CM Jagan Comments on Pawan Kalyan: 'బర్రెలక్క చెల్లికి వచ్చిన ఓట్లు కూడా పవన్ కు రాలేదు' - ఉత్రరాంధ్రకు పవన్, చంద్రబాబు ద్రోహం చేశారని సీఎం జగన్ విమర్శలు
CM YS Jagan Meeting in Srikakulam: పలాసలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం జగన్ చంద్రబాబు, పవన్ పై విమర్శలు గుప్పించారు. వారిద్దరూ కలిసి ఉత్తరాంధ్రకు ద్రోహం చేశారని మండిపడ్డారు.
CM Jagan on Pawan kalyan: పేదల బతుకులు మార్చాలనే తపన మీ బిడ్డకు మాత్రమే ఉందంటూ సీఎం జగన్ (CM Jagan) అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో (Palasa) రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని గురువారం ఆయన ప్రారంభించారు. అలాగే, ఉద్దానంలో రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) పేదల ప్రాణాలంటే లెక్కే లేదని విమర్శించారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పానికి (Kuppam) నీరు కూడా అందించలేదని, అలాంటి వ్యక్తికి ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటుందా అని ప్రశ్నించారు. తాను మంచి చేశానని చెప్పుకోవడానికి చంద్రబాబు ఒక్క స్కీమ్ అయినా తెచ్చారా.? అంటూ నిలదీశారు.
బర్రెలక్క చెల్లి బెటర్
ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తుల మీదే చంద్రబాబు ఆధారపడతారు. తెలంగాణలో తన దత్తపుత్రుడిని బరిలో నిలిపారు. నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్, బాబు ఇంకో పార్టనర్. తెలంగాణ ప్రచారంలో ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని డైలాగులు కొడతారు. అక్కడ ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. కానీ, ఇండిపెంటెంట్ గా నిలబడిన బర్రెలక్క చెల్లెమ్మకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు, పవన్ చేయని ద్రోహం లేదు.' అని జగన్ మండిపడ్డారు.
చంద్రబాబు, పవన్ ఏడుపే ఏడుపు
విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే ప్రతిపక్షాల నేతలు అడ్డుకుంటున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సీఎం విశాఖకు వచ్చి ఉంటానంటే చంద్రబాబు, ఆయన అనుంగు శిష్యులు ఏడుస్తున్నారు. నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తారు. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో దీని వల్ల ప్రజలకు మంచి జరిగింది అని చెప్పుకోవడానికి ఏం లేదు. నేను ఇచ్చిన మాట కోసం ఎంతవరరైనా నిలబడతా.' అంటూ వ్యాఖ్యానించారు. దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ప్రయోజన వర్గం ఉంది తప్ప, ఆంధ్ర రాష్ట్రంపై ప్రేమే లేదని ప్రజలు ఇది గమనించాలని సూచించారు. ఉద్దానంలో ఇంత దారుణ పరిస్థితులున్నా, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రి నిర్మించాలనే ఆలోచన చేయలేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం లేదని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, పోర్టు వస్తుందన్నా, మెడికల్ కాలేజీలు, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నా చంద్రబాబు, పవన్ ఏడుస్తున్నారని దుయ్యబట్టారు. అందరితో కలిసి ఓ దొంగల ముఠాగా తయారై మన మీద పడి ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. 'అధికారం పోయినందుకు వీరి ఏడుపు, వారు ఏనాడూ ఇవ్వని విధంగా ఇంటింటికీ పెన్షన్ ఇస్తుంటే కూడా ఏడుపే, పింఛన్ పెంచినా ఏడుపే. సచివాలయ వ్యవస్థ తెచ్చి అందరికీ సేవలందిస్తున్నా ఏడుపే.' అంటూ జగన్ పేర్కొన్నారు.
Also Read: Srikakulam News: కిడ్నీ బాధితులకు మాటిచ్చాను, పూర్తి చేశాను - ఉద్దానం పర్యటనలో సీఎం జగన్