సూర్యుడు జస్ట్ గ్యాప్ ఇచ్చాడంతే, మే నెలలో మళ్లీ నిప్పులే - ఎకానమీకి కూడా ముప్పే
Heatwave Weather Forecast: మే నెలలో మళ్లీ ఎండలు ముదురుతాయని IMD అధికారులు అంచనా వేస్తున్నారు.
Heatwave Weather Forecast:
మే లో పవర్ కట్స్..
పది రోజుల క్రితం వరకూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు ఇబ్బంది పెట్టాయి. ఉక్కపోతను తట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఒక్కసారిగా కూలర్‌లు, ఏసీల విక్రయాలు పెరిగాయి. ఆ తరవాత ఉన్నట్టుండి వాతావరణం చల్లబడింది అక్కడక్కడా వర్షాలు కురిశాయి. అయితే...సూరీడు మరోసారి మండి పడే అవకాశాలున్నాయని అంటున్నారు IMD అధికారులు. మే నెలలో మరోసారి వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని అంటున్నారు. అంతే కాదు. ఈ కారణంగా మే లో పవర్ కట్స్ కూడా ఉంటాయని వెల్లడించారు. మొత్తం విద్యుత్ నెట్‌వర్క్‌పై ఇది ప్రభావం చూపించే ప్రమాదముందని తెలిపారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశాలున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువగా నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. భారత్‌లోనే కాదు. ఆసియాలోని చాలా దేశాల్లో గతేడాది కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమ పంటపై తీవ్ర ప్రభావం పడింది. ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. ఎకానమీ కూడా డల్ అవుతోంది. ఈ ప్రభావం ట్రేడింగ్‌పై పడుతోంది. వాతావరణం మళ్లీ సాధారణానికి వచ్చేంత వరకూ రిస్క్ తీసుకోవద్దని భావిస్తున్నారు కొందరు ట్రేడర్స్.
అక్కడ కూడా అంతే..
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం...థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌లో ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. చైనాలోనూ ఇదే పరిస్థితులున్నాయి. యున్నాన్ ప్రావిన్స్‌లో కరవుతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వచ్చే వర్షాకాలంలో ఎల్ నినో ఏర్పడే ప్రమాముందనీ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడే కాదు. మరి కొన్ని ప్రాంతాల్లోనూ కరవు తప్పదని తేల్చి చెబుతున్నారు. అయితే..భారత్‌లో మాత్రం ఈ సారి వానలు బాగానే కురుస్తాయని వివరిస్తున్నారు.
వ్యాధులతో జాగ్రత్త..
దేశంలో పలు చోట్ల ఇప్పటికే ఉష్ణోగ్రతలు తీవ్రమయ్యాయని, వేడి కారణంగా పలు వ్యాధులు వచ్చే అవకాశముందని కేంద్రం వెల్లడించింది. మార్చి 1వ తేదీనే ఇందుకు సంబంధించిన సూచనలు చేసింది. ఈ తరహా వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ (NPCCHH)లో భాగంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేరిట ఈ లేఖలు పంపింది. పట్టణాలు, జిల్లాల్లోని ఆరోగ్య విభాగాలు ఉష్ణోగ్రతల కారణంగా వచ్చే వ్యాధులను కనిపెట్టుకుంటూ ఉండాలని చెప్పింది. మరోసారి అందుకు తగినట్టుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది. మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ వర్కర్లు సిద్ధంగా ఉండాలని వెల్లడించింది. ఫ్లూయిడ్స్, ఐస్‌ప్యాక్‌లు, ORSలు రెడీగా ఉంచుకోవాలని సూచించింది. తాగునీరు కూడా సరిపడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. వేసవిలో ఎక్కువ శాతం మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడుతుంటారు. దానికి కారణం వాతావరణంలో వేడి పెరగడం వల్ల ఆహారం త్వరగా పాడైపోతుంది. నిల్వ ఉండదు. ఆ విషయం తెలియని చాలా మంది నిల్వ ఉన్న ఆహారాన్ని తిని ఫుడ్ పాయిజనింగ్ బారిన పడుతుంటారు. అందుకే వేసవిలో నిల్వ ఆహారాన్ని తినేముందు ఓసారి పాడైందో లేదో చెక్ చేసుకుని తినండి. కాస్త వాసన వచ్చినా దాన్ని తినకపోవడమే మంచిది.
Also Read: ఆంబులెన్స్ కోసం 3 గంటల పడిగాపులు,తల్లి ఒడిలోనే ఆర్నెల్ల చిన్నారి మృతి