Gujarat Elections 2022: భార్య గెలుపు కోసం రవీంద్ర జడేజా ప్రచారం- వీడియో చూశారా!
Gujarat Elections 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన తన భార్య కోసం క్రికెటర్ రవీంద్ర జడేజా ప్రచారం చేస్తున్నాడు.
Gujarat Elections 2022: టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా.. తన భార్య తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న తన భార్యను గెలిపించాలని క్రికెట్ అభిమానులకు రెండు చేతులు జోడించి గుజరాతీ భాషలో విజ్ఞప్తి చేశాడు. ఇందుకు సంబంధించి జడేజా ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
જામનગર ના મારા તમામ મિત્રો ને મારુ દીલ થી આમંત્રણ છે. જય માતાજી🙏🏻 pic.twitter.com/olZxvYVr3t
— Ravindrasinh jadeja (@imjadeja) November 13, 2022
క్రికెటర్‌గా జడేజాగా చాలా మంది అభిమానులు ఉన్నారు. దీంతో జడేజా ప్రచారం తన భార్యకు మేలు చేస్తుందన్న ఉద్దేశంతో ఈ వీడియో రిలీజ్ చేశారు.
బరిలో
రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. గుజరాత్ జామ్‌నగర్ నార్త్ విధానసభ స్థానం టికెట్‌ను ఆమెకు ఇచ్చినట్లు ఇటీవలే ప్రకటించింది. రివాబా 2019లోనే భాజపాలో చేరారు.
జామ్‌నగర్ నార్త్ గుజరాత్ అసెంబ్లీ సీటును భాజపా.. అంతకుముందు ధర్మేంద్రసింగ్ జడేజాకు ఇచ్చింది. రివాబా 2016లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. ఆమె మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆమె కాంగ్రెస్ నాయకుడు హరిసింగ్ సోలంకీకి బంధువు.
అక్క కూడా
జడేజా భార్య రివాబా పోటీచేస్తున్న స్థానానికి.. జడేజా అక్క నైనా కూడా పోటీపడుతున్నారు. అయితే ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీలో ఉన్నారు. రివాబా భాజపా నుంచి బరిలోకి దిగితే నైనాకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. దీంతో జడేజా తన భార్యకు మద్దతిస్తాడా లేక అక్క తరఫున ప్రచారం చేస్తాడో చూడాలని చాలా వార్తలు వచ్చాయి. కానీ జడేజా చివరికి.. భార్య రివాబా తరఫునే ప్రచారం చేస్తున్నాడు.
ఎన్నికల షెడ్యూల్
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. గుజరాత్ శాసనసభ పదవీకాలం 2023, ఫిబ్రవరి 18తో ముగియనుంది.
డిసెంబర్ 1న గుజరాత్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్, ఫలితాలు వెల్లడించనుంది.
2017లో
గుజరాత్‌లో ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలో ఉంది. గుజరాత్‌లో 182 శాసనసభ స్థానాలుండగా.. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 77 స్థానాలు సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో పలుమార్లు ఉప ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం కాషాయ పార్టీ బలం 111కు పెరిగింది.
Also Read: Twitter Layoffs: మరో 5,500 మందిని లేపేసిన మస్క్ మామ- ట్విట్టర్ ఉద్యోగులకు షాక్!