(Source: ECI/ABP News/ABP Majha)
Republic Day 2024: రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్! ఆహ్వానం పంపిన భారత్
Republic Day 2024: వచ్చే ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని మేక్రాన్‌కి భారత్ ఆహ్వానం పంపింది.
Republic Day Celebrations 2024:
వచ్చే ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి ఆహ్వానం పంపింది భారత్. అయితే..కొన్ని కారణాల వల్ల ఆయన హాజరు కాలేకపోతున్నారు. ఆయనకు బదులుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (Emmanuel Macron) ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని భారత్ ఆహ్వానం పంపింది. అనుకున్న ప్రకారం జరిగితే మేక్రాన్ వచ్చే జనవరి 26న భారత్‌కి రానున్నారు. ఇప్పటి వరకూ ఐదుగురు ఫ్రెంచ్ నేతలు రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు. మేక్రాన్ వస్తే ఈ వేడుకలకు హాజరైన ఆరో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా నిలుస్తారు. మేక్రాన్‌కి ముందు 1976, 1998లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అప్పటి ఫ్రాన్స్ ప్రధాని జాక్వెస్ చిరాక్ ( Jacques Chirac) ముఖ్య అతిథిగా వచ్చారు. 1980లో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు వాలెరీ గిస్కార్డ్, 2008లో నికోలస్ సర్కోజి, 2016లో ఫ్రాన్‌కోసిస్ హోలాండే హాజరయ్యారు.
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని రిపబ్లికే డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానం అందించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన ఢిల్లీ G20 సదస్సు జరిగిన సందర్భంలోనే ఈ విషయం ప్రస్తావించారు. అప్పుడు యూఎస్ కాన్వాయ్ వెంటనే అంగీకరించింది. ఆ తరవాత కొన్ని కారణాల వల్ల బైడెన్ రాలేకపోతున్నారని అమెరికా వెల్లడించింది. అయితే...ఆ కారణమేంటన్నది మాత్రం చెప్పలేదు. జనవరి 30న అమెరికా ఎన్నికలను ఉద్దేశించి బైడెన్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ షెడ్యూల కారణంగానే ఆయన భారత్‌కి రాలేకపోతున్నట్టు స్థానిక మీడియా చెబుతోంది.