Congress President Polls: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్- అశోక్ గహ్లోత్ ఏమన్నారంటే?
Congress President Polls: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Congress President Polls: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఇచ్చిన బాధ్యతను తాను నిర్వర్తిస్తానని, పార్టీ చెబితేనే అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేస్తానని ఆయన అన్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవడానికి గహ్లోత్ దిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా గహ్లోత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దిల్లీ చేరుకున్న గహ్లోత్ సోనియాతో భేటీ తర్వాత కొచ్చి వెళ్లి రాహుల్ గాంధీని కూడా కలవనున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని రాహుల్ గాంధీని ఒప్పించేందుకు చివరి ప్రయత్నం చేస్తానని గహ్లోత్ అన్నారు.
థరూర్ సై
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాలని పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన నిర్ణయాన్ని థరూర్ ఆమె ముందు ఉంచగా.. "మీ ఇష్టం. అధ్యక్ష పదవి కోసం ఎవరైనా పోటీ పడవచ్చు" అంటూ సోనియా కూడా పచ్చజెండా ఊపినట్టు సమాచారం.
అయితే అధ్యక్ష బరిలో ఎవరు నిల్చున్నా తాను మాత్రం వ్యక్తిగతంగా ఎవరికీ మద్దతు ప్రకటించకుండా తటస్థంగా ఉంటానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. పోటీకి తాను సన్నద్ధమవుతున్నట్టు కొద్ది రోజుల క్రితమే థరూర్ ప్రకటించారు. పార్టీలో అంతర్గత సంస్కరణలు చేపట్టాలని థరూర్ ఎప్పటి నుంచో కోరుతున్నారు.
దేశంలో 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. పదవి నుంచి సోనియా తప్పుకోనుండటం, బాధ్యతల స్వీకరణకు రాహుల్ మెుగ్గు చూపకపోవడం వంటి పరిణామాల వల్ల ఈ సారి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.
సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇస్తారు. అక్టోబర్ 1న నామినేషన్ పత్రాల పరిశీలన, అక్టోబర్ 8న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 17న ఓటింగ్ నిర్వహించిన రెండు రోజుల తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు.
Also Read: PayCM Posters: 'పేసీఎం' పోస్టర్లు- అవినీతిపై కాంగ్రెస్ వినూత్న నిరసన
Also Read: Ant Research: ఈ భూమి మీద మొత్తం ఎన్ని చీమలున్నాయో తెలుసా?