Telangna : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందా ? బీజేపీపై వ్యూహాత్మకంగా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారా ?
Budget Telangna : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జీరో అంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. న్యాయం చేయాలని రేవంత్ అంటున్నారు. ఇంతకీ తెలంగాణకు బడ్జెట్‌లో జీరో వచ్చిందా ?
Allocations for Telangana in the union budget : కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఎన్నికల కారణంగా ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇప్పుడు పూర్తి స్థాయి పద్దును నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. సహజంగానే బడ్జెట్ ప్రకటన తర్వాత తమకు అన్యాయం జరిగిందని రాష్ట్రాలు గళమెత్తుతూ ఉంటాయి. కేటాయింపులు చేయలేదని విమర్శలు చేస్తూ ఉంటాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ఎలాంటి విమర్శలు రావు కానీ.. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న చోట మాత్రం తప్పనిసరిగా ఇలాంటి విమర్శలు వస్తాయి. ఈ సారి ఏపీకి కొన్ని నిధులు ప్రత్యేకంగా ప్రకటించడం వల్ల.. ఆ రాష్ట్రం నుంచి పెద్దగా విమర్శలు లేవు. కానీ తెలంగాణ నుంచి సెగలు వస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడి బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
తెలంగాణకు జీరోనా - కేంద్ర బడ్జెట్ లో ఏమీ రాలేదా ?
తెలంగాణకు జీరో అంటూ చేస్తున్న ప్రచారం.. ఏమీ ఇవ్వలేదంటూ చేస్తున్న ఆరోపణలు సాంకేతికంగా పూర్తి స్థాయిలో అవాస్తవం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్ పూర్తిగా దేశం కోసం. అంటే అన్ని అన్ని రాష్ట్రాలకూ కేటాయించే నిధుల సమాహారమే కేంద్ర బడ్జెట్. రాష్ట్రాలను రాష్ట్రాలను రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలిస్తాయి. అన్ని రాష్ట్రాలను సమైక్యంగా కేంద్రం పరిపాలిస్తుంది. కేంద్రానికి వచ్చే పన్నుల ఆదాయాన్ని రాజ్యాంగ పరంగా తనకు ఉన్న వెసులుబాటును బట్టి రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. మిగిలిన వాటితో వివిధ రాష్ట్రాల్లో దేశానికి ఉపయోగపడే ప్రాజెక్టులు చేపడుతుంది. ఆ కోణంలో తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు వస్తాయి. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే పన్నుల్లో వాటాలతో పాటు .. గ్రాంట్లు, ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాల కింద నిధులు వస్తాయి. తెలంగాణకు ఏ విషయంలోనూ లోటు ఉండదు నిబంధనల ప్రకారం రావాల్సినవన్నీ వస్తాయి.
ఏపీకి రూ.15 వేల కోట్ల అప్పు సాయం, ప్రయోజనం ఏంటని వైసీపీ ఫైర్- రాజధానిపై అనుమానాలు!
