Fact Check: తాళిబొట్టు తీర్పు నిజం కాదా, ఫ్యాక్ట్ చెక్ రిపోర్ట్‌లు ఏం చెబుతున్నాయి?
మద్రాస్ హైకోర్ట్ "తాళిబొట్టు" తీర్పు నిజం కాదని ఫ్యాక్ట్‌చెక్ రిపోర్ట్‌లు చెబుతున్నాయి.
ఆ తీర్పులో నిజం లేదు: ఫ్యాక్ట్ చెక్
మద్రాస్ హై కోర్ట్ ఓ విడాకుల కేసులో "మంగళసూత్రం"పై ఇచ్చిన తీర్పు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ తీర్పుపై ఒక్కో వర్గం
ఒక్కోలా స్పందిస్తోంది. ఫెమినిస్ట్‌లు ఇదేం తీర్పు అంటూ మండి పడుతున్నారు. మొత్తంగా ఇది పెద్ద ఎత్తున చర్చకు దారి తీయటమే కాకుండా రచ్చ కూడా అయింది. అయితే కోర్టు తీర్పు ఒకలా ఉంటే, సోషల్ మీడియాలో మరో విధంగా ప్రచారం చేశారని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. 2017లో ఓ కేసులో ఇచ్చిన తీర్పుని ప్రస్తుత కేసుకి ఆపాదిస్తూ అన్ని మీడియా సంస్థల్లోనూ ప్రచారం జరిగిందని వెల్లడైంది. "భర్త మృతి చెందక ముందే ఓ మహిళ తన మెడలోని తాళిబొట్టుని తీసేయటం...మానసిక క్రూరత్వమే" అని మద్రాస్ హైకోర్ట్ చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇది ఇప్పుడు ఇచ్చిన తీర్పు కాదని తెలుస్తోంది. 2017లో ఓ విడాకుల కేసులో కోట్ చేసిన వ్యాఖ్యల్ని, ప్రస్తుత కేస్ విచారణ సందర్భంలో ప్రస్తావించారని..వాటినే ప్రస్తుత తీర్పుకి ఆపాదించుకున్నారని ఓ ఫ్యాక్ట్ చెకింగ్ రిపోర్ట్ తెలిపింది. అంతే కాదు. ప్రస్తుత కేసులో...మహిళ, భర్తను మానసికంగా హింసించిందనటానికి ఆధారాలున్నాయని కోర్ట్ వద్ద ఉన్నాయి. కావాలనే ఆ మహిళ, తన భర్త పని చేస్తున్న ఆఫీస్‌కు వెళ్లి దుర్భాషలాడుతూ గొడవ పడిందని, అక్కడి మహిళా సహోద్యోగులతో అక్రమ సంబంధం అంటగట్టిందని హైకోర్ట్ ఆర్డర్ వెల్లడించింది.
తన భర్తకు చాలా మందితో అక్రమ సంబంధం ఉందని ఆరోపించిన మహిళ, వారెవరు అన్న విషయం మాత్రం పిటిషన్‌లో ప్రస్తావించలేదని కోర్టు తెలిపింది. ఈ ప్రవర్తన ఆధారంగానే, ఆ మహిళది మానసిక క్రూరత్వం అని వ్యాఖ్యానించింది మద్రాస్ హైకోర్ట్. అయితే పాత కేసులోని తీర్పుని, కొత్త కేసులోని వ్యాఖ్యల్ని జోడించి "తాళిబొట్టు తీయటం మానసిక క్రూరత్వం" అని చెప్పినట్టుగా ప్రచారం జరిగింది.
ఇదీ ఆ కేసు..
తమిళనాడు ఈరోడ్‌కు చెందిన శివకుమార్ తనకు విడాకులు ఇవ్వడాన్ని నిరాకరిస్తూ స్థానిక ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ మేరకు 2016 జూన్ 15 నాటి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఆయన ఓ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ కేసు విచారణలో భర్త నుంచి విడిపోయే సమయంలో ఆమె తన తాళి గొలుసును తొలగించినట్లు కోర్టు ముందు అంగీకరించింది. దీంతో మన దేశంలో జరిగే వివాహ వేడుకలలో తాళి కట్టడం అనేది ఒక ముఖ్యమైన ఆచారమని కోర్టు పేర్కొంది. ఆయన అప్పీల్‌ను అనుమతించింది. ఆ సమయంలోనే పై వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి.