సమ్మర్‌లో జాగ్రత్తగా లేకుంటే ఇంత ప్రమాదమా! మీరు ఎంత ఆరోగ్యవంతులైనా సమస్య తప్పకపోవచ్చు
Health In Summer: వేసవి వచ్చిందంటే చాలా మంది భయపడిపోతారు. మరికొందరు పిచ్చలైట్ తీసుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ స్టోరీ
Can Hot Weather Cause Heart Problems: ఎండాకాలం ఇలా మొదలవగానే అలా ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. అధికవేడి వల్ల రోగనిరోధక శక్తిని దెబ్బతీయటమే కాకుండా, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని ఈ మధ్య జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. అధ్యయనం ప్రకారం, 624 మంది నుంచి బ్లడ్ సాంపిల్స్ తీసుకొని, సైటోకైన్స్ అనే చిన్న ప్రోటీన్ కణాలను పరీక్షించినపుడు, అధిక వేడికి ప్రభావితమైన వారిలో ఇవి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వారిలో రోగనిరోధక శక్తి దెబ్బ తింటున్నట్లు కనుగొన్నారు. ఇమ్యూన్ సిస్టం పనితీరు దెబ్బతినటం, రక్తనాళాలు ఉబ్బిపోవడం గుండెజబ్బులకు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
అధికవేడి నుంచి ఇలా కాపాడుకోండి
ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నపుడు ఇంట్లోనే ఉంటూ, వీలయినంత వరకు ఎయిర్ కండీషండ్ గదిలోనే ఉండటం మంచిది.
నీళ్లు ఎక్కువగా తాగండి
డైరెక్ట్ సన్ లైట్ లో నిలబటం గానీ, పని చేయటం గానీ చేయొద్దు.
టైట్ దస్తులు, నల్లరంగు బట్టలు కాకుండా వదులుగా ఉండే కాటన్ బట్టలు ధరించండి.
అధిక ఉష్ణోగ్రతల వల్ల గుండెపోటు మరణాలు
విపరీతమైన పొల్యూషన్ గ్లోబల్ వార్మింగ్ కు దారితీసి, అధిక వేడి వల్ల ఏటా వేలమంది గుండెపోటు బారిన పడుతున్నారని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఇంధన వినియోగం కోసం బొగ్గు, పెట్రోలియం తవ్వకాలు అధికంగా జరుపుతున్నారు. వీటితోపాట మరికొన్ని కారణాలు గ్లోబల్ వార్మింగ్ కి దారితీస్తున్నాయి. దీని ప్రభావం మనుషుల ఆరోగ్యం మీద తీవ్రంగా పడుతోంది. గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించటానికి చర్యలు కొనసాగుతున్నప్పటికీ, రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు కూడా తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాయుకాలుష్యం, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం మనుషుల ఆరోగ్యం మీద రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉండనుందని అంటున్నారు.
అంతేకాకుండా ఎండాకాలంలో ఎక్కువగా జరిగే కార్చిచ్చు వల్ల వాయు కాలుష్యం అధికమవుతుంది. గంటల నుంచి రోజుల పాటు కార్చిచ్చు మండుతూ ఉండటం వల్ల ఈ పొగ విపరీతమైన వాయు కాలుష్యం తద్వారా, గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతోంది. గతేడాది కెనడాలో వారాల పాటు కొనసాగిన వెయ్యికి పైగా కార్చిచ్చు ఘటనలు నార్త్ అమేరికన్ల ఆరోగ్యం పైన ఎంతగానో ప్రభావం చూపాయి.
వాయు కాలుష్యం ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
కలుషితమైన వాయుకణాలు లోపలికి వెళ్లటం వల్ల అవి సులువుగా రక్తనాళాల్లో ప్రవేశించగలుగుతాయి. దీని కారణంగా రక్తనాళాలు ఇబ్బిపోతాయి. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ కలిగిస్తుంది. తద్వారా గుండె రక్తనాళాల్లో రక్త ప్రవాహం తగ్గి, గుండె పోటుకు కారణమవుతుంది.
వాతావరణంలో కలుషిత వాయుకణాలైన PM2.5 అధిక మోతాదులో లోపలికి వెళ్లినపుడు గుండె జబ్బులు, అస్తమా వంటి వ్యాదులు వచ్చే రిస్క్ అధికంగా ఉంటుంది. N95 మాస్కులు ధరించటం వల్ల కలుషితమైన వాతావరణంలోని pm2.5 కణాలు శరీరంలోనికి వెళ్లకుండా ఉంటాయి. వేడి ప్రాంతాల్లో పని చేసే వారు తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు ఉండకుండా, కాసేపు చల్లని ప్రదేశాల్లో సేద తీరటం అవసరం. ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటం వల్ల శారీరక శ్రమ వల్ల కోల్పోయిన ద్రవాలు తిరిగి బ్యాలెన్స్ చేయవచ్చు. వదులైన బట్టలు మాత్రమే వేసుకోవాలి. టైట్ బట్టలు శరీర ఉష్ణోగ్రతను తీవ్రంగా పెంచుతాయి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ అధిక వేడి నుంచి కాపాడుకుంటే ప్రమాదకరమైన రోగాలు రాకుండా జాగ్రత్తపడవచ్చు.