Bihar IAS Officer: శానిటరీ ప్యాడ్స్ ఇస్తే రేపు కండోమ్స్ కూడా అడుగుతారు, అన్నీ ఫ్రీగా కావాలా - బిహార్ IAS ఆఫీసర్ సంచలన వ్యాఖ్యలు
Bihar IAS Officer: బిహార్ IAS అధికారిణి హర్జోత్ కౌర్ బుమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Bihar IAS Officer:
బాలిక అడిగిన ప్రశ్నకు అలాంటి సమాధానాలు..
హుందాగా ఉండాల్సిన అధికారులు కొన్ని సందర్భాల్లో నోరు జారి పరువు పోగొట్టుకుంటారు. బిహార్‌లో ఓ మహిళా IAS అధికారి ఇలానే నోరు జారి విమర్శల పాలయ్యారు. బిహార్ మహిళ,శిశు సంక్షేమ విభాగానికి ఎండీగా ఉన్న హర్జోత్ కౌర్ బుమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సశక్తి బేటీ, సమృద్ధి బిహార్ కార్యక్రమానికి హాజరైన ఆమెను కొందరు విద్యార్థినులు ప్రశ్నలు అడిగారు. యూనిసెఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్‌లో ఓ బాలిక హర్జోత్ కౌర్‌ను ఓ ప్రశ్న అడిగింది. "ప్రభుత్వం స్కూల్ డ్రెస్‌లు ఇస్తోంది. స్కాలర్‌షిప్‌లు కూడా అందిస్తోంది. వీటితో పాటు విద్యార్థులకు ఇంకెన్నో సౌకర్యాలు కల్పిస్తోంది. అలాంటప్పుడు రూ.20,30 విలువైన శానిటరీ ప్యాడ్స్‌ను ఇవ్వలేదా..?" అని ఓ బాలిక ప్రశ్నించింది. ఈ ప్రశ్న అడగగానే...అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. కానీ...హర్జోత్ కౌర్ మాత్రం సీరియస్ అయిపోయారు. హద్దు పద్దు లేని డిమాండ్‌లు అడుగుతుంటే అందరూ చప్పట్లు కొడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
A simple request for good quality sanitary pads (costing Rs 20-30) was met with a snarky response from Bihar’s IAS officer Harjot Kaur.
— Marya Shakil (@maryashakil) September 28, 2022
“Tomorrow you'll say the Govt can give jeans too. And why not some beautiful shoes after that… family planning method, nirodh too.” pic.twitter.com/b98VWA3b8H
డబ్బు తీసుకునే ఓటు వేస్తున్నావ్..
"మీరడిగినట్టుగానే ప్రభుత్వం మీకు శానిటరీ ప్యాడ్స్ ఇస్తుంది. రేపు మీరు జీన్స్, ప్యాంట్స్, షూస్ కావాలని అడుగుతారు. ఇక ఫ్యామిలీ ప్లానింగ్ విషయానికొస్తే...ప్రభుత్వం నుంచి కండోమ్‌లు కూడా కోరుకుంటారు. అన్నీ ప్రభుత్వం నుంచే ఉచితంగా పొందటానికి నేనెందుకు అలవాటు పడాలి..? ఆ అవసరమేంటి..? " అని కామెంట్ చేశారు. ఈ సమాధానం విని ఆ బాలికకు కాస్త కోపమొచ్చినట్టుంది. వెంటనే కౌంటర్ ఇచ్చింది.
"ఎన్నికల సమయంలో మీరే కదా ఓట్ల కోసం మా దగ్గరకు వచ్చి అడిగేది" అని ఘాటుగా బదులిచ్చింది. దీనిపై...ఇంకా ఫైర్ అయ్యారు హర్జోత్ కౌర్. "ఇంత కన్నా స్టుపిడిటీ ఉంటుందా..? నువ్వు ఓటు వేయకు. పాకిస్థాన్ వెళ్లిపో. ప్రభుత్వం తరపున సౌకర్యాలు, డబ్బు తీసుకునేందుకే ఓటు వేస్తున్నావు" అని మండిపడ్డారు. దీనికి వెంటనే ఆ బాలిక కూడా బదులిచ్చింది. "నేను ఇండియన్‌ని. పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లిపోతాను..?" అని ప్రశ్నించింది. "పన్నుల రూపంలో వచ్చిన డబ్బుతో ప్రభుత్వం ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తోంది. వాళ్లంతా సరిగ్గా పన్నులు కడుతున్నప్పుడు వాళ్లకు కావాల్సిన సేవల్ని డిమాండ్ చేయడంలో తప్పేంటి..? " అని అడిగింది ఆ బాలిక. ఈలోగా మరో బాలిక కూడా తమకున్న సమస్య లేంటో వివరించింది. టాయిలెట్స్ సరిగా ఉండటం లేదని, కొందరు అబ్బాయిలూ తమ టాయిలెట్స్‌లోకి వస్తుంటే ఇబ్బందిగా ఉందని చెప్పింది. ఈ సమస్యలపైనా సరిగా స్పందించలేదు..హర్జోత్ కౌర్. సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్న వేసింది. "ఇక్కడున్న అమ్మాయిలందరి ఇళ్లలో వాళ్లకు సెపరేట్ టాయిలెట్స్ ఉన్నాయా..?" అని ఆమె అడగటాన్ని చూసి అందరూ కంగు తిన్నారు. మొత్తానికి...అనవసర వ్యాఖ్యలు చేసి..వివాదంలో ఇరుక్కున్నారు హర్జోత్ కౌర్ బుమ్రా. ఈ వివాదంపై మహిళా కమిషన్ స్పందించింది. హర్జోత్ కౌర్ వ్యాఖ్యల్ని ఖండించింది. వారం రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని చెప్పింది.
Also Read: Hyderabad: వరసకి అన్నా చెల్లెళ్లు-షాకింగ్ ఘటనతో పారిపోయి Hydకు, ఆరా తీసి అవాక్కైన అధికారులు!