దేశవ్యాప్తంగా మరో వారం రోజుల్లో CAA అమలవుతుంది - కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
Shantanu Thakur: వారం రోజుల్లో దేశమంతా CAA అమలవుతుందని కేంద్రమంత్రి శంతను ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
CAA Across India: దేశవ్యాప్తంగా మరో వారం రోజుల్లో CAA (Citizenship Amendment Act) అమలు చేస్తామంటూ కేంద్రమంత్రి శంతను ఠాకూర్ (Shantanu Thakur) చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. కేవలం పశ్చిమబెంగాల్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇది కచ్చితంగా అమలై తీరుతుందని తేల్చి చెప్పారు. బెంగాల్‌లో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు శంతను ఠాకూర్. బెంగాల్‌లోని బనగాం ఎంపీగా ఉన్న ఆయన కేంద్రహోం మంత్రి అమిత్ షా గురించీ ప్రస్తావించారు. CAA అమలుకు అంతా సిద్ధం చేశారని స్పష్టం చేశారు.
"మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా CAA అమలు జరిగి తీరుతుంది. ఇది పక్కాగా రాసిపెట్టుకోండి. కేవలం పశ్చిమ బెంగాల్‌లోనే కాదు. దేశమంతా అది అమలవుతుంది. హోం మంత్రి అమిత్‌షా అందుకు రంగం అంతా సిద్ధం చేశారు"
- శంతను ఠాకూర్, కేంద్రమంత్రి
అంతా సిద్ధం..?
నిజానికి బీజేపీ ఎజెండాలో CAA ఎప్పటి నుంచో ఉంది. గతంలో ఓ సారి అమలు చేసేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగడం వల్ల కేంద్రం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అటు పశ్చిమ బెంగాల్‌లోనూ ఘర్షణలు జరిగాయి. అందుకే అప్పటికి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే..ఏడాది కాలంగా మరోసారి CAAపై చర్చ జరుగుతోంది. అమిత్‌షా ఎలాగైనా అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఓ సారి పశ్చిమ బెంగాల్‌లో ఓ సభలో మాట్లాడుతూ ఆయన అదే స్పష్టం చేశారు. కచ్చితంగా ఇది అమలు చేస్తామని అన్నారు. గతేడాది డిసెంబర్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. CAA అమలు కాకుండా అడ్డుకోవడం ఎవరి వల్లా కాదంటూ ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదటి నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తమ రాష్ట్రంలో అమలు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఆమెను ఉద్దేశిస్తూనే అమిత్ షా "ఎవరూ అడ్డుకోలేరు" అని పరోక్షంగా మండి పడ్డారు. బెంగాల్ ప్రభుత్వమే కావాలని ఈ చట్టం అమలు కాకుండా కుట్ర చేస్తోందంటూ అమిత్ షా చాలా సందర్భాల్లో విమర్శించారు. అనవసరంగా సమస్యలు సృష్టిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.
"సీఏఏను కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టామని అనుకుంటే అది ముమ్మాటికీ తప్పే. ఈ విషయంలో ప్రజల్ని కన్‌ఫ్యూజ్ చేయాలనుకోవడం లేదు" అని తేల్చి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. "సీఏఏ అనేది ఈ దేశంలో అమలు చేసి తీరాల్సిన చట్టం. అది ఎప్పటికైనా కార్యరూపం దాల్చుతుంది. ఇది ఎప్పటికీ అమలు కాదని కొందరు కలలు కంటున్నారు" అని స్పష్టం చేశారు.ఈ చట్టం అమలుకు ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించగా.."ఇందుకు సంబంధించి కొన్ని రూల్స్‌ని తయారు చేయాల్సి ఉంది. కరోనా కారణంగా అమలు చేయడం కుదరలేదు. ఇప్పుడు కరోనా నుంచి మనమంతా బయటపడ్డాం. ఇప్పుడు మళ్లీ పని మొదలు పెడతాం" అని తెలిపారు. ఇప్పుడే కాదు. అమిత్‌షా గతంలోనూ చాలా సందర్భాల్లో CAA గురించి ప్రస్తావించారు.
Also Read: Pariksha Pe Charcha: నేడు 'పరీక్షా పే చర్చా' కార్యక్రమం, విద్యార్థులతో మాట్లాడనున్న ప్రధాని మోడీ