Azadi Ka Amrit Mahotsav: ఆహారమే లేని దుస్థితి నుంచి ఆత్మనిర్భరత వరకూ, భారత్‌లో ఈ అద్భుతం ఎలా జరిగింది?
Azadi Ka Amrit Mahotsav: స్వాతంత్య్రం సాధించిన నాటికి భారత్‌లో ఆహారోత్పత్తి కూడా సరిపడా లేదు. ఆ దుస్థితి నుంచి ఎన్నో సవాళ్లు దాటుకుని ఇప్పుడు బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబడింది.
ఆర్థిక వ్యవస్థకూ స్వాతంత్య్రం..
1947 ఆగస్టు 15తో దేశ ప్రజలకు మాత్రమే కాదు. ఆర్థిక వ్యవస్థకు, సామాజిక, రాజకీయ రంగాలకూ స్వేచ్ఛ లభించింది. ఇన్ని లక్షల హెక్టార్ల సాగు భూములు ఉండి కూడా అప్పుడు ఆహార ధాన్యాల కోసం పక్క దేశాల ముందు చేతులు చాచింది భారత్. అలాంటి దుస్థితి నుంచి ఇప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో "స్వయం సమృద్ధి" సాధించింది. ఇదేమీ అంత సులువుగా జరిగిపోలేదు. సవాళ్లు దాటుకుని పోతే కానీ సక్సెస్ రాదు. ఈ సూత్రం వ్యక్తులకే కాదు. దేశాలకూ వర్తిస్తుంది. భారత్ అందుకు మంచి ఉదాహరణ. స్వాతంత్య్రం వచ్చే నాటికి "బ్రిటీష్ వాళ్లు వెళ్లిపోతే భారత్ మనగలుగుతుందా" అన్న అనుమానాలెన్నో వచ్చాయంటే అప్పుడు దేశంఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా మొదలైన ప్రయాణం ఒక్కో మైలు రాయి దాటుకుంటూ ఇప్పుడు ఏకంగా 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంతో దూసుకుపోతోంది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాల జాబితాలో చేరిపోయింది. ఈ అద్భుతం ఎలా జరిగింది..? స్వాతంత్య్రం సాధించిన తొలి నాళ్లలోని కష్టాలను ఎలా అధిగమించగలిగింది..?
మనుగడే కష్టం అనుకున్న రోజులవి..
భారత ఆర్థిక రంగంలో కీలక మలుపు, దేశానికి స్వాతంత్య్రం రావటంతోనే మొదలైంది. పరిశ్రమలే లేని కారణంగా పేద దేశంగా ఒంటరిగా మిగిలిపోయింది. అప్పటికి భారతదేశ జనాభాలో అక్షరాస్యుల సంఖ్య ఆరోవంతు కన్నా తక్కువే. పేదరికం, సామాజిక అసమానతలతో దినదినగండంగా గడిచాయి అప్పటి రోజులు. 1700 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ అందించిన వాటా 22.6% కాగా, 1952 నాటికి దారుణంగా 3.8%కి పడిపోయింది. 20వ శతాబ్దపు తొలినాళ్లలో ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా నిలిచింది భారత్. తలసరి ఆదాయం దారుణంగా పడిపోయింది. తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ బాధ్యతలు చేపట్టిన తరవాత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పని మొదలైంది. 1948లో ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ (The Industrial Policy Resolution)తో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు బీజం పడింది. అంతకు ముందే బాంబేప్లాన్‌ను ప్రతిపాదించారు జేఆర్‌డీ టాటా, జీడీ బిర్లా లాంటి బడా పారిశ్రామిక వేత్తలు. ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పాలన్న ఆలోచన అప్పుడే వచ్చింది. విదేశాలపై ఆధారపడకుండా, దేశీయ పరిశ్రమలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేశారు. ఈ విధానంతో కచ్చితంగా దేశ ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటుందని బలంగా విశ్వసించారు అప్పటి పాలకులు. వాళ్ల అంచనాలకు అనుగుణంగానే, మార్పు స్పష్టంగా కనిపించింది.
ప్రణాళికా సంఘం ఏర్పాటుతో మలుపు..
