CBI Chanda Kochhar : చందా కొచ్చర్ దంపతులకు ఊరట - అరెస్ట్ చట్ట ప్రకారం జరగలేదని తేల్చిన హైకోర్టు !
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో దంపతులకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. వారి అరెస్ట్ చట్ట ప్రకారం జరగలేదన్న బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
CBI Chanda Kochhar : ఐసీసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కచ్చర్ దంపతుల అరెస్టు విషయంలో సీబీఐకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ల అరెస్ట్ చట్టప్రకారం జరగలేదని బాంబే హైకోర్టు పేర్కొంది. తక్షణంమ వారిని విడుదల చేయాలని ఆదేశించింది. చందా కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్ సిఈవోగా ఉన్న సమయంలో వీడియోకాన్ గ్రూప్‌కు ఇచ్చిన రూ.3,000 కోట్లకు పైగా రుణంలో అవతవకలు జరిగాయని ఆరోపిస్తూ గతేడాది డిసెంబర్ 23న సిబిఐ వారిని అరెస్ట్ చేసింది.
అవినీతి నిరోధక చట్టం ప్రకారం తమ అరెస్ట్ చట్ట విరుద్ధమని హైకోర్టుకెళ్లిన కొచ్చర్ దంపతులు
అవినీతి నిరోధక చట్టం ప్రకారం తమ అరెస్ట్ చట్ట విరుద్ధమని, విచారణ ప్రారంభించేందుకు చట్టంలోని సెక్షన్ 17 ఎ కింద అనుమతి తప్పనిసరి అని, ఈ దర్యాప్తును ప్రారంభించడానికి సిబిఐకి అటువంటి అనుమతిలేదని కొచ్చర్ కోర్టు ఎదుట వాదించారు.తమ అరెస్ట్ చట్టవిరుద్ధమని, అవినీతి నిరోధక చట్టం ప్రకారం అవసరమైన అనుమతులను పొందకుండా తమను అరెస్ట్ చేశారని ఆరోపించారు. చందా కొచ్చర్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, అర్థం లేని దర్యాప్తు చేసి ఆమెను అరెస్ట్ చేశారన్నారు. మహిళలను అరెస్ట్ చేసేటపుడు మహిళా అధికారి ఉండాలని చట్టం చెప్తోందని, చందా కొచ్చర్‌ను అరెస్ట్ చేసేటపుడు ఈ నిబంధనలను తుంగలో తొక్కారని తెలిపారు.
చట్ట ప్రకారం అరెస్ట్ జరగలేదని బెయిల్ ఇచ్చిన బాంబే హైకోర్టు
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. కొచ్చర్ దంపతుల అరెస్టు చట్ట ప్రకారం జరగలేదని.. ఈ క్రమంలోనే వారికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. పూచీకత్తు కింద చెరో రూ.లక్ష జమ చేయాలని కొచ్చర్ దంపతులను ఆదేశించింది. అలాగే ఈ కేసులో విచారణకు సహకరించాలని, సిబిఐ సమన్లు జారీ చేసినప్పుడు హాజరుకావాలని వారికి సూచించింది. అంతేగాక, వారి పాస్‌పోర్టులను కూడా సీబీఐకి సమర్పించాలని ఆదేశించింది. చందా కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ దూత్, నూ పవర్ రిన్యూవబుల్స్‌కి నేతృత్వం వహిస్తున్న దీపక్ కొచ్చర్‌లతో పాటు సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండిస్టీస్ లిమిటెడ్‌లపై కుట్ర, అవినీతినిరోధక చట్టం 2019ల కింద సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
వీడియోకాన్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేసినట్లుగా ఆరోపణలు
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఆర్‌బిఐ మార్గదర్శకాలు, బ్యాంక్ క్రెడిట్ పాలసీని ఉల్లంఘిస్తూ వీడియోకాన్ గ్రూప్‌కు చెందిన కంపెనీలకు ఐసిఐసిఐ బ్యాంక్ రూ. 3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేసినట్లు సిబిఐ పేర్కొంది. క్విడ్ ప్రొకోలో భాగంగా వేణుగోపాల్ ధూత్ సుప్రీం ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఇపిఎల్) ద్వారా నూపవర్ రెన్యూవబుల్స్‌లో రూ. 64 కోట్లు పెట్టుబడి పెట్టారని, 2010-2012 మధ్య తిరిగి దీపక్ కొచ్చర్ నిర్వహించే పినాకిల్ ఎనర్జీ ట్రస్ట్‌కు ఎస్‌ఇపిఎల్‌ను బదిలీ చేశారని సిబిఐ పేర్కొంది.