మీ ఫాస్టాగ్‌కు కేవైసీ చేయించారా? లేకుంటే మీరు బ్లాక్ లిస్ట్‌లో పడతారు?
Fastag KYC: వాహనదారులంతా జనవరి 31 నాటికి తమ ఫాస్టాగ్స్‌ను కేవైసీ చేయించుకోవాలని కేంద్రం ఆదేశించింది.
Fastag Updates: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 'ఒక వాహనం ఒకే ఫాస్టాగ్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫాస్టాగ్ వాహనాలతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ఈ కొత్త విధానం తీసుకొచ్చింది. ఒకే ఫాస్టాగ్‌ను వివిధ వాహనాలకు వినియోగించే వారిని నివారించేందుకు చర్యలు చేపట్టింది. మరికొందరు ఒకే వాహనంపై వివిధ ఫాస్టాగ్‌లు తీసుకుంటున్నారు దీనికి విరుగుడుగా ఒక వాహనం ఒక ఫాస్టాగ్ పేరుతో ప్రక్రియ తీసుకొచ్చింది.
వాహనదారులంతా జనవరి 31 నాటికి తమ ఫాస్టాగ్స్‌ను కేవైసీ చేయించుకోవాలని కేంద్రం ఆదేశించింది. KYC పూర్తికాని ఫాస్టాగ్స్, బకాయిలు ఉన్న అంకౌంట్‌లు జనవరి 31, 2024 తర్వాత డియాక్టివేట్ అవుతాయి. అంటే వాటిని బ్లాక్‌లిస్ట్ చేస్తారు. ఒక వేళ అలాంటి ఫాస్టాగ్‌తో టోల్ గేట్ వద్ద దొరికితే భారీగా జరిమానా విధిస్తారు.
పాత ఫాస్టాగ్‌లు KYC పరిధిలోకి వస్తాయని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖాధికారులు చెప్పారు. ఈ మధ్య కాలంలో తీసుకున్న ఫాస్టాగ్స్ ఆధార్‌తో లింక్ చేసి ఉన్నాయని అందుకే వాటికి KYC ఆటోమేటిక్ అవుతుందని ఈ విధానం వచ్చిన మొదట్లో తీసుకున్నవి మాత్రం ఆధార్‌తో లింక్ కాలేదన్నారు. అందుకే వాటికి కచ్చితంగా కేవైసీ చేయాల్సిందేనంటోంది కేంద్రం.
KYC పూర్తి చేయడానికి ఎక్కడికి వెళ్లాలి?
ఫాస్టాగ్ కలిగి ఉన్న వాళ్లు తమ అకౌంట్ లింక్ అయిన ఉన్న బ్యాంకుకు వెళ్లి KYCని అప్‌డేట్ చేసుకోవాలి. ఒక వేల పేమెంట్ గేట్‌వే ద్వారా తీసుకుంటే అందులోనే కేవైసీలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
కొందరు డ్రైవర్లు ఈ ఫాస్టాగ్‌ను దుర్వినియోగం చేస్తున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. లైట్ వెహికల్స్ ఫాస్టాగ్‌ను తీసుకొని చాలా మంది భారీ వాహనాలు నడుపుతున్నారని గుర్తించారు. అంటే చిన్న వాహనాలకు టోల్ ఛార్చ్ తక్కువ ఉంటుంది. భారీ వాహనాలకు ఎక్కువ ఉంటుంది. అందుకే వీళ్లు ఈ మోసానికి పాల్పడుతున్నారు.
వాహనం విండ్‌షీల్డ్‌పై కచ్చితంగా ఫాస్టాగ్ ఉంచాలని కూడా రూల్స్ చెబుతున్నాయి. దీని వల్ల టోల్ ప్లాజాల వద్ద జాప్యం లేకుండా ఉంటుందని అంటున్నారు. లేకుంటే టోల్‌ప్లాజాల వద్ద రద్దీ పెరిగిపోతోందని అంటున్నారు.