Prajwal Revanna Suspension : జేడీఎస్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ సస్పెన్షన్ - మహిళలపై వేధింపుల కేసులతో కీలక నిర్ణయం
Karnataka Politics : జేడీఎస్ నుంచి దేవగౌడ మనవడు ప్రజ్వల్ ను సస్పెండ్ చేశారు. ఆయనపై అనేక లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల్లో దెబ్బతింటామన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Prajwal Revanna Suspend From jds : లైంగిక వేధింపుల ఆరోపణల్లో పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయిన హసన్ జేడీఎస్ అభ్యర్థి, దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవర్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు జేడీఎస్ అధికారిక ప్రకటన చేసింది. రెండో దశ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ, జేడీఎస్ కూటమి విజయంపైఈ ప్రభావం ఉంటుందన్న ఉద్దేశంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు అవుతుందని తెలిసిన వెంటనే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి వెళ్లిపోయారు. తన పోల్ ఎజెంట్ తో తన వీడియోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేయిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రజ్వల్ రేవణ్ణపై తనను లైంగికంగా వేధించాడని బంధువైన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తర్వాత ఆయన తమను వేధించారంటూ ఫిర్యాదు చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయి. ఆయన రాసలీలలతో కూడిన వీడియోలతో ఉన్న పెన్ డ్రైవ్ లు అన్ని పార్టీల ముఖ్య నేతల వద్దకు చేరినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రాజకీయ నష్టం తప్పదని భావిస్తున్న జేడీఎస్ హైకమాండ్, బీజేపీ నేతలు ఆయనను సస్పెండ్ చేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. ప్రజ్వల్ పోటీ చేస్తున్న హహన్ నియోజకవర్గానికి ఇరవై ఆరో తేదీన పోలింగ్ ముగిసింది.
అయితే రెండో విడతలో ఇంకా పధ్నాలుగు సీట్లకు పోలింగ్ జరగాల్సి ఉంది. కర్ణాటకలో గత ఎన్నికల్లో బీజేపీ 26 సీట్లను గెలుచుకుంది. ఈ సారి అదే స్థాయిలో గెల్చుకోకపోతే బీజేపీ పెట్టుకున్న టార్గెట్ ను సాధించడం కష్టమే. అందుకే ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టకుండా ప్రయత్నిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెల్చు కునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న సమయంలో జేడీఎస్ కూటమి ద్వారా బీజేపీకి చిక్కులు వచ్చి పడటం ఇబ్బందికరంగా మారింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ ఒంటరిగా పోటీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల కోసం పొత్తులు పెట్టుకుంది. మూడు స్థానాలను మాత్రమే .. బీజేపీ..జేడీఎస్ కు కేటాయించింది. ఇందులో దేవేగౌడ కుటుంబసభ్యులే పోటీ చేస్తున్నారు. మిగిలిన చోట్ల బీజేపీకి ఇబ్బందులు రాకుండా ప్రజ్వల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ అంశంపై బీజేపీ నేతలు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అది జేడీఎస్ అంతర్గత వ్యవహారంగా భావిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఈ అంశం సంచలనం సృష్టిస్తోంది. ప్రజ్వల్ విదేశాలకు బీజేపీ సహకారంతోనే వెళ్లిపోయారని ఆరోపణలు చేస్తున్నారు. వీటికి బీజేపీ కౌంటర్ ఇవ్వడానికి సతమతమవుతోంది.