Has the Congress distanced PV : పీవీ కాంగ్రెస్‌కు దూరమయ్యారా ? కాంగ్రెస్సే దూరం చేసుకుందా ?
Bharat Ratna PV : పీవీ నరసింహారాను కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుందా ? బీఆర్ఎస్, బీజేపీ పొగిడినంతగా కాంగ్రెస్ ఎందుకు పట్టించుకోవడం లేదు ?
Bharat Ratna PV Narasimha Rao : పీవీ నరసింహారావు కాంగ్రెస్ నేత. ఆయనపై మరో పార్టీ ముద్ర లేదు. కానీ విచిత్రంగా ఆయనను బీఆర్ఎస్ పార్టీ పొగుడుతుంది. బీజేపీ పొగుడుతుంది కానీ కాంగ్రెస్ మాత్రం అంతగా ఓన్ చేసుకోదు. దీని వెనుక ఉన్న రాజకీయ కారణాలేంటి ?
రాజకీయాల నుంచి ఉపసంహరించుకున్న సమయంలో ప్రధాని పదవి
1990లో నరసింహారావుకు రాజ్యసభ సీటు ఇవ్వడానికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నిరాకరించారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. ఈ నిర్ణయం గురించి తెలిసి పీవీ చాలా బాధపడ్డారు. వెంటనే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. సైలెంట్ గా తిరిగి హైదరాబాద్ కు వెళ్లేందుకు కు రెడీ అయ్యారు. చాలా పటిష్టమైన రిటైర్‌మెంట్ ప్లాన్ ను రెడీ చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ఢిల్లీకి వచ్చినప్పుడు ఉండడానికి ఏర్పాట్ల కోసం ఈ దరఖాస్తు చేశారు. ఓ దశలో ఆయన సన్యాసం పుచ్చుకుని కుర్తాళం పీఠాధిపతిగా బాధ్యతలు తీసుకోవాలనుకున్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని పీవీ నర్సింహారావు స్వయంగా రాజీవ్ గాంధీకి చెప్పారు. తన లోక్‌సభ స్థానాన్ని వేరొకరికి ఇవ్వాలని అభ్యర్థించారు. ఆ ఎన్నికలలో పోటీ చేయలేదు.
నవభారత ఆర్థిక రూపశిల్పి పీవీ నరసింహారావు !
సోనియా ఆమోదంతోనే ప్రధాని పదవి
1991 మే 24న రాజీవ్ గాంధీ అంత్యక్రియలు జరిగాయి. పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను సోనియా గాంధీ మే 25 నుంచి ప్రారంభించారు. రాజీవ్ హత్య తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పై సానుభూతి వెల్లువెత్తింది. ఇంకా రెండు దశల ఎన్నికలు జరగాల్సి ఉండగా కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉంది. విజయం సాధిస్తే కాంగ్రెస్ అధ్యక్షుడే ప్రధాని అవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన మంత్రి పదవికి కాంగ్రెస్ నేతలు పోటీ పడడం సహజమే. ఈ రేసులో అప్పటి కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్ పవార్ , ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌డి తివారీ, అర్జున్ సింగ్, మాధవరావ్ సింధియాల పేర్లు ఉన్నాయనే చర్చ జరిగింది. రాజీవ్ గాంధీ ఆప్త మిత్రుడు సతీష్ శర్మ పీవీ పేరును సోనియాకు రికమెండ్ చేశారు. గాంధీ కుటుంబంపై ఎన్నడూ తిరుగుబాటు వైఖరిని ప్రదర్శించని.. గొప్ప విశ్వాసపాత్ర వైఖరి కారణంగా కాంగ్రెస్ లోని నాటి సీనియర్ నేతలు అందరూ పీవీ పేరును సమర్ధించారు. 1991 మే 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశమైంది. దీనిలో PV నరసింహారావు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మాజీ ప్రధానులు పీవీ నరసింహా రావు, చరణ్ సింగ్‌కి భారతరత్న - కేంద్రం కీలక ప్రకటన
పాలనా కాలంలో సోనియాతో దూరం
పార్టీ అధ్యక్షుడుగా ఉన్న పీవీ, కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికలు నిర్వహించే విషయం గురించి మాట్లాడారని, సోనియాగాంధీని పార్టీ నుంచి వేరు చేయడానికి ప్రయత్నించారని చాలా మంది చెబుతుంటారు. నెహ్రూ-గాంధీ కుటుంబంతో పడకపోవడంతో పాటూ బాబ్రీ మసీదు విధ్వంసంలో నరసింహారావు పాత్ర, ఆయన సమయంలో జరిగిన కుంభకోణాలతో పార్టీ అసౌకర్యానికి గురైందని కాంగ్రెస్ గురించి బాగా తెలిసినవారు చెబుతున్నారు. అయితే పీవీ కేంద్రంగా చాలా రాజకీయాలు జరిగాయని కూడా ప్రచారం ఉంది. ప్రధాన మంత్రిగా ఆయన పట్టు సాధిస్తూ ఉండడంతో పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు సోనియా చుట్టూ చేరి, ఆమెకు- పీవీకి మధ్య దూరం పెంచగలిగారని చెబుతారు. . ఆ సందర్భంగా అర్జున్ సింగ్, ఎన్‌డీ తివారీ వంటి వారు పీవీపై తిరుగుబాటు చేసి మరో కాంగ్రెస్ (తివారీ)ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత పీవీని అధ్యక్ష పదవి నుంచి తొలగించి.. సీతారాం కేసరిని పదవిలో కూర్చోబెట్టారు. తర్వాత ఆయనతోనూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయించి, సోనియా గాంధీకి పార్టీ నాయ కత్వం అప్పచెప్పారు. శరద్ పవార్, అర్జున్ సింగ్ లాగా పీవీకి ప్రత్యేకమైన వర్గంలేదు.
పీవీని గుర్తించడానికి కాంగ్రెస్ వెనుకడుగు
అసలు విషాదమంతా ఆయన రాజీనామా చేసిన తరువాత ఆయన పట్ల వ్యవహరించిన తీరులోనే ఉందని పీవీ అభిమానులు అంటారు. సోనియా, కాంగ్రెస్ పార్టీల వ్యవహారశైలి సరిగ్గా లేదని చనిపోయిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని అవమానపరిచారని అంటారు. పార్టీ వెబ్ సైట్ లో పార్టీ ఆర్ధికసంస్కరణల చరిత్ర గురించి వ్రాసినప్పుడు అందులో పీ వీ పేరే లేదని కూడా చెబుతారు. ఆయన జ్ఞాపకాలను చెరిపేయాలన్న ప్రయత్నం చేయడం వివాదాస్పదమయింది. కాంగ్రెస్ ఆయనను తిరస్కరిస్తే, బిజెపి, టీఆర్ఎస్లు ఆయన వారసత్వాన్ని సొంతం చేసుకునే ప్రయత్నాలు చేశాయి.