Himachal CM Swearing-In: హిమాచల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ రెడీ, ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు
Himachal CM Swearing-In: హిమాచల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.
Himachal CM Swearing-In:
ముహూర్తం ఖరారు..
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుకుని ఖరారు చేసింది అధిష్ఠానం. రెండ్రోజుల సస్పెన్స్ తరవాత పేరుని ప్రకటించింది. ఇవాళ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హిమపూర్ జిల్లాలోని నదౌన్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సుఖ్వీందర్. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముకేశ్ అగ్నిహోత్రికి డిప్యుటీ సీఎం పదవిని కట్టబెట్టారు. ప్రతిపక్ష నేతగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. సీఎల్‌పీ సమావేశం జరగకముందే...ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాగేల్, హరియాణా మాజీ సీఎం భూపేంద్ర హుడా, హిమాచల్ కాంగ్రెస్ ఇంచార్జ్ రాజీవ్ శుక్లా..సుఖ్వీందర్ సింగ్, ప్రతిభా సింగ్, అగ్నిహోత్నితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ మీటింగ్ ముగిసిన వెంటనే...సుకు,అగ్నిహోత్రి గవర్నర్ రాజీందర్ అర్లేకర్‌కు కాల్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమని వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముహూర్తం పెట్టుకుంది కాంగ్రెస్. ఇదంతా అంత సింపుల్‌గా ఏం జరిగిపోలేదు. దీనికి ముందు పెద్ద హైడ్రామా నడిచింది. సీఎం రేసులో ప్రతిభా సింగ్ పేరు ఉన్నప్పటికీ...చివర్లో ఆమెను పూర్తిగా పక్కన పెట్టేసింది అధిష్ఠానం.
ప్రతిభా సింగ్ ఔట్..
ప్రతిభా సింగ్ విషయంలో కాంగ్రెస్ పెద్దలు వెనకడుగు వేయడానికి ఓ ప్రధాన కారణముంది. మండి నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్న ఆమెకు సీఎం పదవి అప్పగిస్తే ఆ సీట్ ఖాళీ అవుతుంది. ఇప్పటికిప్పుడు మళ్లీ ఉప ఎన్నికలు పెట్టక తప్పదు. కానీ...ఈ ప్రాంతంలోని 10 సీట్లలో కాంగ్రెస్ 9 స్థానాలు కోల్పోయింది. ఇలాంటి సమయంలో మళ్లీ అక్కడ ఎన్నికలు పెట్టి ఓడిపోవడం ఎందుకు అన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్.
అదీ కాకుండా...ప్రతిభా సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌కు కేబినెట్‌లో ఉన్నత పదవి ఇవ్వాలని భావిస్తోంది. అందుకే...ప్రతిభా సింగ్‌ను పక్కన పెట్టనుంది.
రాజస్థాన్‌పై ప్రభావం..
ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగించారు హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను సాధించింది. అయితే...ఈ విజయం రాజస్థాన్ రాజకీయాలపై ప్రభావం చూపనుంది. గుజరాత్‌లో దారుణమైన ఓటమిని చవి చూసింది కాంగ్రెస్. కనీసం 30 స్థానాల్లోనైనా గెలుస్తుందని అనుకున్నా..కేవలం 17 సీట్లకు పరిమితమైంది. మొట్ట మొదటి సారి పోటీ చేసి 5 సీట్లకు పరిమితమైన ఆప్ కూడా ఓటు షేర్ బాగానే రాబట్టుకోగలిగింది. గుజరాత్ ఎలా చేయి జారి పోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్న రాజస్థాన్‌నైనా కాపాడుకోవాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. అందుకే...సీఎం అశోక్ గహ్లోట్, డిప్యుటీ సీఎం సచిన్ పైలట్‌పై అసెస్‌మెంట్ మొదలు పెట్టింది అధిష్ఠానం. అందుకు కారణం...గుజరాత్ ఎన్నికల బాధ్యతలను అశోక్ గహ్లోట్ తీసుకోవడం. అంత సీనియర్ నేత నేరుగా రంగంలోకి దిగినా...పార్టీ ఏ మాత్రం లాభ పడలేదు. అయితే...అటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను సచిన్ పైలట్ తీసుకున్నారు. అక్కడ పార్టీ భారీ విజయం సాధించింది. చెప్పాలంటే...హిమాచల్‌లో కాంగ్రెస్‌కు సచిన్ పైలట్ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. ఎన్నికల వ్యూహాలు రచించడంలోనూ పైలట్ కీలక పాత్ర పోషించారు. ఫలితాల తరవాత...సచిన్ పైలట్‌కు వెయిటేజ్ పెరిగిపోయిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
Also Read: PM Modi: మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ, మహారాష్ట్ర పర్యటనలో బిజీబిజీ