Modi in Rozgar Mela: ఆటోమొబైల్, ఫార్మా, టూరిజం రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయి: మోదీ
Modi in Rozgar Mela:51వేలకు పైగా అపాయింట్‌మెంట్ లెటర్స్ యువతకు పంపిణీ చేశారు.

Modi in Rozgar Mela: భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి బాటలో పయనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీని వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని సోమవారం మోదీ రోజ్‌గార్ మేళాలో ఉపాధి పొందిన వారికి నియామక పత్రాలు ఇచ్చిన సందర్భంగా మాట్లాడుతూ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన 51వేలకు పైగా అపాయింట్‌మెంట్ లెటర్స్ యువతకు పంపిణీ చేశారు. వీరిలో ఎక్కువ మంది భద్రతా దళాలకు చెందిన వారు ఉన్నారు.
రోజ్‌గార్ మేళా ద్వారా నియమితులైన వారికి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామకపత్రాలు అందించారు. వీరిని మోదీ అమృత్ రక్షకులుగా పేర్కొన్నారు. మన దేశ యువతకు కొత్త మార్గాలను అందజేయడం కోసం పారామిలిటరీ బలగాల నియామక ప్రక్రియలో అనేక మార్పులు చేశామని, ఈ దశాబ్దంలో భారతదేశం ప్రపంచంలో మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మారుతుందని అన్నారు. నేను హామీ ఇస్తే, నేను పూర్తి బాధ్యత వహిస్తానని మోదీ ఈ సందర్భంగా స్పష్టంచేశారు.
ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఆటో మొబైల్, ఫార్మా, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు శర వేగంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ రంగాల్లో యువతకు అధికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. 2030 నాటికి కేవలం పర్యాటక రంగం మాత్రమే ఆర్థిక వ్యవస్థకు రూ.20 లక్షల కోట్లు కంట్రిబ్యూట్ చేస్తుందని వెల్లడించారు. దాదాపు 13 నుంచి 14 కోట్ల దాకా కొత్త ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందన్నారు.
ఆహారం నుంచి ఫార్మాస్యూటికల్స్ వరకు, అంతరిక్షం నుంచి స్టార్టప్‌ల వరకు అన్ని రంగాలు వృద్ధి చెందితేనే భారత ఆర్థక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రూ.4 లక్షల కోట్ల విలువైన ఫార్మా రంగం 2030 నాటికి రూ.10 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన ఫార్మా పరిశ్రమను ఉదాహరణగా చూపించి వెల్లడించారు. దీని ప్రకారం, దశాబ్ద కాలంలో ఫార్మా పరిశ్రమకు యువత అవసరం ఎంతో ఉందని, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఆటోమొబైల్ రంగం కూడా వేగంగా వృద్ధి చెందుతుందని దానిని కూడా ముందుకు తీసుకెళ్లేందుకు యువ శక్తి అవసరం చాలా ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ రంగంలోనూ అపారమైన ఉపాధి అవకాశాలున్నాయని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌ను ఉదాహరణగా చూపిస్తూ, రాష్ట్రంలో సుపరిపాలన కారణంగా చట్టబద్ధమైన పాలనను స్థాపించడానికి దారితీసిందని, ఇది చాలా పెట్టుబడులను తీసుకువచ్చిందని మోదీ వెల్లడించారు. రాష్ట్రంలో భద్రతాయుతమైన వాతావరణం ఉంటేనే చట్టబద్ధమైన పాలనను అమలు చేయడం, అభివృద్ధిని వేగవంతం చేయడం సాధ్యమవుతుందని అన్నారు. ఇది ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతుందని, పెట్టుబడులను కూడా తీసుకువస్తుందని అన్నారు. నేరాల రేటు పెరుగుతున్న రాష్ట్రాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని మోదీ స్పష్టంచేశారు.
అనంతరం మోదీ జన్‌ధన్ యోజన గురించి ప్రస్తావించారు. తొమ్మిదేళ్ల క్రితం ఈ రోజున జన్‌ధన్ యోజన ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పథకం ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఉద్యోగ కల్పనలో కీలక పాత్రం పోషించిందని ప్రధాన మంత్రి వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