కొత్తగా ప్రకటించిన ప్రాజెక్టుల్లోనూ తెలంగాణకు ప్రయోజనాలు
కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల్లో తెలంగాణకూ మేలు జరగనుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్‌లో భాగంగా తెలంగాణలోని 210 కి.మీల భాగం ఉంది. పాలమూరు జిల్లా పరిధి ఎక్కువగా ఉంది. ఈ కారిడార్ కింద కేంద్రం కేటాయించే నిధులు ఎక్కువగా తెలంగాణకు వస్తాయి. తెలంగాణలో రైల్వే, రోడ్ల నిర్మాణాలతోపాటు ఇతర రంగాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యపరంగానే నిధులు కేటాయించారు. వెనుకబడిన 150 జిల్లాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించనుంది. ఇందులో తెలంగాణకు చెందిన జిల్లాలు కూడా ఉంాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా అడిగిన వాటికే లేని సాయం
నాటి సీఎం కేసీఆర్ అయినా.. నేటి సీఎం రేవంత్ రెడ్డి అయినా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేకసాయం కోరుతూ వినతి పత్రాలు ఇచ్చారు. సాధారణంగా చట్టం ప్రకారం వచ్చేవి.. కేంద్ర ప్రాయోజిత పథకాల గురించి ప్రత్యేకంగా అడగాల్సిన పని లేదు. తెలంగాణకు ప్రత్యేకమైన నిధుల కోసమే అడుగుతూ వస్తున్నారు. అయితే అలా అడిగిన వాటికి సరైన ప్రతిపాదనలు పెట్టలేదన్న విమర్సలు కూడా ఉన్నాయి. ఇటీవల రేవంత్ ఢిల్లీ పర్యనటలో మూసి ఆధునీకీకరణ ప్రాజెక్టుకు నిధులు అందించాలని కోరారు. కానీ ఆ ప్రాజెక్టు డీపీఆర్ కూడా ఇంత వరకూ రెడీ కాలేదు. కేంద్ర దగ్గరకు సరైన ఫార్మాట్‌లో ప్రతిపాదనలు రాకుండా నిధులు కేటాయించడం అసాధ్యం. అలాగే విబజన చట్టంలోని అంశాల విషయంలోనూ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి బదులుగా ఓవర్ హాలింగ్ యూనిట్ ను పెట్టారు. ఇక పాలమూరు - రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో దేనికో ఓ దానికి జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. కానీ వాటి డీపీఆర్‌లు ఇంత వరకూ సమర్పించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ములుగు గిరిజన యూనివర్శిటీ నిర్మాణం పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే చేపడుతుంది. ప్రత్యేకంగా యూనివర్శిటీకి కేటాయించకపోయినా ఆయా శాఖల బడ్జెట్ నుంచి సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో అనేక విద్యా సంస్థలకు పెద్దగా నిధులు బడ్జెట్‌లో కేటాయించక పోయినప్పటికీ నిర్మాణాలు పూర్తయిపోయాయి.
ఏ రూపంలో అయినా నిధులు నిధులే - ఇరవై ఏళ్ల తర్వాత ఏపీకి సూపర్ బడ్జెట్
ఏపీకి ప్రత్యేకంగా చెప్పడం వల్లే సమస్యలు
ఏపీ రాజధానికి పదిహేను వేల కోట్ల ఆర్థిక సాయం ప్రకటించడంతో మరి తెలంగాణకు ఏంటి అన్న చర్చ ప్రారంభయింది. ఏపీ రాజధానికి అప్పు ఇస్తారో.. గ్రాంట్ గా ఇస్తారో స్పష్టత లేదు. అయితే అలా తెలంగాణకు ప్రత్యేకంగా ఏమీ ప్రకటించలేదు. ఐఐఎం అడిగినా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు కేంద్రం.. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి... తెలంగాణకు ఇవ్వాల్సిన అవసర ఏముందని అనుకునే అవకాశం ఉండదని.. అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయడమే కేంద్రం ఉద్దేశమని అంటున్నారు.
మొత్తంగా బడ్జెట్‌పై జరుగుతున్న చర్చల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనేది పాక్షికమైన వాస్తవం మాత్రమే. కేంద్ర బడ్జెట్‌లో అన్ని రాష్ట్రాలకు కేటాయింపులు ఉంటాయి. అయితే.. కొన్ని రాష్ట్రాలకు మాత్రం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఈ సారి ఏపీ, బీహార్‌లకు మాత్రమే ఆ కేటాయింపులు ఉన్నాయి. మరే రాష్ట్రానికీ లేవు. అందుకే మిగతా రాష్ట్రాలన్నీ తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్నాయి. కానీ ఆయా రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు వేల కోట్లు ప్రకటించినప్పుడు మిగిలిన రాష్ట్రాలు కూడా అలాగే ఫీల్ అయ్యాయి. కర్ణాటకలో మెట్రోకు ఇరవై వేల కోట్లు.. గజరారత్, కేరళ, తమిళనాడు ఇలా పలు రాష్ట్రాలకు గతంలో నిధులు ప్రకటించారు. అప్పుడీ రాష్ట్రాలు కూడా ఇలాగే ఫీల్ అయ్యాయి.