Gujarat Election Result: బీజేపీని ఓడించి వెన్నుపోటు పొడిచారు, దేశానికి ద్రోహం చేశారు - ఓటర్లపై గుజరాత్ మంత్రి ఆగ్రహం
Gujarat Election Result: గుజరాత్‌లోని వడ్గం నియోజకవర్గం ఓటర్లు బీజేపీని ఓడించి వెన్నుపోటు పొడిచారనని మంత్రి జగ్దీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Gujarat Election Result:
జగ్దీష్ విశ్వకర్మ అసహనం..
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. మునుపెన్నడూ లేని స్థాయిలో 156 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 17 స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. వీటిలో వడ్గాం (Vadgam) నియోజకవర్గం ఒకటి. కాంగ్రెస్ అభ్యర్థి జిగ్నేష్ మేవాని ఇక్కడ విజయం సాధించారు. దీనిపై..గుజరాత్ మంత్రి జగ్దీష్ విశ్వకర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఓటమికి ఓటర్లే కారణమని ఆరోపించారు. ఈ నియోజక వర్గంలోని ఎస్‌సీ వర్గానికి చెందిన ఓటర్లు బీజేపీకి ఓటు వేసి గెలిపించకుండా వెన్నుపోటు పొడిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. MSME మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జగ్దీష్ విశ్వకర్మ వడ్గాంలోని వర్ణవాడ గ్రామ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. ప్రజలందరూ ఆయనకు స్వాగతం పలకగా ఆయన మాత్రం ఆగ్రహంతో ఇలా మాట్లాడారు. "బీజేపీ ఓటమికి కారణమైన వాళ్లంతే దేశానికి ద్రోహం చేసిన వాళ్లే. నన్ను ఇలా ఘనంగా స్వాగతించారు. పూల మాల వేసి సత్కరించారు. అయినా...నాకు సంతృప్తి లేదు. ఇలాంటివి చేసే బదులు బీజేపీని గెలిపించి ఉంటే బాగుండేది" అని అన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని స్పందించారు. "కోట్ల రూపాయలు వెచ్చించినా గెలవలేకపోయామనే అసహనంతో మాట్లాడుతున్నారు. అంత ఘన స్వాగతం పలికితే ఆయన మాత్రం గ్రామస్థులను కించపరిచారు. ఓటమిని ఎలా అధిగమించాలన్నది ఆయన నేర్చుకోవాలి" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగే ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ తప్పకుండా ఓడిపోతుందని తేల్చి చెప్పారు.
భారీ మెజార్టీతో విజయం..
గుజరాత్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా భాజపా పాలిత రాష్ట్రాల నుంచి కనీసం 20 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. భూపేంద్ర పటేల్ వరుసగా రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సహా పలువురు కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు. గాంధీనగర్‌లోని కొత్త సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లోని హెలిప్యాడ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌తో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కొత్త మంత్రి మండలి కూడా ప్రమాణ స్వీకారం చేసింది. ఇటీవల ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గానూ 156 స్థానాలను భాజపా గెలుచుకుంది. ఈ అఖండ విజయంతో గుజరాత్‌లో భాజపా తన జైత్రయాత్రను కొనసాగించింది. రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ 17 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఐదు స్థానాలను గెలుచుకుంది. సమాజ్ వాదీ పార్టీ ఒక స్థానం, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాలలో విజయం సాధించారు. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. 30 ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. అక్కడక్కడా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ...దాన్ని కూడా అధిగమించి భారీ విజయం దిశగా దూసుకుపోయింది.
Also Read: Mamata Banerjee: అమిత్‌షా సమక్షంలో భద్రతా బలగాలతో మమతా వాగ్వాదం, అధికారాల విషయంలో అభ్యంతరాలు