Loan Politics : శ్రీలంక నుంచి రాష్ట్రాలు గుణపాఠాలు నేర్చుకోవాలని సలహలు - కేంద్రానికి బాధ్యత లేదా !?
రాష్ట్రాల అప్పులను కేంద్రం నియంత్రించలేదా ?ఆ అధికారం ఉన్నా ఎందుకు సలహాలకే పరిమితం అవుతోంది ?
Loan Politics : కొన్ని రాష్ట్రాలు అప్పులు.. ఆర్థిక పరిస్థితి... శ్రీలంక సంక్షోభాలకు కారణాలు ఇలా అన్నీ విశ్లేషిస్తూ ఎంపీలకు కేంద్ర విదేశాంగ మంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు . శ్రీలంక సంక్షోబం నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని అప్పులు విపరీతంగా చేస్తున్న రాష్ట్రాలకు హితవు పలికారు. బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి చెప్పలేదని... కేంద్రం చేస్తున్న అప్పుల సంగతేమిటని.. విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. వీటన్నింటినీ పక్కన పెడితే అసలు కేంద్రంలో ఇంత ఆందోళన ఉన్నా ఎందుకు చూసీ చూడనట్లుగా ఉంటుందన్న సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. రాష్ట్రాల అప్పులు పూర్తిగా కేంద్ర అనుమతుల మీదనే ఉంటాయి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధిలోనే అప్పులు ఉండాలి. అయితే కొన్ని రాష్ట్రాలు కేంద్రం చెబుతున్నట్లుగా పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయి.అయినా కేంద్రం చూసీ చూడనట్లుగానే ఉంటోంది.
కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రాలు అప్పులు చేస్తాయా ?
రాష్ట్రాలు అపరిమితంగా సొంతానికి అప్పులు చేయలేవు. కేంద్రం ఆమోదం లేకుండా రాష్ట్రాలు అప్పులు చేయడం అసాధ్యం. కేంద్రం ప్రతీ ఏడాది ప్రతి రాష్ట్రానికి రుణ పరిమితి నిర్దేశిస్తుంది. ఆర్బీఐ బాండ్లు సహా ఏ రూపంలో అప్పు తీసుకున్నా.. ఆ పరిధి మేరకే అప్పులు చేయాలి. మరి అలాంటప్పుడు పరిస్థితి చేయి తాటుతోందని అనుకుంటే .. ఎందుకు జోక్యం చేసుకవడం లేదనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న వస్తోంది. ప్రజెంటేషన్లు ఇచ్చి.. తప్పొప్పులు చెప్పినంత మాత్రాన తమ నిర్ణయాలను మార్చుకుని ఆర్థిక పరిమైన క్రమశిక్షణను పాటిస్తారని ఎవరూ అనుకోవడం లేదు. ఆయా రాష్ట్రాలను కేంద్రం నియంత్రించాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు నిబంధనలు కఠినంగా అమలు చేస్తే చాలు...రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఉచితాలతో దేశ ప్రయోజనాలకు ముప్పని ప్రధాని ఆందోళన !
ప్రధాని మోదీ సైతం ఓట్ల కోసం ప్రజలకు ఉచిత పథకాలు పంపిణీ చేయడం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. అప్పులు కుప్పలు కుప్పలుగా చేసి భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్న రాష్ట్రాలు కళ్లముందు కనిపిస్తున్నా ప్రధాని మోదీ దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ప్రధాని మోదీ అభిప్రాయం వందకు వంద శాతం నిజమే. ఈ ప్రపంచంలో ఉచితంగా వచ్చే దానికి విలువ ఉండదు. ఏదైనా కష్టపడి వచ్చిన దానికే విలువ ఉంటుంది. ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే డబ్బులకూ విలువ ఉండదు..రాదు. అాలంటి దేశాలు ఏమైపోయాయో శ్రీలంక చెబుతుంది. మరి ఎందుకు మోదీ నియంత్రించలేకపోతున్నారు.
ఓటు బ్యాంక్ పథకాలకే రాష్ట్రాల పెద్ద పీట !
మౌలిక సదుపాయాల కోసం ప్రజాధనం ఒక్క రూపాయి వెచ్చించకుండా అప్పులు చేస్తూ సంక్షేమం పేరుతో ప్రజలకు పంచే రాజకీయ వ్యూహాలే ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. పెట్టుబడి వ్యయం చేయడాన్ని అనవసరంగా చూస్తున్నాయి ప్రభుత్వాలు. వేల కోట్లు అప్పులు తెచ్చి అనుత్పాదక వ్యయం చేస్తున్నారు. సంపద సృష్టి జరగడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయం పెరగకపోగా అప్పులు.. వడ్డీలు పెరిగిపోతే పిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడానికి ఆర్థిక శాఖలో డాక్టరేట్లు అవసరం లేదు.
అప్పుల భారంతో పన్నులు పెంచేస్తున్న పలు రాష్ట్రాలు!
రాష్ట్రాలు అప్పుల భారంలో మునిగి దివాలా దశకు చేరుకుంటే... ఆ తప్పులో సింహ భాగం వాటా కేంద్రానికే దక్కుతుంది. ఇప్పుడు శ్రీలంకలో అలా జరిగిందని.. జాగ్రత్తలు తీసుకోవాలని సుద్దులు చెప్పినంత మాత్రాన పరిస్థితి మెరుగుపడదు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పరిస్థితి దిగజారిపోయింది. పన్నుల రూపంలో ప్రజలను బాదేస్తున్నాయి. మద్యాన్ని ఆదాయవనరుగా మార్చుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలి.. కేంద్రమే బాద్యత తీసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత తాము ముందే హెచ్చరించామంటే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నష్టపోయేది దేశం...రాజకీయ నేతలు కాదు !