Delhi Air Pollution: దిల్లీనే అత్యంత కాలుష్య నగరం- స్వచ్ఛమైన గాలి కలిగిన సిటీ ఐజ్వాల్
Delhi Airpollution: వాయు కాలుష్యంలో భారత్‌లో దిల్లీనే అత్యంత కాలుష్య నగరంగా ఉంది.
వాయు కాలుష్యంలో భారత్‌లో దిల్లీనే అత్యంత కాలుష్య నగరంగా ఉంది. గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది సెప్టెంబరు మధ్య కాలంలో వాయు కాలుష్యాన్ని పరిశీలిస్తే దిల్లీలోనే అత్యంత ఎక్కువ కాలుష్యం నమోదైనట్లు పరిశోధనల ఆధారంగా వైల్లడైంది. రెండవ అత్యంత కాలుష్య నగరంగా పట్నా ఉంది. ఆ తర్వాత ముజఫరాబాద్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్, మీరట్, నల్బారి, అసన్‌సోల్, గ్వాలియర్ వరుస స్థానాల్లో ఉన్నాయి. రెస్పిరర్ లివింగ్ సైన్స్ నివేదిక ప్రకారం ఈ విషయం వెల్లడైంది. వీరు సెన్సార్ ఆధారిత నెట్‌వర్క్ సహాయంతో గాలి నాణ్యత, వాతావరణ పరిస్థితులు సహా పలు అంశాలను దృష్టిలోకి తీసుకుని పరిశోధన చేపట్టారు.
రాజధాని నగరం దిల్లీలో గాలిలో నాణ్యత స్పల్పంగా మెరుగుపడినప్పటికీ దేశంలో అత్యంత కాలుష్య నగరంగా దిల్లీనే ఉందని, గత ఏడాది కూడా ఈ స్థానంలో దిల్లీనే ఉన్నట్లు నివేదిక పేర్కొంది. పీఎం2.5 గాఢత లేదా 2.5 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉండే పార్టిక్యులేట్ పదార్థం గాఢత దిల్లీలో ఒక క్యూబిక్ మీటరుకు 100.1 మైక్రోగ్రాములు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన పీఎం2.5 గరిష్ఠ సురక్షిత పరిమితి వార్షికంగా క్యూబిక్ మీటరుకు 5 మైక్రోగ్రాములు మాత్రమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సురక్షిత స్థాయి కంటే పీఎం2.5 గాఢత దిల్లీలో పలు రెట్లు ఎక్కువగా ఉంది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనాల ప్రకారం పీఎం2.5 స్థాయి క్యూబిక్ మీటరుకు 30 మైక్రోగ్రాములుగా వెల్లడించారు. దీనిని మంచి స్థాయిగా తెలిపారు. అయితే గత ఏడాది దిల్లీలో ఈ స్థాయి కంటే కూడా మూడు రెట్లు ఎక్కువగా ఉంది. గత ఏడాది పట్నాలో పీఎం2.5 సాంద్రత క్యూబిక్ మీటరుకు 99.7 మైక్రోగ్రాములుగా ఉంది. గత ఏడాది కాలంలో గాలి నాణ్యతలో 24శాతం క్షీణత ఉంది. గంగా నదీ మైదాన ప్రాంతంలోని అనేక నగరాల్లో గాలి నాణ్యత తక్కువగా ఉన్నట్లు ఈ నివేదికలో స్పష్టమైంది. టాప్ పది నగరాల్లో పలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
ముంబయిలో గాలి నాణ్యత మరింత దిగజారింది. కాలుష్యం ఎక్కువగా ఉండే సమయమై అక్టోబరు నుంచి మార్చి వరకు గత ఏడాది ముంబయిలో కాలుష్యం పెరిగింది. దిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, లక్నో, పట్నా.. ఆరు ప్రధాన నగరాల్లో 2019 నుంచి 2023 మధ్య కాలంలో ముంబయిలో గాలి నాణ్యత క్రమంగా క్షీణించిందని నివేదిక తెలిపింది. కాగా దిల్లీ, లక్నోలు కాస్త మెరుగుపడినట్లు వెల్లడించింది. దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో 2023 అక్టోబరు 1 నుంచి సవరించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలులోకి తీసుకొచ్చారు. ఇది ప్రభుత్వం చేపట్టిన వాయు కాలుష్య నియంత్రణ కార్యక్రమం.
అత్యంత స్వచ్ఛమైన గాలి కలిగిన నగరంగా ఐజ్వాల్
భారతదేశంలో అత్యంత స్వచ్ఛమైన గాలి కలిగిన నగరంగా మిజోరాం రాష్ట్రంలోని ఐజ్వాల్ నిలిచింది. అక్కడ PM2.5 సాంద్రత క్యూబిక్ మీటరుకు 11 మైక్రోగ్రాములు మాత్రమే ఉంది. దీంతో అక్కడ గాలి అత్యంత స్వచ్ఛంగా ఉంది. ఐజ్వాల్ తర్వాత కర్ణాటకలోని చిక్‌మంగుళూరు, హర్యానాలోని మండిఖేరా, కర్ణాటకలోని చామరాజనగర్, మడికేరి, విజయపుర, రాయచూర్, శివమొగ్గ, గడగ్, మైసూర్ నగరాలు ఉన్నాయి. కర్ణాటకలోని ఎనిమిది నగరాల్లో స్వచ్ఛమైన గాలి ఉన్నట్లు వెల్లడైంది.