Haryana Clashes: హరియాణా అల్లర్లపై స్పందించిన అమెరికా, శాంతియుతంగా ఉండాలని సూచన
Haryana Clashes: హరియాణాలో జరిగిన అల్లర్లపై అమెరికా స్పందించింది.
Haryana Clashes:
స్టేట్ డిపార్ట్మెంట్ స్పందన..
హరియాణాలోని అల్లర్లపై అగ్రరాజ్యం స్పందించింది. అంతా శాంతియుతంగా ఉండాలని సూచించింది. హింసకు పాల్పడొద్దని తెలిపింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ నూహ్ అల్లర్లపై ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఘర్షణలో అమెరికా పౌరులెవరైనా గాయపడ్డారా అన్న సమాచారం లేదని, ఎంబసీని సంప్రదించిన తరవాతే ఈ వివరాలు వెల్లడిస్తామని తెలిపారు మిల్లర్.
"హరియాణాలోని నూహ్‌లో పరిస్థితులను చూస్తున్నాం. కారణమేదైనా సరే ఇరు వర్గాలు శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. హింసకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. ఈ హింసకు కారణమేంటన్నది తెలియదు. ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నాం. అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నాం"
- మాథ్యూ మిల్లర్, అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి
#WATCH | When asked about the clashes in Gurugram and surrounding areas, US State Department Spokesperson Matthew Miller says, "With respect to the clashes, that obviously, we would, as always, urge calm and urge parties to refrain from violent actions. With respect to whether… pic.twitter.com/p6Vo1QaBJt
— ANI (@ANI) August 2, 2023
హరియాణాలోని నూహ్‌లో విశ్వహిందూ పరిషత్ (VHP) నిర్వహించిన ఊరేగింపు అల్లర్లకు దారి తీసింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఒక్కసారిగా రాష్ట్రమంతా కలకలం రేగింది. ఇప్పటికే అప్రమత్తమైన ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను మొహరించింది. శాంతి భద్రతలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఘర్షణలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వీరిలో ఇద్దరు హోంగార్డ్‌లతో పాటు ముగ్గురు సాధారణ పౌరులు, ఓ ఇమామ్ ఉన్నారు. హరియాణాలో గొడవ సద్దుమణగకముందే అటు గుడ్‌గావ్‌లోనూ ఇదే తరహా కలహాలు మొదలయ్యాయి. ఫలితంగా ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. NCR ప్రాంతం పోలీసుల పహారాలో ఉంది. హరియాణాలో VHP ఊరేగింపునకు సంబంధించి అధికారులకు స్పష్టమైన సమాచారం లేదని, అందుకే ఇలా అల్లర్లు జరిగాయని చెప్పారు డిప్యుటీ సీఎం దుశ్యంత్ చౌతాలా.
అన్ని పెట్రోల్ బంక్‌లలో బాటిల్స్‌లో పెట్రోల్, డీజిల్ ఇవ్వకూడదని అధికారులు ఆదేశించారు. ఈ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరి హోం గార్డుల కుటుంబాలకు రూ.57 లక్షల పరిహారం ప్రకటించారు. కుట్రపూరితంగానే ఈ హింసను రెచ్చగొట్టారని ఆరోపించారు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ఇప్పటి వరకూ ఈ అల్లర్లకు కారణమైన 139 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 45 FIRలు నమోదయ్యాయి. అయితే...వీటిలో ఎక్కడా బజ్రంగ్ దళ్, వీహెచ్‌పీకి చెందిన వాళ్ల పేర్లు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్ట్‌లు పెట్టిన వారిపై కేసులు పెట్టారు. దాదాపు 10 అభ్యంతరకరమైన పోస్ట్‌ల URLలను గుర్తించారు. ఈ ప్రాంతాల్లోని క్రిమినల్స్ ఎంత మంది ఉన్నారన్న లెక్కలూ తీస్తున్నారు పోలీసులు. నాలుగు గ్రామాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికే దీనిపై 10 సిట్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఒక్కో కమిటీకి ఒక్కో బాధ్యత అప్పగించారు.
Also Read: ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొట్టినా నోరు జారకండి, ఎంపీలకు ప్రధాని మోదీ ఉపదేశం