Fake Anti-India Content: పాకిస్థాన్‌కు మళ్లీ షాక్.. 35 యూట్యూబ్ ఛానళ్లపై బ్యాన్
నిఘా విభాగం అందించిన సమాచారం మేరకు పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతోన్న 35 యూట్యూబ్ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల అకౌంట్లను భారత్ సర్కార్ బ్లాక్ చేసింది.
పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతోన్న పలు యూట్యూబ్, సామాజిక మాధ్యమాల అకౌంట్లను భారత్ బ్లాక్ చేసింది. నిఘా విభాగం అందించిన సమాచారంతో సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ వీటిని బ్లాక్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు జనవరి 20న ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఐబీ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ విక్రమ్ సహాయ్ వెల్లడించారు.
ఆ యూట్యూబ్ ఛానళ్లకు 1.20 కోట్ల సబ్స్క్రైబర్లు, 130 కోట్ల వ్యూస్ ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రసారం చేసే ఛానళ్లను మరిన్నింటిని నిషేధిస్తామని అధికారులు తెలిపారు. ఆ దిశగా నిఘా విభాగం పని చేస్తున్నట్లు చెప్పారు.
గతేడాది..
గతేడాది డిసెంబర్‌లో పాకిస్థాన్‌కే చెందిన 20 యూట్యూబ్ ఛానెళ్లు, రెండు వెబ్‌సైట్స్‌ను కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. ఇంటెలిజెన్స్ వర్గాలతో సంప్రదింపులు జరిపి అనుమానాస్పదంగా వ్యవహరించిన యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్స్‌ను బ్లాక్ చేసింది. క్రిస్టియన్ స్కూళ్లను ఆరెస్సెస్ నాశనం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అనుమతి ఇచ్చారని, 200 మంది భారత ఆర్మీ సిబ్బంది శ్రీనగర్‌లో ఇస్లాం మతంలోకి మారారంటూ పలు విషయాలపై దుష్ప్రచారం జరిగినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
పాకిస్థాన్ నుంచి సమాచారం అందుకుని యూట్యూబ్ ఛానెళ్లలో ప్రసారం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. మన దేశానికి సంబంధించి సున్నితమైన అంశాలను సైతం పాక్ వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానెళ్లలో యథేచ్చగా ప్రసారం చేస్తున్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Also Read: Goa Poll 2022: స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి జూనియర్ పారికర్.. భాజపాకు బైబై