8th Pay Commission : 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ - కీలక నిర్ణయలు తీసుకున్న కేంద్ర కేబినేట్
Union Cabinet : 2016 జనవరిలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన 7వ వేతన సంఘం సిఫార్సులు డిసెంబర్ 31, 2025న ముగుస్తాయి.

Union Cabinet : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, కరువు భత్యం, పెన్షన్ లాంటి వాటికి సంబంధించిన అన్ని సిఫార్సులను వేతన సంఘమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతం 7వ వేతన సంఘం అమల్లో ఉంది. ప్రతి పదేళ్లకు ఓసారి కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ 31నాటికి ప్రస్తుత వేతన సంఘం కాలం ముగుస్తుంది. ఈ తరుణంలో ప్రభుత్వం కొత్త ప్రకటన చేసింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఎప్పటిలాగే ఈ సారీ వేతన సంఘం సిపార్సుల మేరకు ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. ఇవి జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి.
#WATCH | Delhi: Union Minister Ashwini Vaishnaw says, "Prime Minister has approved the 8th Central Pay Commission for all employees of Central Government..." pic.twitter.com/lrVUD25hFu
— ANI (@ANI) January 16, 2025
ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందంటే..
జనవరి 2016లో అమలు చేసిన 7వ వేతన సంఘం సిఫార్సులు 2025 చివరి నాటికి ముగుస్తున్నందున 8వ వేతన సంఘం 2026 నాటికి ఏర్పడుతుందని పలువురు భావిస్తున్నారు. "1947 నుంచి వేతన కమీషన్ అమలవుతోంది. చివరి సారి 2016లో అమలు చేశారు. ప్రస్తుతమున్న 7వ వేతన సంఘం పదవీకాలం 2026లో ముగుస్తుంది. కాబట్టి, 2025లో ఈ ప్రక్రియను ప్రారంభిస్తే.. అది పూర్తికాకముందే సిఫార్సులను స్వీకరించడానికి, సమీక్షించడానికి తగిన సమయం లభిస్తుంది" అని వైష్ణవ్ ఈ సందర్భంగా చెప్పారు.
ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే వేతన నిర్మాణాలను సమీక్షించడంపై కొత్త కమిషన్ దృష్టి సారించనుంది. 2014లో ఏర్పాటై 2016లో అమలు చేసిన 7వ పే కమిషన్ పే బ్యాండ్‌లను సరళీకృత పే మ్యాట్రిక్స్‌తో భర్తీ చేయడం, కనీస నెలవారీ వేతనాన్ని రూ. 18,000కి పెంచడం, గరిష్టంగా నెలవారీ వేతనాన్ని రూ. 2.5 లక్షలకు పరిమితం చేయడం వంటి ముఖ్యమైన మార్పులను ప్రవేశపెట్టింది.
8వ వేతన సంఘం - అంచనాలు
8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుండి 2.86కి ప్రతిపాదించవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. తద్వారా కనీస ప్రాథమిక వేతనాన్ని రూ.51,480కి పెంచవచ్చు. ఇది ఉద్యోగుల బేసిక్ శాలరీలపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా ఈ 8వ వేతన సంఘం దీర్ఘకాలిక ఆందోళనలను పరిష్కరిస్తుందని, దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతూ వారి జీవన నాణ్యతను మెరుగుపరిచే సంస్కరణలను తీసుకువస్తుందని చాలా మంది ఆశిస్తున్నారు. వచ్చే వారం జరగనున్న కేంద్ర బడ్జెట్ ప్రజెంటేషన్‌లో ముఖ్యమైన పరిణామాలు వెల్లడి కావచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసినవారి సవరించిన బేసిక్ శాలరీ, పెన్షన్‌ను నిర్ణయించడంలో ఫిట్‌మెంట్ అంశం కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే.
ఇక మరోపక్క శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ - షార్ లో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి సైతం కేంద్రం ఆమోదం ప్రకటించింది. రూ.3.985 కోట్లతో నిర్మితమవుతోన్న దీన్ని.. ఎస్జీఎల్వీ ప్రయోగాలకు అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

