Johnny Master in Janasena: జనసేన టికెట్ రేసులో జానీ మాస్టర్! నెల్లూరు నుంచి పోటీ చేస్తారా?
Johnny Master News: ఇప్పటికే ఔత్సాహికులు నెల్లూరు జిల్లాలో జనసేన నుంచి టికెట్ రేసులో ఉండగా.. కొత్తగా జానీ మాస్టర్ వంటి సెలబ్రిటీ రంగంలోకి దిగడం విశేషం.
Choreographer Johnny Master News: నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ.. జనసేన టికెట్ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈరోజు కాపు సంక్షేమ సేన అధ్యక్షులు, మాజీ మంత్రి హరి రామ జోగయ్య ఆశీర్వాదం తీసుకున్నారాయన. నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నేతలతో కలసి హరిరామజోగయ్యను పాలకొల్లులో ఆయన నివాసంలో కలిశారు జానీ మాస్టర్. ప్రస్తుతానికి ఆయన జనసేన టికెట్ పై ఎలాంటి కామెంట్ చేయకపోయినా.. సినీ ఫీల్డ్ లో ఉన్న ఆయన ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపడం విశేషం. అందులోనూ జనసేనకు సంబంధించి ప్రముఖ నేతలందరినీ ఆయన కలుస్తున్నారు. తాజాగా హరిరామజోగయ్యను కలసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పవన్ అభిమాని..
జానీ మాస్టర్, పవన్ కల్యాణ్ అభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. ఢీ షో ద్వారా పాపులర్ అయిన ఆయన.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఆయన హీరోగా నటిస్తున్న సినిమా కూడా అనౌన్స్ అయింది. సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా ఆయన సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. నెల్లూరు నగరానికి వస్తే కచ్చితంగా స్థానిక జనసేన నేతలతో సమావేశమవుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొంటారు.
అంగన్వాడీ ధర్నాలోనూ..
ఇటీవల నెల్లూరు నగరంలో జరిగిన అంగన్వాడీల ధర్నాలోనూ జానీ మాస్టర్ పాల్గొన్నారు. అంగన్వాడీల పోరాటానికి ఆయన మద్దతు తెలిపారు. ఆందోళనల్లో పాల్గొని మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్త వనమ్మ కుటుంబానికి జానీ మాస్టర్ రూ. 70వేల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం చేస్తున్న ఆందోళనలో పాల్గొని మానసిక ఒత్తిడితో అంగన్వాడీ కార్యకర్త చనిపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో తిరిగి పునరావృతం కాకూడదని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
నెల్లూరు నుంచి పోటీ చేస్తారా..?
ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ అభిమానిగానే జానీ మాస్టర్ అందరికీ తెలుసు. జనసైనికులతో ఆయనకు పరిచయం ఉన్నా కూడా ఎప్పుడూ రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. కానీ తొలిసారిగా ఆయన అంగన్వాడీల ఆందోళనలో పాల్గొని పరోక్షంగా ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. పవన్ అభిమానిగా తాను అంగన్వాడీల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నానని చెప్పారు. అక్కడితో ఆగకుండా హరిరామజోగయ్యను కలవడం, జనసేన కీలక నేతలతో సమావేశం కావడం కూడా ఆయన భవిష్యత్ వ్యూహాన్ని చెప్పకనే చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో నెల్లూరు జిల్లానుంచి కూడా ఆయన సీటు ఆశించే అవకాశముందని అంటున్నారు సన్నిహితులు. నెల్లూరులో ప్రస్తుతం జనసేనలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఓ గ్రూపు నాయకుడు వైసీపీలో చేరారు. అయినా కూడా రెండు వర్గాలున్నాయి. ఈ దశలో పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లాలో ఏ సీటుని టీడీపీ నుంచి తీసుకుంటారు, అది ఎవరికిస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఇటీవలే నాగబాబు కూడా నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చారు. అన్ని నియోజకవర్గాల జనసేన నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టికెట్ల వ్యవహారం, సీట్ల వ్యవహారంపై ఆయన ఎక్కడా ప్రకటన చేయలేదు. నెల్లూరు జిల్లాలో కచ్చితంగా జనసేన పోటీ చేస్తుందని మాత్రం స్పష్టం చేశారు నాగబాబు.
ఇప్పటికే ఔత్సాహికులు నెల్లూరు జిల్లాలో టికెట్ రేసులో ఉండగా.. కొత్తగా జానీ మాస్టర్ వంటి సెలబ్రిటీ రంగంలోకి దిగడం విశేషం. టీడీపీ నేతలతో కూడా ఆయన టచ్ లోకి వెళ్తున్నారు. వైసీపీ, టీడీపీలో కూడా సినీ ఇండస్ట్రీకి చెందినవారు దూసుకెళ్తున్నారు. సినీ నటుడు పవన్ కల్యాణ్ పెట్టిన పార్టీలో కూడా సినిమా ఇండస్ట్రీ వ్యక్తులకు ప్రయారిటీ ఉంటుందనడంలో సందేహం లేదు. మరి జానీ మాస్టర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా, లేక ప్రచారానికే పరిమితమవుతారా..? వేచి చూడాలి.