Bridge In River: నదులపై బ్రిడ్జ్‌లు ఎలా కడతారు? కట్టే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
Bridge In River: నదులపై వంతెనలు ఎలా నిర్మిస్తారో తెలుసా?
How are bridges built on River:
వంతెనలు కట్టేది ఇలా..
గుజరాత్‌లోని మోబ్రి వంతెన కూలిన తరవాత అసలు నీటిపై ఉన్న వంతెనలు ఎంత వరకూ సురక్షితం. వాటిని నిర్మించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్న అంశాలు చర్చకు వస్తున్నాయి. అసలు నది మధ్యలో అంత ఎత్తైన పిల్లర్లు ఎలా కడతారు..? ఇంజనీర్లు ఇందుకోసం ఎలాంటి మెథడ్స్ వినియోగిస్తారో తెలుసుకుందాం.
పునాది ఇలా వేస్తారు..
ఓ ఇల్లు కట్టినప్పుడు పునాది ఎలా వేస్తారో..అదే విధంగా బ్రిడ్జ్ నిర్మించేటప్పుడూ పునాది నిర్మిస్తారు. ప్రాజెక్ట్‌ని బట్టి పునాది ఎలా నిర్మించాలో నిర్ణయిస్తారు. ఈ పునాదినే "కాఫర్‌డ్యామ్"గా పిలుస్తారు. ఇవి చూడటానికి డ్రమ్ ఆకారంలో ఉంటాయి. నది మధ్యలో క్రేన్‌ల ఆధారంగా వీటిని ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ కాఫర్ డ్యామ్‌లు తయారు చేసేందుకు అతిపెద్ద స్టీల్ ప్లేట్స్ వినియోగిస్తారు. కాఫర్ డ్యామ్‌లో ఎలాంటి లోపం తలెత్తినా వంతెన కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే...దీన్ని చాలా దృఢంగా నిర్మిస్తారు. కాఫర్ డ్యామ్‌లు వృత్తాకారంలో లేదా చతురస్రాకారంలో ఉంటాయి. దాదాపు ఇవి డ్రమ్ ఆకారంలోనే ఉంటాయి. నది మధ్యలో వీటిని అమర్చుతారు. వీటి చుట్టూ నీళ్లు ప్రవహించినప్పటికీ..ఇందులోకి నీళ్లు రావు. అలానే జాగ్రత్తలు తీసుకుని నిర్మిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే...ఓ గ్లాస్‌లో స్ట్రా వేసినట్టుగా నీళ్లలో కాఫర్ డ్యామ్‌లు అమర్చుతారు. ఇందులోకి నీళ్లు చేరితే..తొలగిస్తారు. ఆ తరవాతే పిల్లర్‌లు వేయటం మొదలు పెడతారు. వీటిని దృఢంగా నిర్మించేందుకు ఇంజనీర్లు లోపలే ఉంటూ పనులు పర్యవేక్షిస్తారు. పిల్లర్ వర్క్ పూర్తైన తరవాతే..దానిపై బ్రిడ్జ్‌ను నిర్మాణం మొదలు పెడతారు. అయితే...నీటి లోతు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కాఫర్‌డ్యామ్‌లతో వంతెన నిర్మించటం అసాధ్యం. ఇలాంటి సమయాల్లో వేరే విధానం అనుసరిస్తారు.
మరో మెథడ్ కూడా ఉంది..
ముందుగా నదిలోప కొన్ని పాయింట్లు గుర్తిస్తారు. అక్కడి మట్టిని పరీక్షిస్తారు. అక్కడ పిల్లర్‌లు నిర్మిస్తే తట్టుకుని నిలబడతుందా లేదా అని పరిశీలిస్తారు. అక్కడే పిట్స్ తయారు చేస్తారు. ఆ పిట్స్ ద్వారా పైపులు పంపించి అక్కడి నీటిని పూర్తిగా తొలగిస్తారు. ఈ పైపుల్లో సిమెంట్, కాంక్రీట్ నింపుతారు. ఇలా...ఎన్నో పైపులు కలిపి ఓ పిల్లర్‌లా తయారు చేస్తారు. ఆ తరవాతే బ్రిడ్జ్ నిర్మాణం మొదలవుతుంది. బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన పనులు వేరే చోట కొనసాగుతాయి. బ్రిడ్జ్ బ్లాక్‌లను వేరే చోట తయారు చేస్తారు. ఈ బ్లాక్స్‌ను పిల్లర్ల మధ్యలో అమర్చుతారు. ఇలా వంతెన నిర్మాణం పూర్తవుతుంది. అయితే...ఇలా నదులపై వంతెనలు కట్టే ముందు మరి కొన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. నీళ్లు ఏ దిశలో ప్రవహిస్తున్నాయి..? ఎంత లోతులో ఉన్నాయి..? మట్టి ఎలా ఉంది..? అనేది పరిశీలించాల్సి ఉంటుంది. ఎంత లోడ్‌ను వంతెన మోయగలదు అన్నదీ ముందుగానే పరిశీలించాలి. సాధారణంగా నదులపై మూడు రకాల బ్రిడ్జ్‌లు నిర్మిస్తారు. అవి Beam Bridge, Suspension Bridge, Arch Bridge.ఇవి కాకుండా మరి కొన్ని విధానాల్లోనూ వంతెన నిర్మాణాలు జరుగుతాయి.