Union Cabinet decisions: రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ - మెరైన్ ఇండస్ట్రీకి రూ.70వేల కోట్ల ప్యాకేజీ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
Modi: రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీలో బీహార్‌లో పలు ప్రాజెక్టులకు ఆమెదం తెలిపారు.

Railway Employees Bonus: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్ 24, 2025 నిర్వహించిన సమావేశంలో రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించింది. 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌గా రూ. 1,865.68 కోట్లు విడుదల చేయడానికి ఆమోదం తెలిపారు. ఈ బోనస్ దీపావళి, చట్ పూజా పండుగల ముందే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అంతేకాకుండా, బిహార్‌లో రైల్వే డబుల్ లైన్, హైవే ప్రాజెక్టులు, షిప్‌బిల్డింగ్‌కు ప్యాకేజీలకు కూడా మంత్రివర్గం లైట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాలు ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
గత సంవత్సరాల్లోనూ ఇలాంటి బోనస్‌లు ప్రకటించినప్పటికీ, ఈసారి మొత్తం మొత్తం పెరిగినట్లు కనిపిస్తోంది. ఈ నిర్ణయం దాదాపు 11 లక్షల కుటుంబాలకు ఆర్థిక ఊరటను అందిస్తుందని అంచనా వేస్తున్నారు. బిహార్‌లో రైల్వే వ్యవస్థను బలోపేతం చేయడానికి మంత్రివర్గం మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. భక్తియార్‌పూర్ నుంచి రాజగిరి-తిలైయా వరకు రైల్వే లైన్‌ను డబుల్ లైన్‌గా మార్చడానికి రూ.2,192 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం సింగిల్ లైన్‌గా ఉన్న ఈ మార్గం సామర్థ్యం పరిమితంగా ఉంది. డబుల్ లైన్ పూర్తయిన తర్వాత రైలుల ప్రయాణ వేగం, సామర్థ్యం పెరుగుతాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు ఈ ప్రాజెక్ట్ బిహార్‌లోని గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ అందిస్తుంది, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు 2-3 సంవత్సరాలు పట్టవచ్చు.
బిహార్‌కు మరో బహుమతిగా, NH-139W హైవేలో సాహెబ్‌గంజ్-అరేజాజ్-బేతియా భాగాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో నిర్మించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం పొడవు 78.942 కిలోమీటర్లు, ఖర్చు రూ.3,822.31 కోట్లు. ఈ ప్రాజెక్ట్ ద్వారా బిహార్‌లోని మూడు జిల్లాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుంది, వాహన రవాణా సులభతరం అవుతుంది. హైబ్రిడ్ మోడ్‌లో ప్రైవేట్-పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ ద్వారా నిర్మాణం జరుగుతుంది, దీనివల్ల ఖర్చు తగ్గుతూ వేగం పెరుగుతాయి. ఈ రోడ్డు పూర్తయిన తర్వాత స్థానిక ఆర్థిక వ్యవస్థకు, వ్యాపారాలకు ఊరట కలుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Union Cabinet, chaired by Prime Minister Shri @narendramodi Ji, has approved a ₹69,725-crore package to revitalise India’s shipbuilding and maritime sector.
— Nitin Gadkari (@nitin_gadkari) September 24, 2025
The Shipbuilding Financial Assistance Scheme has been extended until 31 March 2036 with a total corpus of ₹24,736 crore,… pic.twitter.com/B6MdbGYHgt
అలాగే దేశవ్యాప్తంగా షిప్‌బిల్డింగ్, మెరైన్ ఫైనాన్సింగ్, దేశీయ సామర్థ్యాన్ని పెంచడానికి రూ. 69,725 కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీ ద్వారా భారతదేశం షిప్ బిల్డింగ్ రంగంలో ప్రపంచ స్థాయి సామర్థ్యాన్ని సాధించడానికి సహాయపడుతుంది. మెరైన్ ఫైనాన్సింగ్‌కు ప్రోత్సాహం, దేశీయ షిప్‌యార్డుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టి ఈ ప్యాకేజీలో చేర్చారు. భారత మెరైటైమ్ ఎకానమీని బలోపేతం చేస్తూ, ఎగుమతులను పెంచుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ప్యాకేజీ ప్రయోజనాలు ముఖ్యంగా కోల్‌కతా, ముంబై, చెన్నై వంటి తీర పట్టణాల్లో ఉపాధి పెరగడానికి ఉపయోగపడతాయి.





