1950లో భారత్ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఐదేళ్లలో అభివృద్ధి ఎలా జరగాలి..? అందుకోసం ఏయే వనరులు అవసరమవుతాయి..? నిధులు ఎన్ని కావాలి..? అనే అంశాలు ప్రస్తావించి, వాటికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించటమే..ఈ సంఘం నెలకొల్పటం వెనక ప్రధాన ఉద్దేశం. 1951లో తొలి సారి ఐదేళ్ల ప్రణాళికల్ని ప్రవేశపెట్టింది. నీటిపారుదల, వ్యవసాయ రంగాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది అప్పటి ప్రభుత్వం. అప్పటికే విదేశీ మారకద్రవ్య నిలువలు తగ్గిపోతున్నాయి. ఆహార ధాన్యాల కోసం దిగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఐదేళ్ల ప్రణాళికల్ని ప్రవేశపెట్టి అందుకు అనుగుణంగా పనులు చేయటం మొదలు పెట్టారో అప్పటి నుంచి పరిస్థితుల్లో సానుకూల మార్పు కనిపించింది. 2.1% మేర వృద్ధి రేటుని పెంచాలని అప్పట్లో లక్ష్యంగా పెట్టుకోగా, ఏకంగా 3.6%న్ని దాటేసింది. 1956-61 మధ్య కాలానికి సంబంధించిన ఐదేళ్ల ప్రణాళికలతో భారత దేశ పారిశ్రామిక రంగ ముఖచిత్రం మారిపోయింది. నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాయి. ఈ "మహల్‌నోబిస్" మోడల్..స్వదేశీ సూత్రాన్ని, ఆత్మనిర్భరత సాధించాల్సిన అవసరాన్ని చాలా బలంగా చెప్పింది. అప్పటి నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ జీడీపీని పెంచుకుంటూ వచ్చింది భారత్. ఆ తరవాత పీవీ నరసింహారావు హయాంలో జరిగిన ఆర్థిక సంస్కరణలు దేశ గతినే మార్చాయి.
ఆహార ధాన్యాల దిగుమతి నుంచి ఎగుమతి వరకూ..
ఈ ప్రయాణంలో మొట్టమొదట సాధించిన విజయం...ఆహార ధాన్యాల కొరతను అధిగమించటం. 1950, 60ల్లో తిండి గింజల కోసం కూడా పొరుగు దేశాలపైనే ఆధారపడాల్సి వచ్చింది. తరవాత సాగు రంగంలో వచ్చిన సంస్కరణలతో వ్యవసాయం పెరిగింది. ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించగలిగాం. 1950లో ఆహారోత్పత్తి 54.92 మిలియన్లు కాగా, 2020-21 నాటికి ఇది 305.44 మిలియన్లకు చేరుకుంది.
జీడీపీలో అనూహ్య వృద్ధి..
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన సమయంలో జీడీపీ కేవలం రూ. 2.7 లక్షల కోట్లు. ఈ 75 ఏళ్లలో భారత్ జీడీపీ విలువ రూ.135 లక్షల కోట్లకు పైగానే పెరిగింది. ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, 2031 నాటికి మూడో స్థానాన్ని ఆక్రమించేస్తుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేస్తోంది. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాకే...అప్పటి వరకూ ఉన్న వృద్ధి పదింతలు పెరిగింది.
విదేశీ మారక నిల్వలు
1950-51 ఏడాదిలో భారత్‌లో ఫారెక్స్ నిల్వల విలువ రూ.1,029 కోట్లు. నిజానికి ఇదే మనకు మేలు చేసింది. విదేశీ మారక నిల్వలు పడి పోతున్నాయని గమనించిన అప్పటి ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 1991లో 1.2 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. కేవలం మూడు వారాల దిగుమతులకు మాత్రమే సరిపడ నిధులివి. మూడు దశాబ్దాల తరవాత ప్రస్తుతం భారత్ వద్ద రూ. 46 లక్షల కోట్లకు పైగానే ఫారెక్స్ నిల్వలున్నాయి. ఇలా అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించి అగ్రరాజ్యాలతో పోటీ పడుతోంది భారత్.
Also Read: Azadi Ka Amrit Mahotsav: గాంధీజీ కొల్లాయి కట్టడానికి కారణమేంటి? ఆ సంఘటనే మార్పు తెచ్చిందా?