Election Exit Polls: ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ హిట్ కొట్టవు- ఇలా ఫట్ కూడా అవుతాయ్!
Election Exit Polls: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పక్కాగా నిజమవుతాయా? అవి ఫట్ అయిన సందర్భాలు ఇవిగో.
![Election Exit Polls: ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ హిట్ కొట్టవు- ఇలా ఫట్ కూడా అవుతాయ్! Election exit polls Pinch of salt Some misses some hits in previous elections Election Exit Polls: ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ హిట్ కొట్టవు- ఇలా ఫట్ కూడా అవుతాయ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/af4bfb92103e86d0a7a486a6552262061669806402240538_original.webp?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Election Exit Polls: ఎన్నికలు ముగిసిన తర్వాత... ఫలితాలు వచ్చే వరకు నాయకులు తెగ టెన్షన్ పడుతుంటారు. ఫలితాలకు ముందు వారికి కొంత టెన్షన్ తగ్గించేవి ఎగ్జిట్ పోల్స్. ఎందుకంటే వీటిపై వాళ్లు చాలా నమ్మకం పెట్టుకుంటారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కొన్ని సార్లు ఓటరు నాడిని పట్టుకోవడంలో విఫలమయ్యాయి. కొన్ని సార్లు హిట్ అయితే.. మరికొన్ని సార్లు ఘోరంగా ఫట్ అయ్యాయి. ఆ సందర్భాలు ఓసారి చూద్దాం.
2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా సునామీ సృష్టించిన ఏడాది తర్వాత దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో భాజపా, ఆమ్ఆద్మీ, కాంగ్రెస్ కొదమ సింహాల్లా గర్జించాయి. మోదీ ఏడాది పాలనకు, దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ బలానికి, 15 ఏళ్ల పాటు దిల్లీని పాలించిన కాంగ్రెస్ పట్ల ప్రజాభిప్రాయానికి ఈ ఎన్నికలు అద్దం పడతాయని అందరూ అంచనా వేశారు.
70 అసెంబ్లీ స్థానాలు ఉన్న దిల్లీలో ఆప్ 40-45 సీట్ల వరకు గెలిచి ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఆప్ 70 సీట్లలో 67 గెలిచి చరిత్ర సృష్టించింది.
బిహార్ కథ
2015లో బిహార్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ప్రధాన పోటీ భాజపా, జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ మహాకూటమి మధ్యే. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని దీటుగా ఎదుర్కొనే నేత నితీశ్ కుమార్ అని కొందరు అభివర్ణించారు. ఎగ్జిట్ పోల్స్ భాజపాకు 243 అసెంబ్లీ స్థానాల్లో 100+ వస్తాయని, మహాకూటమి.. కాషాయ పార్టీ వెనుక ఉండొచ్చని అంచనా వేశాయి.
అయితే ఫలితాల నాడు మాత్రం కథ తారుమారైంది. ఎన్డీఏ 58 సీట్లకే పరిమితమైంది. జేడీయూ, ఆర్ఎల్డీ నేతృత్వంలోని మహాకూటమి 178 సీట్లతో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇక్కడా ఎగ్జిట్ పోల్స్ ఓటరు నాడి పట్టుకోలేకపోయాయి.
ఎగ్జిట్ పోల్స్‌లో గెలిచారు
2004 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలుపు తథ్యమని ఎగ్జిట్ పోల్స్ కోడై కూశాయి. కాషాయ పార్టీ ఆ ఎన్నికలకు 'ఇండియా షైనింగ్' అనే నినాదంతో బరిలోకి దిగింది. మరోసారి వాజ్‌పేయీ ప్రభుత్వం రావడం ఖాయమని అందరూ భావించారు. 543 లోక్‌సభ సీట్లలో 230- 275 స్థానాలు ఎన్డీఏకు వస్తాయని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్.
ఎన్నికల ఫలితాల వేళ మాత్రం ఎన్డీఏ 185 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 218 సీట్లు గెలుచుకుంది. అనంతరం ఎస్పీ, బీఎస్పీ, వామ పక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది యూపీఏ.
ఈ సందర్భాలన్నింటా ఎగ్జిట్ పోల్స్ విఫలమయినంత మాత్రాన మొత్తానికి నమ్మకూడదు అని చెప్పలేం. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ సఫలమయ్యాయి.
అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కేవలం కొద్ది శాతం మంది ప్రజల అభిప్రాయ సేకరణ మాత్రమేనన్న విషయాన్ని ఓటర్లు సహా నేతలు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల పరిస్థితులు, వాతావరణాన్ని అంచనా వేయగలవే గాని ఓటర్ల మనసులో ఏముందో ఏ ఎగ్జిట్ పోల్స్ చెప్పలేవు.
Also Read: Gujarat Himachal Exit Poll: ఆమ్‌ఆద్మీకి అంతేనా! 2017లో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)