Pakistan Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందా? ఆసుపత్రిలో చేరినట్టు సోషల్ మీడియాలో ప్రచారం
Pakistan Dawood Ibrahim:పాకిస్థాన్‌లో దావూద్‌పై విషప్రయోగం జరిగిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రతలో చికిత్స అందిస్తున్నారట.
Dawood Ibrahim Hospitalised: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగానికి పాల్పడ్డారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనకు కరాచీలో విషప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నివేదికల ప్రకారం, అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరారు.
దావూద్‌పై విషప్రయోగం జరిగిందన్న వార్తలను అధికారికంగా ఎవరూ ఇంత వరకు ధృవీకరించలేదు. దావూద్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో కట్టుదిట్టమైన భద్రత ఉందని చెబుతున్నారు. ఆ ఆస్పత్రిలో దావూద్ ఒక్కడే పేషెంట్. ఆ ఆస్పత్రిలో పాకిస్థాన్ ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే చికిత్స అందిస్తుంటారు.
పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ బంద్
దావూద్‌పై పాకిస్థాన్‌లో విషప్రయోగం జరిగిందన్న వార్త తర్వాత దేశంలో కలకలం రేగింది. పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కారణంగా సేవలు నిలిచిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. దేశంలోని పలు పెద్ద నగరాలైన లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్‌లలో కూడా సర్వర్ డౌన్ అయింది. ఇవే కాకుండా ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ కూడా పనిచేయడం లేదని పేర్కొన్నారు. రాత్రి 8 గంటల నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్, సైబర్ భద్రత, డిజిటల్ గవర్నెన్స్‌ను పర్యవేక్షించే నెట్బ్లాక్ అనే సంస్థ పాకిస్తాన్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధాన్ని ధృవీకరించింది.
పాక్ జర్నలిస్ట్ ఏమన్నారంటే....
దావూద్ ఇబ్రహీంపై ఎవరో విషప్రయోగం చేశారని, ఆ తర్వాత అతని ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వస్తున్నాయని పాక్ జర్నలిస్ట్ అర్జూ కాజ్మీ అన్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, కరాచీలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని, ఈ వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఏదో జరుగుతోందనే విషయం మాత్రం తెలుస్తోంది.