Diwali Offer : వార్నీ ఇలాంటి దీపావళి ఆఫర్లు కూడా ఉంటాయా ? ఆ రాష్ట్రంలో వారం పాటు ట్రాఫిక్ రూల్స్ ఉండవట !
దీపావళి సందర్భంగా గుజరాత్‌లో వారం రోజుల పాటు ట్రాఫిక్ రూల్స్ ఎత్తేశారు. దీన్ని పండుగ ఆఫర్‌గా ఘనంగా ప్రకటించుకుంది అక్కడి బీజేపీ ప్రభుత్వం.
Diwali Offer : పండగ ఆఫర్లంటే సహజంగా ఏముంటాయి ? . సగం ధరకే ఇస్తాం.. లేకపోతే ఉచితంగా ఇస్తామని చెబుతూ ఉంటారు. అవన్నీ వ్యాపార సంస్థలు. ఊరకనే ఇచ్చినా ఎలా లాభం రాబట్టుకోవాలో వారికి బాగా తెలుసు. మరి ప్రభుత్వాలు పండగ ఆఫర్లు ఇవ్వాలంటే ఏం చేస్తాయి ?. ఇప్పటి వరకూ అభిమానులకు హీరోలు గొప్ప గిఫ్టులుగా పోస్టర్లు రిలీజ్ చేసినట్లుగా... పండగ ఆఫర్ల కింద ప్రభుత్వాలు శుభాకాంక్షలు చెప్పడమో.. ఓ కేజీ పంచదార రేషన్ కార్డులో ఎక్కువ ఇవ్వడమో చేస్తాయి. కానీ ఎవరూ ఊహించని పండగ ఆఫర్ ఇచ్చింది గుజరాత్ ప్రభుత్వం. అదేమిటంటే .. ట్రాఫిక్స్ రూల్స్‌కు వారం పాటు విరామం.
ాదీపావళి పండుగ సందర్బంగా గుజరాత్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది. అక్కడ ఓ వారం రోజులపాటు ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించినా ఫైన్ కట్టాల్సిన పనిలేదని స్వయానా ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘవి ప్రకటించారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 'హెల్మెట్ ధరించకపోయినా, లైసెన్స్ లేకపోయినా.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా.. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ఎలాంటి జరిమానా విధించరు.
ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే యాక్సిడెంట్లు అయి జనం చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబులిటీ అనే ప్రశ్నలు వేస్తారు కాబట్టి...మంత్రి కాస్త తెలివిగా ఆదేశాలిచ్చారు. వాహనదారుల్ని పరిశీలిస్తూ.. నిబంధనల్ని ఉల్లంఘించకూడదని వారికి ట్రాఫిక్ పోలీసులు సూచించాలని ఆదేశించారు. గుజరాత్ సిఎం భూపేంద్ర పటేల్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజానుకూల నిర్ణయమని సమర్థిస్తూ ఆయన అంటున్నారు. ప్రస్తుతం హర్ష సంఘవి మాట్లాడిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.[
ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો ઉજાસ ઉત્સવ એટલે દિવાળી. રંગોળીઓના રંગ, મિષ્ટાનોની ભરમાર અને દીવા તેમજ ફટાકડાનો ઉમંગ લઈને આ તહેવાર આવે છે. આ તહેવાર નિમિત્તે મૃદુ અને મક્કમ ગુજરાત સરકારના મુખ્ય મંત્રી શ્રી @Bhupendrapbjp જી નો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય pic.twitter.com/V1omwopeWV
— Harsh Sanghavi (@sanghaviharsh) October 21, 2022
ఇక గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన ఈ ఆఫర్‌పై నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇక ఈ ఆఫర్‌పై 'ఎన్నికల సమయంలో మీరు ఏమైనా చేయగలరు' అని గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగేష్ మేవానీ విమర్శించారు. 'ఒకసారి ట్రాఫిక్ సిగళ్ల దగ్గరకు వచ్చి నిలబడి ట్రాఫిక్‌ని చూడండి అంటూ ఓ నెటిజన్ మంత్రికి సూచించారు. మరొకరు.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అన్యాయం. ఈ నిర్ణయం వల్ల.. ప్రమాదాల రేటు పెరుగుతుంది అని మరో నెటిజన్ విమర్శిస్తూ ట్వీట్ చేశారు. వీళ్ల విమర్శల సంగతేమో కానీ.. అసలు దీపావళి పండగకు.. ట్రాఫిక్స్ రూల్స్ పాటించవద్దని ప్రజలకు ఆఫర్ ఇవ్వడానికి సంబంధమేంటో సామాన్యులకు అర్థం కాక తల పీక్కుంటున్నారు. ఎన్నికల ఎడాదిలో రాజకీయ నేతలు ఎలాంటి ఆఫర్లనైనా ఇస్తారని సరి పెట్టుకుంటున్నారు.