కూలీ పనులకు వెళ్తుండగా.. మిగిలిన వారంతా పదేళ్లలోపు చిన్నారులే. గుల్జార్ ఖాన్ అరెస్టయిన ఆరు నెలల తర్వాత కరోనా కారణంగా జైలు నుంచి విడుదల అయ్యాడు. ఏడాది పాటు భార్యా పిల్లలతోనే కలిసి ఉన్నాడు. కానీ 2022లో మళ్లీ హైదరాబాద్ లోని జైలుకు తరలించారు. ఆమె తన భర్తను విడుదల చేయాలని అధికారులు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.